‘అనంత’ ఉద్యానం
ABN , Publish Date - Nov 19 , 2026 | 03:00 AM
అనంతపురం జిల్లా ఇప్పుడు కొత్త రకం ఉద్యాన పంటల సాగుకు ప్రయోగశాలగా మారింది. తాజాగా రాయలసీమను ఉద్యానవన హబ్‌గా అభివృద్ధి చేయడానికి ...
విస్తరించనున్న ఉద్యాన పంటలు
గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా ప్రోత్సాహం
ఇప్పటికే విరివిగా చీనీ, మామిడి, అరటి సాగు
దానిమ్మ, ద్రాక్ష, బొప్పాయి, సపోటా పంటలూ
తోట పంటలు, ఆయిల్ పామ్, కూరగాయలు,
సుగంధ ద్రవ్యాలు, పూలు, ఔషధ పంటలూ
విజయవంతంగా సాగులోకి యాపిల్
డ్రాగన్, మకడమియా, లిచీ, అవకాడో కూడా
ఒకప్పుడు కశ్మీర్, సిమ్లా వంటి తక్కువ ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాల్లో మాత్రమే పండే యాపిల్ ఇప్పుడు కరువుసీమకు వచ్చేసింది. తైవాన్ దేశంలో పండించే డ్రాగన్ ఫ్రూట్‌ను ఇక్కడ సాగు చేస్తున్నారు. స్థానికులు పేరు కూడా వినని మకడమియా, లిచీ, అవకాడో తదితర రకాల ఉద్యాన పంటలు విజయవంతంగా సాగవుతున్నాయి.
(అనంతపురం అర్బన్-ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా ఇప్పుడు కొత్త రకం ఉద్యాన పంటల సాగుకు ప్రయోగశాలగా మారింది. తాజాగా రాయలసీమను ఉద్యానవన హబ్‌గా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.లక్ష కోట్లు వెచ్చించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాకు రూ.2,252 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాకు రూ.1600 కోట్లు కేటాయించింది. దీంతో అనంతపురం జిల్లా ఇక ‘ఉద్యాన’మయంగా మారనుంది.
చీనీ, మామిడి, దానిమ్మను ఎప్పటి నుంచో విరివిగా పండిస్తున్నారు. ఇంకా బొప్పాయి, కర్బూజ, పుచ్చకాయ, నిమ్మ, ఉసిరి, కమలా, సపోటా, నేరేడు, జామ, సీతాఫలం, రేగు, పనస తదితర ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. తోట పంటలు, ఆయిల్ ఫామ్, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పూలు, ఔషధ పంటలు పండిస్తున్నారు. అనంత అరటిని గల్ఫ్ దేశాలు ఇరాన్, సౌదీ అరేబియా, ఖతార్, దుబాయ్‌కు ఎగుమతి చేస్తున్నారు. చీనీ, మామిడి, దానిమ్మ తదితర పంటలు దేశంలో వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి.
రానున్న కాలంలో జిల్లాలో ఉద్యాన పంటలు మరింత విస్తరించనున్నాయి. ప్రస్తుతం రాయలసీమలో 8.41లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాటి ద్వారా 222 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి.
1.21 లక్షల హెక్టార్లలో..
అనంతపురం జిల్లాలో 1.21 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఏడాదికి 32.63 లక్షల టన్నుల ఉద్యాన దిగుబడి వస్తోంది. జిల్లాలో పండ్ల తోటలు 81,669 హెక్టార్లు, కూరగాయలు 26,200, సుగంధ ద్రవ్యాలు 11,160, పూల పంటలు 828, ఔషధ పంటలు 33.51 హెక్టార్లల్లో సాగవుతున్నాయి.
అత్యధికంగా చీనీ పంట 37,500 హెక్టార్లల్లో సాగవుతోంది. ఆ తర్వాత అరటి 16 వేల హెక్టార్లు, మామిడి 15 వేలు, దానిమ్మ 5500 హెక్టార్లలో సాగవుతోంది. జిల్లాలో దానిమ్మలో ‘భగవ’ రకం పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. అలాగే ద్రాక్షలో దిల్‌కుష్ రకం ఎక్కువగా సాగవుతోంది. ఔషధ సుగంధ ద్రవ్యాల పంటలైన అశ్వగంధ, నన్నారి, నేలవేము, సింధూరం, నిమ్మగడ్డి, వాము, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం, పసుపు పంటలు సాగవుతున్నాయి.
ఎండుమిరప, చింత ఉన్నాయి. తోట పంటలైన వక్క, తమలపాకు, జీడిమామిడి, కోకో, కొబ్బరి, ఖర్జూరం, పూల పంటలైన ఆస్టర్, సంపంగి, చామంతి, కనకాంబరం, మల్లె, విరజాజిమల్లె, బంతి, గులాబీ పంటలు సాగులో ఉన్నాయి. జిల్లాలో 365 హెక్టార్లల్లో ఆయిల్ ఫామ్ సాగవుతోంది.
అనంత చీనీ జ్యూస్ అదుర్స్
అనంతపురం జిల్లాలో అత్యధికంగా 37,500 హెక్టార్లల్లో చీనీ పంట సాగవుతోంది. సాత్‌గురి రకం చీనీ పంట పండిస్తున్నారు. ఢిల్లీ, నాగపూర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. ఇక్కడి చీనీ పంటను ఎక్కువగా జ్యూస్‌గా ఉపయోగిస్తున్నారు.
