లెక్క తేలింది
ABN , Publish Date - Oct 16 , 2026 | 03:14 AM
సుదీర్ఘ చర్చలు, భారీ కసరత్తు అనంతరం కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు లెక్క తేలింది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు గురువారం రాత్రి వరకు జనసేన, బీజేపీ ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చించి..
కూటమిలో ఖరారైన సీట్లు
జనసేన, బీజేపీ నేతలతో చంద్రబాబు సుదీర్ఘ చర్చలు
అనంతరం పోటీ చేసే స్థానాలపై ఉమ్మడి ప్రకటన
అమరావతి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘ చర్చలు, భారీ కసరత్తు అనంతరం కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు లెక్క తేలింది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు గురువారం రాత్రి వరకు జనసేన, బీజేపీ ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చించి.. సర్దుబాటు ప్రక్రియను ముగించారు. అనంతరం ఏ పార్టీలు ఏయే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో పోటీ చేస్తాయో సంయుక్తంగా ప్రకటించారు. మొత్తం 17 కార్పొరేషన్లకు గాను.. జనసేనకు 4, బీజేపీకి 2 కేటాయించారు. మిగతా 11 కార్పొరేషన్లలో టీడీపీ బరిలోకి దిగుతుంది. మొత్తం 106 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో జనసేనకు 21, బీజేపీకి 7 కేటాయించారు. 78 స్థానాల నుంచి టీడీపీ పోటీ చేయనుంది.
జనసేనకు గోదావరిలోనే అధిక స్థానాలు..
జనసేనకు కేటాయించిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో సగం స్థానాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉన్నాయి. ఆ పార్టీకి కేటాయించిన 4 కార్పొరేషన్లలో రెండు, మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో 10 ఈ జిల్లాల్లోవే. జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం, గొల్లప్రోలు స్థానిక సంస్థలను జనసేనకు కేటాయించారు. వీటన్నిటితోపాటు రాజధాని ప్రాంతంలోని కీలకమైన, రాష్ట్ర వాణిజ్య, రాజకీయ కేంద్రమైన విజయవాడ కార్పొరేషన్‌ను జనసేనకు కేటాయించడం ద్వారా కూటమిలో ఆ పార్టీ ప్రాధాన్యాన్ని కూటమి పెద్దలు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం కార్పొరేషన్, 3 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు, రాయలసీమలో మూడు మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు ఇవ్వడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జనసేనను సర్దుబాటుచేసే ప్రయత్నం చేశారు. పెద్ద మున్సిపాలిటీలైన తెనాలి, చిలకలూరిపేట కూడా జనసేన ఖాతాలో పడ్డాయి. బీజేపీకి కూడా కీలకమైన రాజమహేంద్రవరం, అనంతపురం కార్పొరేషన్లను కేటాయించారు. వీటితోపాటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లోనూ ప్రాతినిధ్యం ఉండేలా 7 మున్సిపాలిటీలు/నగరపంచాయతీలు కేటాయించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ద్వారా రాష్ట్రానికి అందుతున్న సాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీకి సీట్ల సర్దుబాటులో తగు ప్రాధాన్యమిచ్చారు.
విజయవాడపై తర్జనభర్జనలు
రాజకీయంగా కీలకమైన విజయవాడ కార్పొరేషన్‌ను జనసేనకు కేటాయించడంపై కూటమిలో తీవ్ర స్థాయిలో తర్జనభర్జనలు జరిగాయి. టీడీపీకి బలంగా ఉన్న ఈ నగరాన్ని జనసేనకు కేటాయించడంపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమైనా.. కేటాయించేందుకు టీడీపీ పెద్దలు మొగ్గుచూపారు. తిరుపతి కార్పొరేషన్ విషయంలోనూ మూడు పార్టీలు తమకే కావాలని పట్టుబట్టినా చివరికి టీడీపీకే దక్కింది. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ఉండడం, తిరుపతి ఎంపీ వైసీపీకి చెందినవారు కావడంతో.. టీడీపీ ఉనికిని చాటుకునేందుకు కార్పొరేషన్ నుంచి బరిలోకి నిలవక తప్పని పరిస్థితి. దీంతో టీడీపీకి తిరుగులేని శ్రీకాకుళం కార్పొరేషన్‌ను జనసేనకు.. అనంతపురాన్ని బీజేపీకి కేటాయించి... తిరుపతిలో పోటీచేయాలని టీడీపీ నిర్ణయించింది.
ఏ కార్పొరేషన్ ఎవరికి..?
జనసేన- శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ
బీజేపీ- రాజమహేంద్రవరం, అనంతపురం
టీడీపీ- విజయనగరం, విశాఖపట్నం, మచిలీపట్నం, మంగళగిరి-తాడేపల్లి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, చిత్తూరు
మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో..
జనసేన
ఉత్తరాంధ్రలో.. రాజాం, పాలకొండ, సాలూరు.
గోదావరిలో.. తుని, గొల్లప్రోలు, పిఠాపురం, సామర్లకోట, ముమ్మిడివరం, అమలాపురం, నిడదవోలు, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం. ఉమ్మడి కృష్ణాలో.. తిరువూరు, పెడన. ఉమ్మడి గుంటూరులో.. తెనాలి, చిలకలూరిపేట
ప్రకాశంలో.. దర్శి. సీమలో.. మడకశిర, పుట్టపర్తి, పుత్తూరు
బీజేపీ- నెల్లిమర్ల, యలమంచిలి, బాపట్ల, గిద్దలూరు, కావలి, ఎర్రగుంట్ల, గూడూరు(కర్నూలు)
టీడీపీ- మిగిలిన 78 స్థానాలు
ఈ వార్తలనూ చదవండి:
17వ వార్షికోత్సవంలో ABN ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి ఆదిత్య..
మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు