Share News

రాష్ట్రానికి మరో 161 పీజీ వైద్య సీట్లు

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:14 AM

రాష్ట్రంలో పీజీ వైద్య సీట్లు మరిన్ని పెరిగాయి. 11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు 161 కొత్త పీజీ సీట్లను మంజూరు చేస్తూ జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రానికి మరో 161 పీజీ వైద్య సీట్లు

  • 11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు వర్తింపు

  • ఆయా కాలేజీల్లో మెరుగైన వసతులు

  • సర్కారు ప్రతిపాదనకు వైద్య మండలి ఓకే

అమరావతి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పీజీ వైద్య సీట్లు మరిన్ని పెరిగాయి. 11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు 161 కొత్త పీజీ సీట్లను మంజూరు చేస్తూ జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15 స్పెషాలిటీ కోర్సుల్లో ఈ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 163 పీజీ సీట్లు పెంచాలని ప్రతిపాదనలు పంపగా ఎన్‌ఎంసీ 161 సీట్లకు అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వం సదరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎన్‌ఎంసీ మార్గదర్శకాలకు అనుగుణంగా బోధనా సిబ్బంది నియామకాలు చేపట్టడంతోపాటు, పడకల పెంపు, వైద్య పరికరాలు, మౌలిక వసతులను కల్పించింది.

వీటిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎన్‌ఎంసీ 161 పీజీ సీట్లను అదననంగా కేటాయింది. ఫలితంగా మెరిట్‌ విద్యార్థులకు పీజీ వైద్య విద్య మరింత చేరువకానుంది. వైద్య విభాగాల వారీగా ఆర్థోపెడిక్స్‌లో అత్యధికంగా 27 సీట్లు మంజూరయ్యాయి. చర్మ, సుఖ వ్యాధుల విభాగం(డీవీఎల్‌), ఈఎన్‌టీ, పాథాలజీ విభాగాల్లో 16 చొప్పున, రేడియా డయాగ్నోస్టిస్‌ 14, పీడియాట్రిక్స్‌, జనరల్‌ సర్జరీ విభాగాల్లో 12 చొప్పున, జనరల్‌ మెడిసిన్‌, అనస్థీషియాలజీ, ఆప్తాల్మాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్‌ విభాగాల్లో 8 చొప్పున, ఎమర్జెన్సీ మెడిసిన్‌, ప్రసూతి, సైకియాట్రి, రేడియేషన్‌ అంకాలజీ విభాగాల్లో 4 చొప్పున సీట్లు లభించాయి.

ప్రస్తుతం మంజూరైన 161 సీట్లను 2026-27 విద్యా సంవత్సరం పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని డీఎంఈ డాక్టర్‌ విష్ణువర్థన్‌ తెలిపారు. గత విద్యా సంవత్సరంలో 13 ప్రభుత్వ వైద్య కళాశాలల నుంచి మొత్తం 150 పీజీ వైద్య విద్య సీట్ల మంజూరుకు దరఖాస్తులు పంపారు. వీటి పరిశీలన అనంతరం ఎన్‌ఎంసీ 142 సీట్లను మంజూరు చేసింది.


గర్భిణులకు ప్రత్యేక ఏర్పాట్లు..

వరుస తుఫాన్ల ప్రభావంతో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణకు ఆరోగ్యశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రసూతి సమయం సమీపించిన గర్భిణులను గుర్తించి ముందుగానే ఆసుపత్రులకు తరలించడంతో తుఫాను సమయంలో రవాణా కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి తప్పింది.

ఈ వార్తలనూ చదవండి:

కౌంటింగ్‌కు వేళాయె...

సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 07 , 2026 | 01:20 AM