అనంతలో బర్డ్‌ఫ్లూ కలకలం
ABN , Publish Date - Oct 05 , 2026 | 06:50 AM
ఏపీలో మళ్లీ బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురంలోని ఓ ఫాంలో కోళ్లు వరుసగా చనిపోతున్నాయి.
సిద్దరాంపురంలో 2,500 నాటు కోళ్లు మృతి
తెలంగాణ నుంచి తెచ్చిన కోళ్లకు వ్యాధి..!
రంగంలోకి అధికారులు.. వ్యాప్తి కట్టడికి చర్యలు
బుక్కరాయసముద్రం, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ఏపీలో మళ్లీ బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురంలోని ఓ ఫాంలో కోళ్లు వరుసగా చనిపోతున్నాయి. ఇలా 2,500 నాటుకోళ్లు మృతిచెందాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బర్డ్‌ఫ్లూ అనుమానంతో నమూనాలను భోపాల్‌లోని జాతీయ పరిశోధనా సంస్థకు పంపింది. కాగా, కోళ్ల మరణాలకు బర్డ్‌ఫ్లూనే కారణమని శనివారం రాత్రి అక్కడి నుంచి నివేదిక అందింది. దీంతో పశుసంవర్ధక, వైద్య, రెవె న్యూ, పోలీసు అధికారులు ఆదివారం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు.
ఆదిలాబాద్ నుంచి తెచ్చిన కోళ్లతో..
సిద్దరాంపురం గ్రామానికి చెందిన వెంకటరాముడు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం కింద ఇటీవలే నాటుకోళ్ల ఫాం ఏర్పాటు చేశారు. ఇటీవల తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నుంచి నాటుకోళ్లు కొనగోలుచేసి తెచ్చారు. ఇటీవల ఫాంలోని కోళ్లు మృత్యువాత పడటం మొదలైంది. దీంతో అధికారులు.. శాంపిల్స్‌ను పరీక్షలకు పంపించి.. భోపాల్ ల్యాబ్ నుంచి నివేదిక అందిన నేపథ్యంలో అధికారులు బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా సిద్దరాంపురం చుట్టూ 10కి.మీ. పరిధిని నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు.