Share News

అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం

ABN , Publish Date - Nov 07 , 2026 | 04:35 AM

ఇకపై రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌ చేసేవారికి వెన్నులో వణుకుపుట్టేలా చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఇసుక, ఎర్రమట్టి, రోడ్‌మెటల్‌ తదితర సూక్ష్మ ఖనిజ వనరులను తవ్వితీసి అక్రమంగా తరలించుకుపోయేవారిపై ఉక్కుపాదం మోపనుంది.

అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం

  • కేసులతోపాటు రెవెన్యూ రికవరీ చట్ట ప్రయోగం

  • గనులు సహా ఆరుశాఖల ఉమ్మడి కార్యాచరణ

  • ఇసుక, ఇతర ఖనిజాల అక్రమ తవ్వకం, రవాణా పరిధిని బట్టి తక్షణం ఆయా శాఖల చర్యలు

  • మార్గదర్శకాలు విడుదల చేసిన సర్కారు

  • రెండేళ్లలో 11,233 కేసులు నమోదైనట్టు వెల్లడి

ఇకపై రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌ చేసేవారికి వెన్నులో వణుకుపుట్టేలా చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఇసుక, ఎర్రమట్టి, రోడ్‌మెటల్‌ తదితర సూక్ష్మ ఖనిజ వనరులను తవ్వితీసి అక్రమంగా తరలించుకుపోయేవారిపై ఉక్కుపాదం మోపనుంది. వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు, అక్రమార్కులపై రెవెన్యూ రికవరీ చట్టం(ఆర్‌ఆర్‌ యాక్ట్‌)ను ప్రయోగించాలని నిర్ణయించింది.

అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇసుక, ఎర్రమట్టి, రోడ్‌మెటల్‌ తదితర సూక్ష్మ ఖనిజ వనరులను తవ్వితీసి అక్రమంగా తరలించుకుపోయేవారిపై ఉక్కుపాదం మోపాలని సర్కారు నిర్ణయించింది. చట్టపరంగా కఠినతరమైన కేసులను నమోదు చేయడంతోపాటు, అక్రమార్కులపై రెవెన్యూ రికవరీ చట్టం (ఆర్‌ఆర్‌ యాక్ట్‌)ను ప్రయోగించాలని నిర్ణయించింది. ఇకపై రాష్ట్రంలో ఇసుక, మట్టిని అక్రమంగా తవ్వి తరలించుకుపోవాలంటే వెన్నులో వణుకుపుట్టేలా గనులశాఖకు సర్కారు స్పష్టమైన కార్యాచరణ ఇచ్చింది.

ప్రస్తుతం అక్రమ మైనింగ్‌ను నిరోధించే చట్టాలతోపాటు, ఇతర శాఖల పరిధిలోని చట్టాలను కూడా వర్తింపచేసి, కఠిన చర్యలు తీసుకునేలా గనుల శాఖతోపాటు మరో ఆరు శాఖలకు ఉమ్మడి కార్యాచరణ ఇచ్చింది. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్‌కు మరిన్ని బాధ్యతలు, అధికారాలను కట్టబెట్టింది. అక్రమ తవ్వకాలు, రవాణా, నిల్వలపై ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ వ ర్గాల నుంచి వచ్చే ఫిర్యాదులకు జవాబుదారీ తీసుకొచ్చేలా గనులశాఖ 30 రోజుల వ్యవధిలో ప్రత్యేక డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేసి నిరంతర సమీక్ష చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేశ్‌ కుమార్‌ మీనా శుక్రవారం ఉత్తర్వులు (జీవో 278) జారీ చేశారు.


ఇసుక, మట్టి, రోడ్‌ మెటల్‌, ఇతర వనరుల అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టేందుకుగాను, ఇకపై గనుల శాఖతో పాటు అటవీ, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖలు, జలవనరుల విభాగం, రవాణాశాఖలు, వాటి పరిధిలోని అనుబంధ విభాగాలు సంయుక్తంగా పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇసుక అక్రమ తవ్వకాలపై విచారించిన హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. గనులు, ఖనిజాల పరిరక్షణ చట్టాలు, వాటి రూల్స్‌, మార్గదర్శకాల అమలును మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ పనితీరు మరింత మెరుగుపర్చడం, అక్రమార్కులపై కేసు నమోదు చేసిన దగ్గరి నుంచి ఆర్‌ఆర్‌ చట్టం ప్రయోగం వరకు వివిధ దశల్లో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేసింది.

