ఇళ్లు నీట మునిగితేనే స్పందిస్తారా?
ABN , Publish Date - May 29 , 2026 | 11:31 PM
ఇళ్లు నీటమునిగితేనే ప్రజాప్రతినిధులు, అధికార ులు స్పందిస్తారా అని కురుగుంట వైఎస్సార్ కాలనీ వాసులు మండిపడ్డారు. కాలనీకి ఆనుకుని ఓ ప్రైవేటు కంపెనీ వెంచర్ వేశారు. కాలనీ పైభాగం నుంచి వచ్చే వర్షపునీరు వంకలోకి వెళ్లేందుకు వీలులేకుండా నిర్మాణం చేపట్టడంతో కాలనీవాసులు శుక్రవారం వెంచర్ ముఖద్వారం వద్ద నిరసనకు దిగారు.
వర్షపునీరు వెళ్లేందుకు వీలులేకుండా వెంచర్ ఏర్పాటు
అనంతపురం రూరల్, మే 29(ఆంధ్రజ్యోతి): ఇళ్లు నీటమునిగితేనే ప్రజాప్రతినిధులు, అధికార ులు స్పందిస్తారా అని కురుగుంట వైఎస్సార్ కాలనీ వాసులు మండిపడ్డారు. కాలనీకి ఆనుకుని ఓ ప్రైవేటు కంపెనీ వెంచర్ వేశారు. కాలనీ పైభాగం నుంచి వచ్చే వర్షపునీరు వంకలోకి వెళ్లేందుకు వీలులేకుండా నిర్మాణం చేపట్టడంతో కాలనీవాసులు శుక్రవారం వెంచర్ ముఖద్వారం వద్ద నిరసనకు దిగారు. కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ పైభాగంలోని కురుగుంట గ్రామం, కట్టకిందపల్లి, యాలేరు పొలాల్లో నుంచి వర్షపు నీరు కాలనీకి ఆనుకుని కాలువ గుండా తడకలేరు వంకలోకి వెళతాయన్నారు. కాలనీకి పక్క వేసిన వెంచర్‌లో నుంచి కాలువ వెళుతోందన్నారు. గతంలో కాలువ 15 అడుగులు ఉండేదన్నారు. ప్రస్తుతం దాన్ని ఒక మీటరు వెడల్పు వదిలి వెంచర్ నిర్వాహకులు నిర్మాణాలు చేశారు. సజావుగా నీరు వెళ్లేందుకు ఆస్కారం లేకపోవడంతో వర్షం వచ్చినప్పుడల్లా కాలనీలోకి నీరు చేరుతున్నాయన్నారు. గతంలో వర్షాలు ఎక్కువైన సందర్భాల్లో నీరంతా ఇళ్లలోకి వచ్చాయన్నారు. అప్పుడు అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టి చేతులు దులుపుకున్నారన్నారు. అధికారులు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. లేనిపక్షంలో ప్రధానరోడ్డుపైకి వచ్చి ధర్నా చేపడతామని హెచ్చరించారు.