Share News

అనంతపురంలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

ABN , Publish Date - Nov 01 , 2026 | 11:26 AM

అనంతపురంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. నగరంలోని మొత్తం 62 డివిజన్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అలజడులకు తావులేకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది.

అనంతపురంలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
Daggupati Prasad

అనంతపురం, నవంబర్ 1: అనంతపురం నగరంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. నగరంలోని మొత్తం 62 డివిజన్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అలజడులకు తావులేకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఈ సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి 43వ డివిజన్‌లోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత 2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నగరంలో పెద్ద ఎత్తున దౌర్జన్యాలు, బెదిరింపులు చోటుచేసుకున్నాయని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించారని విమర్శించారు. గతంలో మాదిరిగా భయానక పరిస్థితులు ఈసారి నగరంలో ఎక్కడా కనిపించడం లేదని, ప్రజలు ఎలాంటి ఒత్తిళ్లు, భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితులు కల్పించామని తెలిపారు. నగరంలోని 62 డివిజన్లలోనూ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుండటం ప్రజాస్వామ్యానికి శుభపరిణామమని పేర్కొన్నారు.


ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణే సీఎం చంద్రబాబు లక్ష్యం..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్నికలను పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పమని, అందుకు అనుగుణంగా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. గత ఎన్నికల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి సుమారు 85 శాతం స్థానాలను దౌర్జన్యంగా ఏకగ్రీవం చేసుకున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతపురం నగరంలో జరుగుతున్న వాస్తవ అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమం, భవిష్యత్తులో నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న కూటమి ప్రభుత్వ ఆలోచనలను పరిశీలించి ప్రజలు తమ తీర్పును ఓటు రూపంలో వెల్లడిస్తారని దగ్గుపాటి ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి:

భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య

పాక్ విజయంపై పోస్ట్.. ఇంత బిల్డప్ అవసరమా అంటూ ప్రధాని షరీఫ్‌పై ట్రోల్స్!

Updated Date - Nov 01 , 2026 | 12:02 PM