మార్గదర్శకాల్లోని కీలకాంశాలు

ఫిర్యాదు రాగానే గనుల శాఖ స్పందించాలి. ఎవరి భూమిలో అక్రమ మైనింగ్‌ జరిగిందో గుర్తించాలి. అంటే, అది అటవీ భూమి అయితే, ఆ శాఖ తక్షణమే అటవీ చట్టాల ప్రకారం చర్యలు చేపట్టాలి. జలవనరుల శాఖదైతే, ఆ శాఖ అమలు చేసే చట్టాల ప్రకారం చర్యలు చేపట్టాలి. ఒకవేళ రెవెన్యూ భూమి అయితే ఆర్‌డీవో, లేదా తహశీల్దార్‌ చ ట్టబద్దమైన చర్యలు తీసుకోవాలి.

పట్టా భూమిలోనే అక్రమంగా ఇసుక, మట్టిని తవ్వి తీసుకెళ్తే.. రెవెన్యూ, గనుల శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టాలి. గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్‌ పరిధిలో అక్రమం జరిగితే, ఆయా శాఖలు స్పందించి చర్యలు తీసుకోవాలి. అక్రమ తవ్వకాలపై ప్రజల నుంచి ఫిర్యాదు రాగానే అది తమ పరిధిలోది కాదని ఏ శాఖ కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. విధిగా ఉమ్మడిగా కార్యాచరణ ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.


  • ప్రతి ఫిర్యాదుకు కూడా యూనిక్‌ నెంబర్‌ కేటాయించాలి. ఫిర్యాదు రాగానే మూడు రోజుల్లోనే విచారణ పూర్తిచే యాలి. పక్కా ఆధారాలను రికార్డుచేయాలి.

  • అక్రమ మైనింగ్‌ వ్యాపారం చేస్తూ ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేస్తున్నారని నిర్ధారణ అయిన తర్వాత బాధ్యులపై చట్టపరంగా కేసులు నమెదుచేసి, వారి చర్యల వల్ల ప్రభుత్వానికి జరిగిన నష్టం ఎంతో రాబట్టే ప్రయత్నం చేయాలి. అక్రమాలకు ఉపయోగించిన వాహనాలను సీజ్‌ చేయడంతోపాటు, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించాలి. ఈ ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది రక్షణ బాధ్యతలను జిల్లా ఎస్పీ పర్యవేక్షించాలి. ఒక వేళ అధికారుల వైఫల్యం, తప్పిదాల వల్ల అక్రమ మైనింగ్‌ జరిగినట్లు నిర్ధారణ అయితే, బాధ్యులైన అధికారులపై జిల్లా కలెక్టర్‌ శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.

  • జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో ఉండే టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ప్రతి పక్షం రోజులకోసారి సమావేశమై అక్రమ మైనింగ్‌ కేసులపై సమీక్ష చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే, వాటి తాజా పరిస్థితిపై గనులశాఖకు ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలి. పక్షం రోజుల వ్యవధిలో కొత్తగా ఎన్ని అక్రమ మైనింగ్‌ కేసులు వచ్చాయి, వాటిపై జరిగిన విచారణ, చట్టపరంగా తీసుకున్న చర్యలు, ఇంకా పెండింగ్‌లో ఉన్న పాత కేసుల పరిస్థితిపై వాస్తవిక నివేదికలను ప్రతి పక్షం రోజులకోసారి కలెక్టర్‌ గనుల శాఖకు నివేదించాలని ప్రభుత్వం ఆదేశించింది.

  • ఫిర్యాదులపై ప్రభుత్వ చర్యలు సమగ్రంగా వివరించేలా గనుల శాఖ డైరెక్టర్‌ 30 రోజుల వ్యవధిలో ప్రత్యేక డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.


రెండేళ్లలో 11,233 కేసులు

రెండేళ్ల వ్యవధిలో అక్రమ ఇసుక తవ్వకం దారులపై 2,113 కేసులు, మైనర్‌ మినరల్స్‌కు సంబంధించి 9,120 కేసులు నమోదుచేసినట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. అక్రమ తవ్వకం దారులనుంచి 6.24 కోట్లు, మైనర్‌ మినరల్స్‌ అక్రమార్కుల నుంచి రూ.340 కోట్ల జరిమానాను రాబట్టినట్టు ప్రభుత్వం వివరించింది.

ఈ వార్తలనూ చదవండి:

కౌంటింగ్‌కు వేళాయె...

సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 07 , 2026 | 04:40 AM