Share News

సర్పంచ్‌ ‘ఏకగ్రీవాలకు’ కోట్లిస్తాం!

ABN , Publish Date - Nov 13 , 2026 | 01:20 AM

సర్పంచ్‌ పదవులకు భలే పోటీ నెలకొంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ సర్పంచ్‌ పదవికి ఇద్దరు జనసేన నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

సర్పంచ్‌ ‘ఏకగ్రీవాలకు’ కోట్లిస్తాం!

  • దుర్గాడలో రూ.1.20కోట్లకు.. దుళ్లలో రూ.కోటిన్నర వరకు..

  • తన తల్లిని ఎన్నుకుంటే రూ.కోటి ఇస్తానంటున్న బండారులంక టెకీ

గొల్లప్రోలు రూరల్‌, కడియం, అమలాపురం రూరల్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): సర్పంచ్‌ పదవులకు భలే పోటీ నెలకొంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ సర్పంచ్‌ పదవికి ఇద్దరు జనసేన నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ స్థానం ఓసీ మహిళకు రిజర్వ్‌ అయింది. గ్రామంలోని శివాలయం, వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి ఎవరు ఎక్కువ సొమ్ము ఇస్తారో వారికే ఏకగ్రీవంగా మద్దతు ఇస్తామని గ్రామపెద్దలు ప్రకటించారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకూ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జనసేన నాయకుడు జ్యోతుల గోపాలకృష్ణ రూ.1.20కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చారు. తన భార్య లేదా తల్లిని ఎన్నుకోవాలని కోరారు. అయితే అదే పార్టీ గొల్లప్రోలు మండల ఇన్‌చార్జి జ్యోతుల శ్రీనివాస్‌ కూడా తానూ రూ.1.20 కోట్లు ఇస్తానన్నారు. దుర్గాడలో మొదటి సారి జ్యోతుల అర్జునరావు రూ.5లక్షలు చెల్లించి సర్పంచ్‌ పదవిని ఏకగ్రీవంగా గెలుచుకోగా, గత ఎన్నికల్లో పంపన సుబ్బలక్ష్మి రూ.33లక్షలిచ్చి పదవిని దక్కించుకున్నారు.

రూ.కోటి.. రూ.కోటిన్నర...

తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల సర్పంచ్‌ పదవికి కూడా తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చారు. గ్రామానికి చెందిన ఓ న్యాయవాది పంచాయతీ ఏకగ్రీవమైతే గ్రామాభివృద్ధికి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారు. కొద్దిసేపటికే.. తాను కోటిన్నర ఇస్తానని మాజీ సర్పంచ్‌ కుమార్తె, వైద్యురాలు మరో ప్రకటన చేశారు. ఎంతైనా తగ్గేదేలే అని జనసేన అభ్యర్థి అంటున్నారు.


రూ.50 లక్షలు ఇస్తా!

కోనసీమ జిల్లా అమలాపురం మండలం పేరూరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవిని తనకు ఏకగ్రీవంగా కేటాయిస్తే రూ.50లక్షలు పంచాయతీ అభివృద్ధికి చెల్లిస్తానని అదే గ్రామానికి చెందిన ఇళ్ల రామ్‌కుమార్‌ అలియాస్‌ బాబ్జి ప్రకటించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. మరోవైపు రూ.కోటి వరకు చెల్లించేందుకు గ్రామంలోని పలువురు మోతుబర్లు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అమ్మ కోసం రూ.కోటిస్తా..!!

అమలాపురం మండలం బండారులంక గ్రామ సర్పంచ్‌ పదవిని ఏకగ్రీవంగా తన తల్లి దొమ్మేటి జగదీశ్వరికి అప్పగిస్తే గ్రామాభివృద్ధి కోసం రూ.కోటి నిధులు అందజేస్తానని ఆమె కుమారుడు రమేశ్‌ ముందుకు వచ్చారు. అయితే టీడీపీ తరఫున గ్రామ కమిటీ అధ్యక్షుడు పిచ్చిక శ్యామ్‌ సతీమణిని నిలిపి వార్డుల వారీగా ఇప్పటికే అభ్యర్థులను సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రమేశ్‌ ప్రకటన తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం

ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు

Updated Date - Nov 13 , 2026 | 01:25 AM