ధరలకు చెక్ పెట్టాలి!
ABN , Publish Date - Oct 28 , 2026 | 04:53 AM
బహిరంగ మార్కెట్‌లో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలపై ధరల భారాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. దీనిపై సీఎం చంద్రబాబు మంగళవారం పౌరసరఫరాలశాఖతోపాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.
తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు అందేలా చర్యలు
మొబైల్ వాహనాల ద్వారా ధరణి బ్రాండ్ బియ్యం
ఇతర రకాల బియ్యం ధరలపైనా నియంత్రణ
అధికారులకు సీఎం ఆదేశాలు
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): బహిరంగ మార్కెట్‌లో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలపై ధరల భారాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. దీనిపై సీఎం చంద్రబాబు మంగళవారం పౌరసరఫరాలశాఖతోపాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. వివిధ రకాల నిత్యావసర వస్తువుల ధరలను వీలైనంత వరకు తగ్గించి, ప్రజలకు తక్కువ ధరలకు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. బియ్యం, కందిపప్పు, పామాయిల్, గోధుమ పిండి వంటి వస్తువులను తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే ‘ధరణి’ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్న సూపర్ ఫైన్ బియ్యాన్ని రైతు బజార్లకే పరిమితం చేయకుండా.. మొబైల్ వాహనాల ద్వారా మున్సిపాలిటీలు, మండల కేంద్రాలకు కూడా విస్తరించాలని దిశానిర్దేశం చేశారు. సూపర్ ఫైన్ రకం బియ్యాన్ని కిలో రూ.49, రూ.50కు విక్రయుంచాలన్నారు. ఇతర రకాల బియ్యం ధరలపైనా నియంత్రణ ఉండేలా చూడాలని ఆదేశించారు.
పొరుగు రాష్ట్రాలకు ధాన్యం అక్రమంగా తరలిపోకుండా అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులు, టోల్‌గేట్ల వద్ద నిఘా పెంచాలని, ధాన్యం, బియ్యం మార్కెట్ సెస్సు భారాన్ని తగ్గించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. బహిరంగ మార్కెట్‌లో కూడా బియ్యం ధరలను అదుపులో ఉంచేందుకు మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారుల అసోసియేషన్లతో చర్చలు జరుపుతున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. వివిధ రకాల బియ్యం ధరలను తగ్గించి, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి వారు అంగీకరించినట్లు వివరించారు. బీపీటీ రకం స్టీమ్ బియ్యాన్ని కిలో రూ.66, సాధారణ రకం స్టీమ్ బియ్యాన్ని రూ.47కు మించకుండా విక్రయించేందుకు మిల్లర్లు అంగీకరించారని చెప్పారు.
దీపావళికి రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాలు
దీపావళి నాటికి రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు నెలకు కిలో కందిపప్పును రూ.100, లీటరు పామాయిల్‌ను రూ.125, గోధుమ పిండి కిలో రూ.25కే అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పామాయిల్‌ను టెండర్ల ద్వారా సేకరించి సరఫరా చేసే ప్రక్రియను చేపట్టాలన్నారు. ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వ సరఫరా ద్వారా వినియోగదారులకు ఉపశమనం కలిగించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ.170-200 వరకు పలుకుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వ జోక్యంతో ధరలను తగ్గించేలా చూడాలని చెప్పారు. కేంద్రం నుంచి అవసరమైన సహాయం తీసుకోవాలన్నారు. పామాయిల్ ధరలను తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
ఉల్లి ధరలపైనా సీఎం ఆరా
ఉల్లి ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపైనా సీఎం ఆరా తీశారు. ప్రభుత్వం ఇప్పటికే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం ద్వారా రైతుబజార్లలో కిలో రూ.35కే ఉల్లిని విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరో 800 టన్నుల ఉల్లిని అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. కర్నూలు ప్రాంతం నుంచి ఉల్లి పంట మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తే సరఫరా పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉందని వివరించారు. సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని సీఎం అధికారులకు సూచించారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన చోట ప్రభుత్వం జోక్యం ఉండాలని స్పష్టం చేశారు. ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వంపై నెలకు సుమారు రూ.100 కోట్ల భారం పడుతుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి భారమైనా సరే.. ధరల పెరుగుదల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలని సీఎం స్పష్టం చేశారు. సమీక్షా సమవేశంలో సీఎస్ సాయిప్రసాద్, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి కన్నబాబు సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!
ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు