Share News

పోలవరం ఎమ్మెల్యేపై పవన్‌ సీరియస్‌

ABN , Publish Date - Oct 10 , 2026 | 04:22 AM

ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వ్యవహారశైలిపై ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలవరం ఎమ్మెల్యేపై పవన్‌ సీరియస్‌

  • అవినీతి, ఒంటెత్తు పోకడలపై విచారణ

అమరావతి/ఏలూరు, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వ్యవహారశైలిపై ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై వస్తున్న అవినీతి ఆరోపణలు, క్యాడర్‌ను విస్మరించడం, కుటుంబ వివాదాలు రచ్చకెక్కడం తదితర అంశాలను తీవ్రంగా పరిగణించారు. ఈ వివాదాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు శుక్రవారం ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా బాలరాజుపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, నియోజకవర్గంలో పార్టీ విజయానికి కష్టపడిన నాయకులు, క్యాడర్‌ను విస్మరించి ఎమ్మెల్యే బాలరాజు ఒంటెత్తు పోకడలకు పోతున్నారనే విమర్శలున్నాయి. కొత్తగా వచ్చిన వారికి నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టడంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి పెరిగింది.

దీంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇక, పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద గిరిజనేతరులకు ప్రభుత్వం కేటాయించే భూముల్లో ఎమ్మెల్యే అనుచరులు భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. లబ్ధిదారుల నుంచి ముందుగానే ఖాళీ చెక్కులు, ఒప్పంద పత్రాలు రాయించుకున్నట్లు విమర్శలున్నాయి. బెల్టు షాపు నిర్వహించే వ్యక్తుల నుంచి రూ.లక్షల్లోనే వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే తన ఇంటికి సమీపంలో ఒక ప్రైవేట్‌ పాఠశాలను ఏర్పాటు చేసి, జంగారెడ్డిగూడెంలోని ఓ కార్పొరేట్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నారని సమాచారం.


సరిదిద్దుకుంటానని చెప్పి..

గతంలో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు, పార్టీ వివాదాలపై బాలరాజును పార్టీ ముఖ్య నాయకులు పిలిపించి మందలించారు. మంత్రి మనోహర్‌తో జరిగిన సమావేశంలో.. నెల రోజుల్లో తన పద్ధతి మార్చుకుంటానని చెప్పారు. గిరిజన ప్రాంతం నుంచి ఎన్నికైన నేపథ్యంలో పారదర్శక పాలన అందించాలని పవన్‌ సైతం సూచించినా ఆయన తీరు మారలేదు. దీంతో బాలరాజు వ్యవహారాన్ని పార్టీ సీరియ్‌సగా పరిగణించింది.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 04:22 AM