ఆస్పత్రికి వెళ్లే మార్గం కానరాక.. ఇంటి వద్దే ప్రసవం, తల్లి మృతి
ABN , Publish Date - Sep 26 , 2026 | 03:36 AM
పురిటి నొప్పులు వస్తున్నా వర్షాల కారణంగా ఊరు నుంచి వెళ్లే దారిలేక ఆ నిండు గర్భిణి ఇంటి వద్దే ఉండిపోవలసి వచ్చింది. వరదతో వాగుపై వంతెన కొట్టుకుపోవడంతో ఆస్పత్రికి వెళ్లే మార్గం లేక ఇంటి వద్దనే మగబిడ్డకు జన్మనిచ్చి ఆమె కన్నుమూసింది.
వరదతో కొట్టుకుపోయిన వంతెన
వాగు దాటలేకపోయిన వైనం
అల్లూరి జిల్లాలో ఘటన
సీలేరు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): పురిటి నొప్పులు వస్తున్నా వర్షాల కారణంగా ఊరు నుంచి వెళ్లే దారిలేక ఆ నిండు గర్భిణి ఇంటి వద్దే ఉండిపోవలసి వచ్చింది. వరదతో వాగుపై వంతెన కొట్టుకుపోవడంతో ఆస్పత్రికి వెళ్లే మార్గం లేక ఇంటి వద్దనే మగబిడ్డకు జన్మనిచ్చి ఆమె కన్నుమూసింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం ధారకొండ పంచాయతీ పరిధిలోని చిన్నగంగవరంలో చోటుచేసుకుంది. చిన్నగంగవరం గ్రామానికి చెందిన పాంగి సన్యాసిరావు, నిండు గర్భిణైన అతని భార్య లావణ్య (28) కలసి వారం క్రితం ధారకొండ ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. పరీక్షలను నిర్వహించిన వైద్యాధికారి ఏ క్షణంలోనైనా పురిటి నొప్పులు రావచ్చని, ప్రసవం అయ్యేంత వరకు ఆస్పత్రిలోని ఉండాలని సూచించారు. అయితే నొప్పులు వచ్చే సమయానికి ఆస్పత్రికి తిరిగి వస్తామని చెప్పి ఇంటికి వెళ్లిపోయారు. గురువారం సాయంత్రం లావణ్యకు నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే గంగవరం-చిన్నగంగవరం గ్రామాల మధ్య గల వాగుపై నిర్మించిన వంతెన వర్షాలకు రెండు రోజుల క్రితం కొట్టుకుపోయింది. వాగులో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో దాటడానికి వీలుకాలేదు. దీంతో లావణ్యకు ఇంటి వద్దనే డెలివరీ చేయాల్సి వచ్చింది. తన భార్య మగబిడ్డకు జన్మనిచ్చి మృతి చెందినట్టు భర్త సన్యాసిరావు తెలిపారు. వైద్యుల సూచన పాటించి ఆస్పత్రిలో ఉంటే ఆమె ప్రాణం పోయేది కాదని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి..
ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