Share News

అర్నబ్‌ నష్టం 4563 కోట్లు

ABN , Publish Date - Oct 30 , 2026 | 03:42 AM

అర్నబ్‌ తుఫాన్‌ కారణంగా రూ.4563 కోట్ల మేర నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశామని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్రానికి ఈ మేరకు నివేదిక పంపామని క్యాబినెట్‌ భేటీలో మంత్రులకు తెలిపారు.

అర్నబ్‌ నష్టం 4563 కోట్లు

  • కేంద్రానికి రాష్ట్రం ప్రాథమిక నివేదిక

  • అమిత్‌ షాకు ఫోన్‌లో వివరించాను

  • ఆయన వెంటనే స్పందించారు

  • నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం రాక

  • తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉండే

  • ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్తు కేబుల్స్‌

  • క్యాబినెట్‌ భేటీలో వెల్లడించిన సీఎం

అమరావతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): అర్నబ్‌ తుఫాన్‌ కారణంగా రూ.4563 కోట్ల మేర నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశామని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్రానికి ఈ మేరకు నివేదిక పంపామని క్యాబినెట్‌ భేటీలో మంత్రులకు తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం, సహాయక చర్యలు, బాధితులకు ప్రభుత్వ సాయంపై చర్చ జరిగింది. ఉండవల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి హైబ్రీడ్‌ విధానంలో జరిగిన భేటీలో మంత్రులు వర్చువల్‌గా పాల్గొన్నారు.

సంబంధిత అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అజెండాను ఆమోదించిన తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులతో మాట్లాడారు. అర్నబ్‌ వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు శుక్రవారం ఐదుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం రాష్ర్టానికి వస్తుందని తెలిపారు. వీరు తుఫాన్‌ నష్టాన్ని పరిశీలించి పూర్తిస్థాయి నివేదికను కేంద్రానికి ఇస్తారని వెల్లడించారు. తుఫాన్‌ వల్ల కలిగిన నష్టాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ఫోన్‌లో వివరించానని చెప్పారు. ఆయన వెంటనే స్పందించి రాష్ర్టానికి కేంద్ర బృందాన్ని పంపుతున్నారని సీఎం తెలిపారు.


తుఫాన్‌ కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేశామని అన్నారు. రాష్ట్రానికి వారసత్వంగా రెండు సమస్యలు వచ్చాయని అన్నారు. ఒకటి రాయలసీమలో ఫ్యాక్షనిజం కాగా, రెండోది కోస్తా జిల్లాల్లో తుఫాన్‌ ముప్పు అని పేర్కొన్నారు. ఫ్యాక్షనిజాన్ని తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా అణచివేసిందని అన్నారు. కోస్తాలో తుఫాన్లను ఆపలేకపోయినప్పటికి వాటి వల్ల జరిగే ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తుఫాన్‌ కారణంగా సముద్రపు అలలు ఎగసిపడడం, ప్రచండ గాలుల వీయడంతో తీరంలో లంగర్‌ వేసి ఉన్న బోటులు పూర్తిగా ధ్వంసం అయ్యాయని మంత్రి అచ్చెన్నాయుడు సీఎం దృష్టికి తీసుకువచ్చారు.

కేంద్రం ఇచ్చే నిధులతోపాటు రాష్ట్రం నుంచి కూడా దెబ్బతిన్న పడవలకు కొంత సాయం చేద్దామని సీఎం అన్నారు. తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉండే కోస్తా జిల్లాల్లోని పట్టణాలు, నగరాల్లో భూగర్భ విద్యుత్తు కేబుల్స్‌ వేసే ఆలోచన ఉందని, దీన్ని దశలవారీగా కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 03:58 AM