Share News

కృత్రిమ పన్నీరుపై నిషేధం

ABN , Publish Date - Oct 29 , 2026 | 04:48 AM

ఆంధ్రప్రదేశ్‌లో కృత్రిమ పన్నీరు తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలు, వినియోగంపై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది. ప్రజారోగ్య పరిరక్షణ, వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కృత్రిమ పన్నీరుపై నిషేధం

  • ఏడాది పాటు బ్యాన్‌ చేసిన ప్రభుత్వం

  • గెజిట్‌ జారీ చేసిన ఫుడ్‌ కమిషనర్‌ వీరపాండియన్‌

అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో కృత్రిమ పన్నీరు తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలు, వినియోగంపై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది. ప్రజారోగ్య పరిరక్షణ, వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆహార భద్రత శాఖ కమిషనర్‌ జి.వీరపాండియన్‌ మంగళవారం గెజిట్‌ జారీ చేశారు. కృత్రిమ పన్నీరు తయారీలో పాలను ఉపయోగించరు. శాఖాహార కొవ్వులు, పామాయిల్‌ వంటి వంట నూనెలు, మీగడ తీసిన పాలపొడి, ఇతర మిశ్రమ పదార్ధాలను ఉపయోగిస్తారు. వీటితో తయారయ్యే పన్నీరు రూపంలో సంప్రదాయ పాల పన్నీరును పోలి ఉంటుంది.

తయారీ విధానం, ఉపయోగించే ముడి పదార్థాలు, పోషక విలువల్లో తేడాలుంటాయి. సంప్రదాయ పాల పన్నీరుతో పోలిస్తే కృత్రిమ పన్నీరు తయారీ ఖర్చు చాలా తక్కువగా ఉంది. మార్కెట్‌లోనూ ఇది తక్కువ ధరకు లభిస్తుంది. ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం ఉండటంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్లౌడ్‌ కిచెన్లలో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

కొన్ని చోట్ల కృత్రిమ చీజ్‌ను కూడా పన్నీరు పేరుతో వినియోగిస్తున్నట్లు గుర్తించారు. సంప్రదాయ పన్నీరు పూర్తిగా పాలతో తయారవుతుంది. ఇందులో సహజమైన ప్రొటీన్లు, కాల్షియం ఉంటాయి. అయితే పాల పన్నీరు తయారీ ఖర్చు ఎక్కువగా ఉండటంతో పాటు ఎక్కువ కాలం నిల్వ ఉండదు. వినియోగదారులకు సరైన సమాచారం అందించడంతో పాటు కృత్రిమ పన్నీరు వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం నిషేధ నిర్ణయం తీసుకుంది.

ఈ వార్తలనూ చదవండి:

పోటాపోటీ

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 29 , 2026 | 04:48 AM