Share News

మూడు రోజుల కస్టడీకి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:47 AM

రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిని మూడు రోజులపాటు కస్టడీకి తీసుకొని విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతి ఇచ్చింది.

మూడు రోజుల కస్టడీకి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి

  • జైల్లో విచారించేందుకు కోర్టు అనుమతి

గుంటూరు(లీగల్‌), నవంబరు 20(ఆంధ్రజ్యోతి): రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిని మూడు రోజులపాటు కస్టడీకి తీసుకొని విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతి ఇచ్చింది. ఈమేరకు గుంటూ రు 1వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం. జగదీశ్వరి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘ఎన్నికల అనంతరం వెంగళాయపాలానికి చెందిన బ్యాలెట్‌ బాక్సులను స్ర్టాంగ్‌ రూమ్‌కు తరలిస్తున్న సిబ్బందిని అడ్డుకున్నారు. బ్యాలెట్‌ బాక్సుని బలవంతంగా లాక్కొని 2 గంటలపాటు ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించారు.’ అని నల్లపాడు పోలీసులు, అప్పిరెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. అదే రోజు అప్పిరెడ్డి ని అరెస్టు చేయగా కోర్టు 14 రోజులపాటు రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అప్పిరెడ్డిని తమ కస్టడీలోకి తీసుకొని విచారిస్తేనే నిజాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటూ పోలీసులు ఒకటవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో పిటిషన్‌ వేశారు. దీంతో అప్పిరెడ్డిని శనివారం ఉదయం నుంచి సోమవారం సాయంత్రం వరకు మూడు రోజులపాటు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లోనే విచారించేందుకు అనుమతి ఇచ్చింది. కాగా, తనను బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ అప్పిరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై 2వ అదనపు జిల్లా కోర్టులో వాదనలు జరిగాయి. న్యాయమూర్తి వై. నాగరాజ తీర్పును ఈ నెల 25కు వాయిదా వేశారు.

ఈ వార్తలనూ చదవండి:

భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..

Updated Date - Nov 21 , 2026 | 06:16 AM