Share News

నిరర్థక వ్యాజ్యాలని ఎందుకు ప్రకటించకూడదు?

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:23 AM

వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు తదితరులపై నమోదైన కేసుల దర్యాప్తును సీబీఐ, ఈడీకి అప్పగించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి.

నిరర్థక వ్యాజ్యాలని ఎందుకు ప్రకటించకూడదు?

  • చంద్రబాబు తదితరులపై పిల్స్‌ వేసిన పిటిషనర్లకు హైకోర్టు ధర్మాసనం ప్రశ్న

  • వారిపై ఇప్పటికే కేసులు కొట్టివేశారని వెల్లడి

  • సీబీఐ, ఈడీ విచారణకు ఆదేశించాలన్న రెండు వ్యాజ్యాలపై ముగిసిన వాదనలు

  • చంద్రబాబు, ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం ఇది

  • ఆ కేసుల స్వీకరణను సీబీఐ, ఈడీ తిరస్కరించాయి

  • సీనియర్‌ న్యాయవాది రోహత్గీ వాదనలు

అమరావతి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు తదితరులపై నమోదైన కేసుల దర్యాప్తును సీబీఐ, ఈడీకి అప్పగించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలను ధర్మాసనం నమోదు చేసింది. వాదనలకు బలం చేకూర్చేలా కోర్టు ముందు ఉంచిన పలు వివరాలతో పాటు ఆయా కేసుల సమాచారాన్నీ పట్టిక రూపంలో తమ ముందు ఉంచాలని సీఐడీ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో, అప్పటి విపక్ష నేత చంద్రబాబు తదితరుల పై అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, స్కిల్‌ డెవల్‌పమెంట్‌, ఫైబర్‌ గ్రిడ్‌, రాజధాని అసైన్డ్‌ భూములు, మద్యం, ఉచిత ఇసుక పాలసీల విషయంలో సీఐడీ పలు కేసుల నమోదు చేసింది. ఆ కేసుల దర్యాప్తును సీబీఐ,ఈడీకి అప్పగించేలా ఆదేశించాలని కోరుతూ పాత్రికేయుడు బాలగంగాధర తిలక్‌ 2024లో హైకోర్టులో పిల్‌ దాఖలుచేశారు. దర్యాప్తులో భాగంగా సీజ్‌ చేసిన డాక్యుమెంట్లు, ఎలకా్ట్రనిక్‌ పరికరాలను సంబంధిత వ్యక్తులకు తిరిగి ఇవ్వకుండా విజయవాడ ఏసీబీ కోర్టును ఆదేశించాలంటూ, అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మరో పిల్‌ వేశారు.


ఈ పిల్స్‌ గురువారం మరోసారి విచారణకు వచ్చాయి. వాటిపై ధర్మాసనం స్పందిస్తూ, కేసులన్నింటినీ మూసివేస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో, ప్రస్తుత వ్యాజ్యాలను నిరర్ధమైనవిగా ఎందుకు ప్రకటించకూడదో చెప్పాలని ప్రశ్నించింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది రంజిత్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. ‘‘ప్రస్తుత పిల్‌ను 2024లో దాఖలు చేశాం. ప్రభుత్వం మారిన నేపఽథ్యంలో దర్యాప్తు అధికారులు కేసులను మూసివేసి నిందితులకు క్లీన్‌చిట్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చాం. చివరకు పిటిషనర్‌ ఆందోళన పడినట్టే జరిగింది. దర్యాప్తు అధికారులు సంబంధిత కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా కేసును రీ ఇన్వెస్టిగేట్‌ చేశారు.

146 మంది సాక్షులను తిరిగి విచారించి ట్రయల్‌ కోర్టులో క్లోజర్‌ రిపోర్టులు సమర్పించారు. దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న ఆధారాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఇతర పత్రాలను తిరిగి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని అనుబంధ పిటిషన్‌ వేశాం. ప్రస్తుత పిల్‌ను మూసివేస్తే, సింగిల్‌ జడ్జి ముందు పెండింగ్‌లో ఉన్న క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్ల పై ప్రభావం చూపుతాయి. ఆ పిటిషన్లను ప్రస్తుత పిల్‌తో జతచేసి విచారణ జరపాలి. చార్జిషీట్లు దాఖలు చేసినప్పటికీ పునఃవిచారణకు ఆదేశించే అధికారం హైకోర్టుకు ఉంది.’’ అని వాదించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, సింగిల్‌ జడ్జి వద్ద ఉన్న క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్లను, ప్రస్తుత పిల్‌కు జత చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. కేసుల దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న ఆధారాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఇతర పత్రాలు నిందితుడికి తిరిగి ఇవ్వకుండా, సింగిల్‌ జడ్జి వద్ద పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చు కదా అని ప్రశ్నించింది. పిల్‌లోని అంశాలపై అభిప్రాయం వ్యక్తం చేయకుండా విచారణను ముగిస్తామని, సింగిల్‌ జడ్జి వద్ద ఉన్న క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్ల పై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది.


రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, న్యాయవాది అనురాగ్‌ అహ్లువాలియా వాదనలు వినిపించారు. ‘‘చంద్రబాబుపై నాడు దాఖలు చేసిన కేసుల విషయంలో తగిన ఆధారాలు లభించకపోవడంతో విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్‌ తుది నివేదికలు దాఖలు చేసింది. వాటిని పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు ఈ కేసులన్నింటినీ మూసివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కేసుల మూసివేతను సవాల్‌ చేయడంతో పాటు తీర్పు ప్రతులు, క్లోజర్‌ రిపోర్ట్‌లు, ఇతర డాక్యుమెంట్లను ఇవ్వకపోవడంపై హైకోర్టులో రివిజన్‌ పిటిషన్లు వేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పిల్‌లో విచారించాల్సింది ఏమీ లేదు. ప్రస్తుత పిటిషనను నిరర్ధకమైనదిగా ప్రకటించాలి.

పిల్‌లో తాను జర్నలిస్టును అని పిటిషనర్‌ చెప్పారు తప్ప గతంలో తాను చేసిన ప్రజాసేవ, ఇతర వివరాలు వెల్లడించలేదు. పిటిషనర్‌ విశ్వసనీయతపై సందేహం ఉంది. కనీస ఆధారాలు లేకుండా పిల్‌ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వాన్ని అపకీర్తి పాల్జేసేందుకు పిటిషనర్‌ సీబీఐ దర్యాప్తు కోరుతున్నారు. ప్రస్తుత పిల్‌లో సీబీఐ అఫిడవిట్‌ దాఖలు చేస్తూ...తాము విచారణ చేయదగిన కేసు కాదని పేర్కొంది. ఈడీ సైతం అఫిడవిట్‌ దాఖలు చేస్తూ, ఈ కేసు మనీ లాండరింగ్‌కు సంబంధించింది కాదని, పిల్‌కు విచారణార్హత లేదని చెప్పింది. ఆయా కేసుల్లో పిటిషనర్‌ తిలక్‌ ఫిర్యాదుదారు కాదు.

ఏడు కేసులను ఏసీబీ కోర్టు మూసివేయగా, అందులో ఒక్క కేసులో మాత్రమే ఫిర్యాదుదారు ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కేసుల మూసివేత పై ఇతర ఫిర్యాదుదారులు అభ్యంతరం చెప్పలేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పిల్‌ లేనందున పిటిషనర్‌కు ఖర్చులు విధించి, ప్రజాహిత వ్యాజ్యాన్ని కొట్టివేయాలి.’’ అని కోరారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటెత్తిన పల్లెలు

అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ

Updated Date - Nov 06 , 2026 | 05:26 AM