పరిశ్రమలకు ఆన్‌లైన్‌లోనే పన్ను రాయితీలు
ABN , Publish Date - Sep 26 , 2026 | 04:13 AM
పరిశ్రమల యజమానులు తమకు రావాల్సిన పన్ను రాయితీ (ఎస్‌జీఎస్టీ రీయింబర్స్‌మెంట్) క్లెయిమ్‌ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.
కొత్త వ్యవస్థను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): పరిశ్రమల యజమానులు తమకు రావాల్సిన పన్ను రాయితీ (ఎస్‌జీఎస్టీ రీయింబర్స్‌మెంట్) క్లెయిమ్‌ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. జీఎస్టీ అమలుల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, భారీ, మెగా పరిశ్రమలకు చెల్లించాల్సిన పన్ను రాయితీ క్లెయిమ్‌లను వేగంగా, పారదర్శకంగా మంజూరు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసే విధానాన్ని అమలులోకి తెచ్చింది. వాణిజ్య పన్నుల శాఖ డిజిటల్‌గా జారీ చేసే ‘ఫారం-ఎ’ సర్టిఫికెట్‌ను ఇకపై అన్ని రకాల పరిశ్రమల రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లకు చెల్లుబాటు అయ్యే ఆధారంగా పరిగణిస్తారు.
పరిశ్రమల శాఖ పోర్టల్, వాణిజ్య పన్నులశాఖ పోర్టళ్లను అనుసంధానం చేసి ఆయా పరిశ్రమలకు చెల్లించాల్సిన పన్ను రాయితీ మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనే కచ్చితంగా లెక్కిస్తారు. జిల్లాస్థాయిలో పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) కేవలం డిజిటల్‌గా ధ్రువీకరించిన ‘ఫారం-ఎ’ ఆధారంగానే రీయింబర్స్‌మెంట్‌లను ఆమోదిస్తుంది. ఐటీ, ఎనర్జీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్... ఇలా అన్ని రంగాల పరిశ్రమలకు ఇక నుంచి ఈ డిజిటల్ విధానమే వర్తిస్తుంది. గతంలో ఉన్న జీఎస్టీ ఇబ్బందులను అధ్యయనం చేసేందుకు ఆర్థిక, పరిశ్రమలు, వాణిజ్య పన్నుల శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల మేరకు ఈ కొత్త ఆన్‌లైన్ మెకానిజమ్‌ను ప్రభుత్వం తెచ్చింది. దీనికి అనుగుణంగా మార్పులు చేయాలని ఆ శాఖలను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ వార్తలనూ చదవండి..
ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