కూటమి ప్రభుత్వ దృష్టంతా అభివృద్ధి, సంక్షేమంపైనే: మంత్రి పయ్యావుల
ABN , Publish Date - Jul 05 , 2026 | 02:46 PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల ముందుకు కూటమి ప్రభుత్వం తీసుకెళ్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమలే ప్రధాన ఆధారమని, పెట్టుబడులు వస్తేనే యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకెళ్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమలే ప్రధాన ఆధారమని, పెట్టుబడులు వస్తేనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలోని బూదిగుమ్మ సమీపంలో నిర్వహించిన 'రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం' విజయోత్సవ సభలో మంత్రి పయ్యావుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏపీకి, ఉరవకొండ నియోజకవర్గానికి చేసిన పనులను వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల మాట్లాడుతూ.. ఉరవకొండలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. తుంగభద్ర డ్యామ్ గేట్ల మరమ్మతుల పనులను కేవలం మూడు నెలల్లో పూర్తి చేశామని పేర్కొన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదని మంత్రి స్పష్టం చేశారు. తాను 30 ఏళ్లుగా ఉరవకొండ ప్రజల కుటుంబ సభ్యుడిగా సేవ చేస్తున్నానని, ఇకపై కూడా ఈ నియోజకవర్గానికి ఒక సాధారణ కూలీలా పనిచేస్తానని పయ్యావుల కేశవ్ భావోద్వేగంగా చెప్పారు. ఉరవకొండ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని, తనకు లభించిన ప్రతి గౌరవం వెనుక ప్రజల ఆశీర్వాదమే ఉందని అన్నారు.
బూదిగుమ్మ వంతెన నిర్మాణానికి రూ. 90 కోట్ల వ్యయంతో పనులు చేపట్టామని, ఈ వంతెన పూర్తయితే కూడేరు, బెళుగుప్ప మండలాల మధ్య రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడుతుందని చెప్పారు. ఉరవకొండ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు, ప్రతి రైతుకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. హంద్రీ-నీవా, పెద్దకొత్తపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని, మరోవైపు 12 చెరువులకు నీరు అందించే ప్రాజెక్టులను ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోందని వివరించారు. సాగునీరు, మౌలిక సదుపాయాలు, విద్యుత్, పరిశ్రమల ఏర్పాటుతో ఉరవకొండ రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.
పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోందని, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని మంత్రి పయ్యావుల తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆర్డీఎస్‌ఎస్ పథకం ద్వారా పాత విద్యుత్ స్తంభాలను మార్చి, ఆధునిక విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అనంతపురం జిల్లాలో విద్యుత్ రంగంలో నూతన విధానాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి దిశగా సాగుతోందని మంత్రి పేర్కొన్నారు.
పోలవరం, అమరావతి, రైల్వేలు, జాతీయ రహదారులు వంటి కీలక ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్‌కు బలమైన పునాదిగా నిలుస్తాయని మంత్రి అన్నారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం వెనుకబడిందని విమర్శించిన పయ్యావుల.. ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకం: పవన్ కల్యాణ్
డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా తృప్తి క్యాంటీన్‌లను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి నారాయణ