బియ్యం ధరలకు కళ్లెం!
ABN , Publish Date - Nov 15 , 2026 | 02:51 AM
బియ్యం ధరల పెరుగుదల, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. ఓవైపు ధాన్యం, బియ్యం నిల్వలపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెంచగా...
నిల్వలపై కేంద్రం.. ధరలపై రాష్ట్రం ఉక్కుపాదం
బ్లాక్ మార్కెటింగ్ అడ్డుకట్టకు చర్యలు
ధాన్యం, బియ్యం స్టాక్ లెక్కలు చెప్పి తీరాల్సిందే
పాత ఎంఆర్‌పీ ఉన్నా కొత్త ధరలకే విక్రయించాలి
రాష్ట్రవ్యాప్తంగా 294 విజిలెన్స్ బృందాల తనిఖీలు
10.43 కోట్ల సరుకులు స్వాధీనం.. 516 కేసులు నమోదు
బ్లాక్ మార్కెట్‌కు పాల్పడితే పీడీ యాక్టు: విజిలెన్స్ డీజీ హరీశ్
అమరావతి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): బియ్యం ధరల పెరుగుదల, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. ఓవైపు ధాన్యం, బియ్యం నిల్వలపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెంచగా.. మరోవైపు ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. వ్యాపారులు, రైస్ మిల్లర్లు తమ వద్ద ఉన్న నిల్వల వివరాలు ప్రతి శుక్రవారం వెల్లడించాల్సిందేనని కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలు స్టాక్ లిమిట్స్ విధించేందుకు కేంద్రం అనుమతించింది. ఇంకోవైపు రాష్ట్రంలో రైస్ మిల్లర్లు, వ్యాపారుల వద్ద ఉన్న పాత బియ్యం నిల్వలకు సైతం రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన కొత్త ధరలే వర్తిస్తాయని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను పెడచెవిన పెడుతున్న మిల్లర్లు, వ్యాపారుల్ని కట్టడి చేసి వినియోగదారుడిపై అధిక భారం పడకుండా అడ్డుకునే చర్యలకు కూటమి ప్రభుత్వం ఉపక్రమించింది.
ఏపీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నేతృత్వంలో పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారులతో ఉమ్మడిగా 294 బృందాలను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు చేయించింది. ఉల్లంఘనలకు పాల్పడుతున్న వ్యాపారులపై 516 కేసులు నమోదు చేసి, 10.43 కోట్ల రూపాయల సరుకులు స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. 248 మార్కెట్లు, 714 హోల్‌సేల్ వ్యాపార సంస్థలు, 17 రైస్ మిల్లులు, 13 గోదాములు, 144 రిటైల్ దుకాణాలను పరిశీలించినట్లు వివరించారు.
159 టన్నుల బియ్యం, 2017 టన్నుల ధాన్యం, 832 కిలోల కందిపప్పు, 1050 కిలోల అక్రమ రవాణా సరుకులు, 1930 లీటర్ల వంటనూనె, 9.3 టన్నుల ఇతర సరుకులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై నిరంతర నిఘా కొనసాగుతుందని, అక్రమాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మూణ్నెళ్లుగా ధరలు ఆకాశానికి
గత మూడు నెలలుగా రాష్ట్రంలో బియ్యం ధరలతో పాటు పప్పులు, పంచదార, నూనెలు, ఇతర నిత్యావసరాలు, ఉల్లి, వెల్లుల్లి వంటి వాటి ధరలు కూడా పెరుగుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా సన్నబియ్యం ధర కిలో రూ.50 నుంచి రూ.90కి చేరింది. ఒక్కసారిగా ప్రజల్లో వ్యతిరేకత రావడంతో కేంద్ర ప్రభుత్వం మూడు వారాల క్రితం చర్యలకు ఉపక్రమించింది.
ఎల్‌నినో ప్రభావం కన్నా వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి అక్రమ నిల్వలు చేయడంతోనే ధరలు పెరుగుతున్నట్లు పసిగట్టింది. వెంటనే దక్షిణాది రాష్ట్రాలు రంగంలోకి దిగి అక్రమ నిల్వల్ని వెలికితీసి సామాన్యులపై ధరల భారం పడకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. బాస్మతి, నాన్ బాస్మతి, సన్న బియ్యం, సాధారణ రకం, ఉప్పుడు బియ్యం, నూక, ధాన్యం నిల్వలతో పాటు సాంబ మసూరి, సోనా మసూరి, స్వర్ణ, జీరా సాంబా వంటి బియ్యం రకాల నిల్వల్ని వెలికి తీసి ధరలు రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాలని ఈ నెల 7న స్పష్టమైన సూచనలు చేసింది. వ్యాపారులు, మిల్లర్లు, హోల్‌సేల్ డీలర్లు, రిటైలర్లు, ధాన్యం నిల్వదారులు తదితరులపై చర్యలకు పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ శాఖల్ని రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా పంపించినా ఆశించిన ఫలితం కనిపించలేదు.
దీంతో ఈ రెండు శాఖలకు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను జత చేసి గత పది రోజల్లో 294 బృందాలతో తనిఖీలు చేయించింది. విజిలెన్స్ బృందాలు ఎక్కడికక్కడ మిల్లర్లు, వ్యాపారులు, దళారుల అక్రమాలను గుర్తించి భారీగా కేసులు నమోదు చేశాయి. కోట్లాది రూపాయల అక్రమ నిల్వల్ని వెలికి తీసి స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. అక్రమ నిల్వలపై దాడులు కొనసాగిస్తామని, సిండికేట్‌గా ఏర్పడి ధరలు పెంచితే చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని విజిలెన్స్ డీజీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు. రేషన్ బియ్యాన్ని బ్లాక్‌లో రాష్ట్రం దాటించే వ్యాపారులపైనా గట్టి నిఘా పెట్టి కట్టడి చేయాలని జిల్లాల్లోని విజిలెన్స్ ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
పాత స్టాక్ ఉన్నా కొత్త ధరలే..
రాష్ట్రంలో బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇటీవల ఖరారు చేసిన ధరల ప్రకారం బీపీటీ(సోనా), బీపీటీ(సాంబా), కేఎన్‌ఎం రకాల బియ్యం కిలో రూ.66కు మించకూడదు. హెచ్‌ఎంటీ, ఆర్‌ఎన్‌ఆర్ రకాలు రూ.76కు, జై శ్రీరామ్ రకం రూ.82కు, ఎంటీయూ సాధారణ రకాలు రూ.47కు విక్రయించాలి.
ఈ ధరల్ని మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు, రిటైలర్లు, పెద్ద రిటైల్ చైన్ సంస్థల వద్ద ఉన్న అన్ని నిల్వలకూ వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే కొందరు వ్యాపారులు ప్యాకింగ్‌పై పాత తేదీలు ముద్రించి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ తనిఖీల్లో బయట పడింది. వారిపై విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేశారు. పాత ప్యాకింగ్ అయినా, ఎంఆర్‌పీ ఎంత ముద్రించినా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కొత్త ధరలకే విక్రయించాలని.. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం