Share News

ఈ-పంట నమోదుపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: మంత్రి అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Jul 03 , 2026 | 05:32 PM

ఏపీలో ఈ-పంట నమోదుపై ప్రతిపక్ష నేత జగన్ చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.

ఈ-పంట నమోదుపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: మంత్రి అచ్చెన్నాయుడు
Andhra Pradesh E Crop Registration

అమరావతి, జులై 3: ఏపీలో ఈ-పంట నమోదుపై ప్రతిపక్ష నేత జగన్ చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఆయన మాట్లాడుతూ.. అబద్ధాలకు జగన్ అంబాసిడర్‌గా, అసత్యాలకు సాక్షి వేదికగా మారిందని ఆరోపించారు. రైతులను తప్పుదోవ పట్టించే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, విష ప్రచారాలతో వాస్తవాలను దాచడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఖరీఫ్–2025 సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 53.32 లక్షల మంది రైతులకు చెందిన 117.39 లక్షల ఎకరాల్లో ఈ-పంట నమోదు పూర్తయ్యిందని మంత్రి తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నమోదుతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో ఈ-పంట నమోదు గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. అలాగే రబీ 2025–26 సీజన్‌లో 99.7 శాతం ఈ-పంట నమోదు పూర్తి చేయడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.


మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన APAIMS 2.0 ద్వారా డిజిటల్ ఈ-పంట నమోదులో సాంకేతిక విప్లవం తీసుకొచ్చాం. కృత్రిమ మేథస్సు (AI), జియో-రెఫరెన్సింగ్, ఉపగ్రహ సాంకేతికత వంటి ఆధునిక విధానాలతో పారదర్శకంగా ఈ-పంట నమోదవుతోంది. రైతులకు సబ్సిడీలు, పంట బీమా, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు వేగంగా అందించాలనే లక్ష్యంతో డిజిటల్ క్రాప్ సర్వేను అమలు చేస్తున్నాం. ఈ విధానం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను చూసి జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కొబ్బరి ధరల అంశంలో కూడా సాక్షి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తోంది. ఇలాంటి వార్తలతో కొబ్బరి మార్కెట్‌ను దెబ్బతీయాలనే కుట్ర జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తప్పుడు ప్రచారాలతో మార్కెట్‌ను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదు’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి...

పొగాకు కొనుగోళ్లలో అక్రమాలను సహించం: మంత్రి అచ్చెన్నాయుడు

పాలమూరు పౌరుషమా? కల్వకుంట్ల పౌరుషమా చూసుకుందాం: మంత్రి జూపల్లి సవాల్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 03 , 2026 | 06:48 PM