‘సాధుకొండ‘పై జోక్యం చేసుకోండి
ABN , Publish Date - Oct 26 , 2026 | 05:03 AM
రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం తీసుకొస్తుందని భావిస్తున్న సాధుకొండ ఐరన్ ఓర్ మైనింగ్‌పై ప్రతిష్టంభన నెలకొంది. రాజకీయ ఆందోళనలు, భక్తుల మనోభావాలు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాల కారణంగా ఈ ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు.
ప్రభుత్వానికి గనుల శాఖ వినతి.. సీఎం చంద్రబాబుకు నివేదిక
ఐరన్ ఓర్ మైనింగ్‌పై ప్రతిష్టంభన.. ఆచితూచి స్పందించే ధోరణిలో సర్కారు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం తీసుకొస్తుందని భావిస్తున్న సాధుకొండ ఐరన్ ఓర్ మైనింగ్‌పై ప్రతిష్టంభన నెలకొంది. రాజకీయ ఆందోళనలు, భక్తుల మనోభావాలు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాల కారణంగా ఈ ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు. మైనింగ్ విషయంలో నెలకొన్న సందేహాలను నివృత్తి చేస్తూ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ముందుకు తీసుకెళ్లడంపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని గనుల శాఖ కోరింది. ఈ విషయంపై సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించింది. అయితే, దీనిపై ప్రభుత్వం వేచిచూసే ధోరణిలో ఉన్నట్లు తెలిసింది. పర్యావరణం, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఆచితూచి స్పందించాలని భావిస్తోంది.
ఇదీ నేపథ్యం...:
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మల్లయ్య కొండ రిజర్వ్ ఫారెస్ట్‌లో సాధుకొండ, శివపురం, చిన్నారుకొండ వంటిప్రాంతాలున్నాయి. ఈ అటవీ భూమిలో దాదాపు 1,200 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజ నిక్షేపాలున్నట్లు గనుల శాఖ చెబుతోంది. ఇప్పటికే శివపురంలోని 620 హెక్టార్ల బ్లాక్‌కు టెండర్లు పిలవగా సౌత్‌వెస్ట్ మైనింగ్ కంపెనీ బిడ్ దక్కించుకుంది. ఇక్కడ మైనింగ్ చేస్తే దాదాపు 94 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం రావొచ్చని గనుల శాఖ అంచనా వేసింది. సాధుకొండలో 900 హెక్టార్ల ఐరన్‌ఓర్ బ్లాక్‌ను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కు కేటాయించారు.
ఈ బ్లాక్ లో 1,000 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ వస్తుందని అంచనా. అయితే, మల్లయ్యకొండలో ఉన్న శివాలయానికి భక్తులు భారీగా వస్తుంటారు. రిజర్వ్ ఫారెస్ట్, అందులోనూ ఆలయం సమీపంలో మైనింగ్ చేయడాన్ని రాజకీయ పక్షాలతో పాటు భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల మల్లయ్యకొండలో దాదాపు 6,700 హెక్టార్ల పరిధిలో పర్యావరణం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ చంద్రబాబుకు గనుల శాఖ తాజాగా నివేదిక సమర్పించింది.
ఈ వార్తలనూ చదవండి:
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం