బొప్పరాజుది పొలిటికల్ అజెండా!
ABN , Publish Date - Aug 30 , 2026 | 05:28 AM
ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తీరుపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు.
ఉద్యోగులు-ప్రభుత్వ సఖ్యతను చెడగొట్టే కుట్ర: అనగాని
సర్కారు చర్చలు జరుపుతుంటే
ఆయన రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు
గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను
కూటమి పెట్టినట్లుగా దుష్ప్రచారం
ఈ రెండేళ్లలో మేమిచ్చిన నిధుల ఊసేదీ?
వేల కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లిస్తున్నాం
గత ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ ఇచ్చింది
జీతాల్లో నుంచి రికవరీ పెట్టింది
మరి వీటిని బొప్పరాజు మరిచారా?
సీఎంని అవహేళన చేస్తారా?: మంత్రి ఫైర్
అమరావతి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తీరుపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఉద్యోగులకు మేలు చేసేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతున్న సమయంలో అతిపోకడలతో ఆయన రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ‘ఆయన ఉద్యోగుల సమస్యలే అజెండాగా పని చేస్తున్నారా? లేక పొలిటికల్ అజెండాతో పని చేస్తున్నారా? బొప్పరాజు వ్యవహారశైలిపై అనుమానాలు వస్తున్నాయి. ఉద్యోగులు-ప్రభుత్వం మధ్య సఖ్యతను చెడగొట్టడానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు’ అని శనివారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వ పాపాలను కూడా కూటమి ప్రభుత్వం ఖాతాలో వేసి.. బొప్పరాజు ఉద్యోగులను తప్పుదారి పట్టిస్తున్నారని తెలిపారు.
ఆయన వ్యవహారశైలిని ఉద్యోగులు కూడా గమనించాలని కోరారు. జగన్ సర్కారు పెట్టిన బకాయిలనూ కూటమి ప్రభుత్వమే పెట్టిందన్నట్లుగా బొప్పరాజు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రెండేళ్లలో ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన నిధుల గురించి కనీసం ప్రస్తావించకపోవడం చూస్తుంటే ఆయన ఆలోచనా ధోరణి ఏమిటో అర్థమవుతోందన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై బొప్పరాజు సహా వివిధ ఉద్యోగ సంఘాల నేతతో చర్చలు జరుపుతున్నామని, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. ‘ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ..ఉద్యోగ సమస్యలను పరిష్కరిస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బిల్లులను చాలా వరకు చెల్లించాం. ఇంకా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం. 11 వేల మంది సీపీఎస్ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీం వర్తింపజేశాం. సీపీఎస్ కాంట్రిబ్యూషన్‌ను గత ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకుంటే తిరిగి వారి ఖాతాల్లో జమ చేశాం. ఉద్యోగుల ఖాతాల్లోని సొమ్మును కూడా గత ప్రభుత్వం వాడుకుంది. అది కూడా తిరిగి వారి ఖాతాల్లో వేశాం. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులన్నీ చెల్లించాం. ఇంకా చాలా చేశాం. విడతల వారీగా రూ.వేల కోట్లను ఉద్యోగుల బకాయిల నిమిత్తం చెల్లిస్తూనే ఉన్నాం. ఉద్యోగ సంఘాలను మేం గౌరవిస్తున్నాం, చర్చలు జరుపుతున్నాం. గత ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ ఇచ్చింది. జీతాల్లో నుంచి రికవరీ పెట్టింది. ఇలాంటి వాటిని బొప్పరాజు మరిచారో.. లేక నటిస్తున్నారో’ అని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న పనులను అడ్డుకునేలా ఆయన వ్యవహారశైలి ఉందన్నారు. ఉద్యోగుల అజెండా కంటే పొలిటికల్ అజెండానే అమలు చేస్తున్నట్లు కనిపిస్తోందని తెలిపారు.
ముఖ్యమంత్రిని అవమానిస్తారా?
సీఎం చంద్రబాబును అవమానించేలా.. అవహేళన చేసేలా బొప్పరాజు శుక్రవారం సభ నిర్వహించారని అనగాని ఆక్షేపించారు. ఉద్యమాలు చేయడాన్ని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని సహిస్తాం గానీ.. కుట్రపూరితంగా సీఎంను అవహేళన చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చిచెప్పారు. బొప్పరాజు సహా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నాటి సీఎం జగన్ ఏ విధంగా వ్యవహరించారో.. నేడు సీఎం చంద్రబాబు ఏవిధంగా వ్యవహరిస్తున్నారో ఉద్యోగులు గమనించాలని మంత్రి కోరారు.
Also Read:
సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్
గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు