Share News

ఇంటర్‌ పరీక్షల్లో కీలక మార్పులు

ABN , Publish Date - Oct 16 , 2026 | 03:46 AM

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. గతేడాది నుంచి కొత్తగా ఎలక్టివ్‌ సబ్జెక్టు విధానం అమల్లోకి వచ్చింది. ద్వితీయ సబ్జెక్టుకు బదులుగా విద్యార్థులు గ్రూపుతో సంబంధం లేకుండా..

ఇంటర్‌ పరీక్షల్లో కీలక మార్పులు

  • కోర్‌ సబ్జెక్టులకు 2 రకాల పేపర్లు

  • ఎలక్టివ్‌, రెగ్యులర్‌కు వేర్వేరుగా

  • ఇక 16 రోజులలో పరీక్షలు పూర్తి

  • బయాలజీకి 40 పేజీలతో ఒకే బుక్‌లెట్‌

అమరావతి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. గతేడాది నుంచి కొత్తగా ఎలక్టివ్‌ సబ్జెక్టు విధానం అమల్లోకి వచ్చింది. ద్వితీయ సబ్జెక్టుకు బదులుగా విద్యార్థులు గ్రూపుతో సంబంధం లేకుండా ఏదైనా సబ్జెక్టును ఎలక్టివ్‌ కింద తీసుకోవచ్చు. దీంతో ఎంపీసీ విద్యార్థులు బయాలజీ, కామర్స్‌, హిస్టరీ లాంటి నచ్చిన సబ్జెక్టులను తీసుకునే వెసులుబాటు ఏర్పడింది. ఇలా అన్ని గ్రూపుల్లోని కొందరు విద్యార్థులు ఇతర గ్రూపుల్లోని సబ్జెక్టులను తీసుకున్నారు. దీంతో ఒకరోజు ఒక సబ్జెక్టు పరీక్ష మాత్రమే నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా గతేడాది పబ్లిక్‌ పరీక్షలు ఈ విధానంలో దాదాపు నెల రోజులు జరిగాయి. మధ్యలో 6 రోజులు సెలవులు వచ్చాయి. 24 రోజులు పరీక్షలు నిర్వహించారు.

ఈ సుదీర్ఘ పరీక్షల విధానాన్ని తగ్గించేందుకు బోర్డు కొత్త విధానం ప్రవేశపెడుతోంది. ఉదాహరణకు గణితం సబ్జెక్టును రెగ్యులర్‌గా రాసే ఎంపీసీ విద్యార్థులకు ఒకటి, ఇతర గ్రూపుల నుంచి ఎలక్టివ్‌ కింద గణితం తీసుకునే విద్యార్థులకు మరొకటి రూపొందించాలని నిర్ణయించింది. ఎలక్టివ్‌ సబ్జెక్టులు మొత్తం 14 ఉండగా, వాటిలో 8 కోర్‌ సబ్జెక్టులైన గణితం, ఫిజిక్స్‌, కెమిస్ర్టీ, బయాలజీ, సివిక్స్‌, ఎకనామిక్స్‌, కామర్స్‌, హిస్టరీకి రెండు రకాల పేపర్లు తయారు చేస్తారు. ఒక పేపర్‌ను ద్వితీయ భాషా సబ్జెక్టు పరీక్ష రోజు ఎలక్టివ్‌ సబ్జెక్టు తీసుకున్న విద్యార్థులకు ఇస్తారు. రెండో పేపరును రెగ్యులర్‌ షెడ్యూలు ప్రకారం జరిగే విద్యార్థులకు ఇస్తారు.


దీనివల్ల పరీక్షల నిర్వహణలో 8 రోజులు తగ్గుతాయని అధికారులు తెలిపారు. పాత విధానంలో 16 రోజులతో పరీక్షలు పూర్తవుతాయని పేర్కొన్నారు. కాగా ఇలా ఒకే సబ్జెక్టుకు రెండు రకాల పేపర్లు రూపొందించడం ఇదే తొలిసారి. ప్రథమ, ద్వితీయ రెండు సంవత్సరాల విద్యార్థులకు ఈ విధానం వర్తిస్తుంది. అలాగే అన్ని జనరల్‌ థియరీ సబ్జెక్టులకు 32 పేజీల బుక్‌లెట్‌ను అందించనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి రంజిత్‌ బాషా ఓ ప్రకటనలో తెలిపారు. ఒకేషనల్‌ కోర్సుల విద్యార్థులకు 24 పేజీల బుక్‌లెట్‌ విధానం కొనసాగుతుందన్నారు. బయాలజీ పరీక్షలో ఇకనుంచి 40 పేజీల సింగిల్‌ బుక్‌లెట్‌ను మాత్రమే ఇస్తారన్నారు. ఇప్పటి వరకూ బోటనీ, జువాలజీకి వేర్వేరుగా సమాధాన పత్రాలు ఇవ్వగా, వాటి స్థానంలో ఒక్కటే ఇవ్వనున్నారు. ఈ కీలక మార్పులను విద్యార్థులకు తెలియజేసి అవగాహన కల్పించాలని ప్రిన్సిపాళ్లకు సూచించారు.

ఈ వార్తలనూ చదవండి:

మీ ఛాయిస్‌ ఎవరు?

మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Updated Date - Oct 16 , 2026 | 03:46 AM