అనంత మామిడి భలే రుచి
అనంతపురం జిల్లాలో 15 వేల హెక్టార్లల్లో మామిడి సాగవుతోంది. ఇక్కడి మామిడి పండు రుచి చూస్తే.. ఆహా ఏమి రుచి అనాల్సిందే. జిల్లాలో బేనీస(బంగినపల్లి) రకం మామిడి ఎక్కువగా సాగవుతోంది. ఆ తర్వాత బెంగళూరు రకం (తోతాపూరి) సాగులో ఉంది. జిల్లాలో పొడి వాతావరణం ఉండటంతో మామిడి కండ బాగా పట్టడంతోపాటు రుచి తియ్యగా ఉంటుంది. దీని మూలంగా మార్కెట్‌లో అనంత మామిడి పండుకు గిరాకీ ఉంది. ఢిల్లీ, నాగపూర్, హైదరాబాద్, విజయవాడ ప్రాంతాలకు అనంత మామిడి ఎగుమతి అవుతోంది.
తైవాన్ నుంచి వచ్చిన డ్రాగన్ ఫ్రూట్
జిల్లాలో 77.14 హెక్టార్లల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగవుతోంది. ఏడేళ్లుగా తైవాన్ దేశంలో పండించే డ్రాగన్‌ఫ్రూట్‌ను జిల్లాలో పండిస్తున్నారు. చెన్నై, హైదరాబాద్, బళ్లారి, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. ఇక అనంతపురం జిల్లాలో మొత్తం 32.73 హెక్టార్లల్లో అవకాడో పంట సాగులో ఉంది. రాయదుర్గం, గుంతకల్లు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, ఉరవకొండ, కూడేరు, గార్లదిన్నె మండలాల్లో అవకాడో సాగు చేస్తున్నారు.
ప్రయోగాల దిశగా..
కరువు జిల్లాగా పేరొందిన అనంతపురం జిల్లాలో కొత్త రకం ఉద్యాన పంటలను ప్రయోగాత్మకంగా సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. డ్రాగన్ ఫూట్, యాపిల్, అవకాడో, మకడమియా, లిచ్చీ తదితర రకాల పంటలు ఇక్కడ విజయవంతంగా సాగవుతున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ 77.14 హెక్టార్లు, అవకాడో 32.73, యాపిల్ 5.96 హెక్టార్లు, ఆపిల్ రేగు 24.86, బెర్రీ 5.76, అంజూర 68, మకడమియా 6.72, ఆయిల్‌పామ్ 365 హెక్టార్లలో, అర్ధ ఎకరాలో లిచీ పంట సాగులో ఉంది.
ఇతర ప్రాంతాలకు ఎగుమతి
అనంతపురం జిల్లాలో సాగవుతున్న చీనీ పంట బెంగళూరు, కర్ణాటక, హైదరాబాద్, తమిళనాడు, ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. డ్రాగన్ ఫ్రూట్‌ను బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, చెన్నై తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దానిమ్మ పంట కోల్‌కతా, ఢిల్లీ, మహారాష్ట్ర, ఒడిశా, చెన్నై, కేరళ తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. మామిడి ఢిల్లీ, ఆగ్రా, ఝాన్సీ, సిమ్లా, కర్ణాటక తదితర ప్రాంతాలకు వెళుతోంది.
గల్ఫ్ దేశాలకు అరటి
2016లో రాష్ట్ర ప్రభుత్వం విదేశాలకు ఉద్యాన పంటలను ఎగుమతి చేసేందుకు పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. కొన్నేళ్లుగా దేశాయ్, ఐఎన్‌ఐ తదితర కంపెనీలు అరటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. 2020 జనవరిలో కిసాన్ రైలు ద్వారా అనంతపురం జిల్లా నుంచి అరటితో పాటు పలు రకాల ఉద్యాన పంటలు ఢిల్లీకి పంపారు. 2024లో ఎస్‌కే బనానా కంపెనీ ‘బనానా రైలు’ ద్వారా తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి ముంబైకి అరటిని పంపింది. గల్ఫ్ దేశాలు ఇరాన్, సౌదీ అరేబియా, ఖతార్, దుబాయ్‌కు అనంత అరటిని ఎగుమతి చేస్తున్నారు. ఇతర జిల్లాల్లో పండించే అరటి కంటే ఇక్కడ పండిస్తున్న అరటికి గిరాకీ పెరిగింది.
సీమ స్పెషల్ యాపిల్
అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలం కోటంక, కుందుర్పి మండలం ఎనుములదొడ్డి, పెద్దపప్పూరు మండలం నరసాపురం ప్రాంతాల్లో 5.96 హెక్టార్లల్లో యాపిల్ సాగులో ఉంది. అనంతపురం రూరల్ మండలం సిండికేట్‌నగర్‌కు చెందిన కేవీ రమణారెడ్డి అనంతపురం జిల్లా కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు కలిగిన ఇజ్రాయెల్ దేశంలో యాపిల్ పండిస్తారని తెలుసుకున్నారు.
2024లో ఇజ్రాయెల్‌లో ఉన్న తన స్నేహితుడి ద్వారా కేఎల్‌డీ రకం యాపిల్ మొక్కలను కొనుగోలు చేశారు. ఒక్కొక్క మొక్క రూ.650 ధరతో 1550 మొక్కలు తెప్పించారు. గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో 2.50 ఎకరాల్లో యాపిల్ మొక్కలు నాటారు. రెండేళ్ల తర్వాత యాపిల్ పంట కోత కొచ్చింది. 3 టన్నుల దిగుబడి వచ్చింది. టన్ను రూ.1.50 లక్షలకు విక్రయించినట్లు రైతు కేవీ రమణారెడ్డి తెలిపారు. తక్కువ నీటితోనే ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకుని, పండిన యాపిల్ తియ్యగా, రుచికరంగా ఉండడంతో మార్కెట్‌లో మంచి ధర పలికింది.
ఈ వార్తలనూ చదవండి:
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్
పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్