మరో ఘోరం
ABN , Publish Date - Nov 25 , 2026 | 04:31 AM
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాటజంగాలపాలెం గ్రామ పరిధిలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ట్రాలర్‌ను వెనుక నుంచి బలంగా డంపర్ లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి.
ట్రాలర్‌ను ఢీకొన్న లారీ
డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం
అనకాపల్లి వద్ద హైవేపై ప్రమాదం
సబ్బవరం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాటజంగాలపాలెం గ్రామ పరిధిలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ట్రాలర్‌ను వెనుక నుంచి బలంగా డంపర్ లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అనకాపల్లి మండలం సంపదపురం రెవెన్యూ పరిధిలోని వేటజంగాలపాలెంలోని ఆర్‌కె స్టోన్ క్రషర్ నుంచి మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో నల్ల పిక్క(బ్లాక్ మెటల్)తో డంపర్ లారీ పదహారో నంబరు జాతీయ రహదారి (అనకాపల్లి-ఆనందపురం మార్గం) మీదుగా పెందుర్తి వైపు బయలుదేరింది.
సుమారు 4.30 గంటలకు సబ్బవరం మండలం బాటజంగాలపాలెం సమీపానున్న టోల్ గేట్ దాటిన తరువాత అమ్ములపాలెం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై కుడి వైపున ఆగి ఉన్న ట్రాలర్‌ను వెనుక నుంచి లారీ బలంగా ఢీకొంది. డంపర్ లారీ క్యాబిన్ సుమారు ఐదు అడుగుల మేర ట్రాలర్ వెనుక వైపు దూసుకుపోయింది. ఈ క్రమంలో నిప్పు రవ్వలు రేగి క్షణాల్లో మంటలు వ్యాపించాయి. లారీ డ్రైవర్, క్లీనర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో తప్పించుకునే అవకాశం లేక సజీవ దహనం అయ్యారు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అగ్నిమాపక శకటాన్ని రప్పించి మంటలను అదుపుచేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాలర్ డ్రైవర్ పరారయ్యాడు. ట్రాలర్ జార్ఖండ్ నుంచి బొగ్గు తరలిస్తున్నట్టు చెబుతున్నారు. క్యాబిన్‌లో ఇరుక్కుని బూడిదైన డ్రైవర్, క్లీనర్ అవశేషాలను పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవరును రావికమతం మండలం తట్టబందకు చెందిన మహదేవ్ సూరిఅప్పారావు (42)గా గుర్తించారు.
ఆయన మూడేళ్లుగా ఆర్‌కే స్టోన్ క్రషర్‌లో పనిచేస్తున్నారు. భార్య భవానీ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. క్లీనర్‌ను అనకాపల్లి మండలం జగన్నాథపురానికి చెందిన గోకివాడ శ్యామ్‌ప్రసాద్‌గా గుర్తించారు. శ్యామ్‌కు తండ్రి చిన్న, తల్లి భవానీ ఉన్నారు. కాగా, ట్రాలర్‌లో డీజల్ అయిపోవడంతో జాతీయ రహదారిపై రాత్రి రెండు గంటల నుంచి ఆగి ఉందని చెబుతున్నారు. పోలీసులు డీజిల్ పోసి ముందుకు తీయించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి