Share News

క్వాంటమ్‌-ఏఐ వర్సిటీ

ABN , Publish Date - Aug 28 , 2026 | 04:54 AM

రాజధాని అమరావతిని డీప్‌- టెక్‌ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో అడుగు పడింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ) ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా క్వాంటమ్‌ అండ్‌ ఏఐ యూనివర్సిటీ క్యాంపస్‌ అమరావతిలో ఏర్పాటు కానుంది.

క్వాంటమ్‌-ఏఐ వర్సిటీ

  • అమరావతిలో రూ.730 కోట్లతో దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు

  • 8.5 ఎకరాల్లో క్యాంపస్‌.. సీఆర్డీఏ ఆమోదం.. సెప్టెంబరు 13 నుంచి తరగతులు!

  • ఈ ప్రాజెక్టు కోసం ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీసిటీ, ఏయూ, జేఎన్టీయూతో ఎన్‌ఐఈఎల్‌ఐటీ భాగస్వామ్యం

గుంటూరు(రాజధాని), ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిని డీప్‌- టెక్‌ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో అడుగు పడింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ) ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా క్వాంటమ్‌ అండ్‌ ఏఐ యూనివర్సిటీ క్యాంపస్‌ అమరావతిలో ఏర్పాటు కానుంది. 8.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.730.70 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు సీఆర్డీఏ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ నిధులను 100 శాతం గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ రూపంలో కేంద్రం సమకూర్చనుంది. గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా క్వాంటమ్‌ టెక్నాలజీస్‌, (ఏఐ) సెమీకండక్టర్‌ డిజైన్‌, ఫ్యాబ్రికేషన్‌, ఇతర అధునాతన డీప్‌- టెక్‌ రంగాల్లో బోధన, ఉపాధి శిక్షణ, పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను ఒకే వేదిక మీదకు తీసుకురానున్నారు. కేంద్ర ఎలక్ర్టానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ఏకైక విశ్వవిద్యాలయమైన నైలిట్‌... పంజాబ్‌లోని రోపర్‌లో ప్రధాన క్యాంపస్‌, దేశవ్యాప్తంగా 56 కేంద్రాలు, 11 రాజ్యాంగ విభాగాలు, 700కు పైగా గుర్తింపు పొందిన సంస్థల నెట్‌వర్క్‌తో పనిచేస్తోంది. ఇప్పుడు అమరావతి వేదికగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తన క్యాంప్‌సను విస్తరిస్తోంది.


తాత్కాలిక భవనంలో బోధన

అమరావతిలో శాశ్వత ప్రాంగణ నిర్మాణం పూర్తయ్యే వరకు వేచి చూడకుండా, వచ్చే నెల నుంచే విద్యార్థులు, వృత్తి నిపుణులకు కోర్సులను అందుబాటులోకి తేనున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసే తాత్కాలిక వసతిలో విద్యా బోధన, అధునాతన సాంకేతిక శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. ఈ క్యాంప్‌సలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌- సెక్యూరిటీ, ఏఐ-ఎంఎల్‌, డేటాసైన్స్‌, సెమీకండక్టర్‌ ఫ్యాబ్రికేషన్‌, చిప్‌ డిజైన్‌, వీఎల్‌ఎ్‌సఐ, ఎంబడెడ్‌ సిస్టమ్స్‌, హై-పెర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌ (హెచ్‌పీసీ) వంటి కీలక రంగాల్లో యూజీ, పీజీ పీహెచ్‌డీ, డిప్లొమా, ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌లు ఆఫర్‌ చేయనున్నారు. అమరావతి క్యాంప్‌సకు ప్రధాన ఆకర్షణగా 1.25 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో ‘క్వాంటమ్‌ రీసెర్చ్‌- ఇన్నోవేషన్‌ అండ్‌ ఇంక్యుబేషన్‌ బ్లాక్‌’ (క్యూఆర్‌ఐఐబీ)ను నిర్మించనున్నారు. ఇందులో క్వాంటమ్‌ ఫోటోనిక్స్‌, క్రియోజెనిక్‌ సిస్టమ్స్‌, క్లీన్‌రూమ్‌- నానో- ఫ్యాబ్రికేషన్‌, డేటా సెంటర్లు, స్టార్టప్‌ కో-వర్కింగ్‌ స్పేస్‌, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ అండ్‌ పేటెంట్‌ సెల్‌ కొలువుదీరనున్నాయి.


ఐదేళ్లలో 8,250 మందికి శిక్షణ

ఈ ప్రాజెక్టు ద్వారా ఐదేళ్లలో మొత్తం 8,250 మంది లబ్ధి పొందనుండగా, అందులో 1,650 మంది డిగ్రీ, పీజీ కోర్సుల ద్వారా, 6,600 మంది విద్యార్థులు నైపుణ్య సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ల ద్వారా శిక్షణ పొందుతారు. అమరావతిలో నిర్మించే శాశ్వత ప్రాంగణాన్ని పర్యావరణహితంగా, సౌర విద్యుత్‌, ఈవీ చార్జింగ్‌, నెట్‌ జీరో లక్ష్యంతో నిర్మిస్తున్నారు. క్యాంప్‌సలో 500 మందికి వసతి కల్పించే హాస్టళ్లు, ఆడిటోరియం, క్రీడా ప్రాంగణాలు, విజిటింగ్‌ ఫ్యాకల్టీ గెస్ట్‌హౌస్‌లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీసిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, జేఎన్టీయూతో నైలిట్‌ భాగస్వామ్యం కానుంది. ఈ సంస్థ రాకతో రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Updated Date - Aug 28 , 2026 | 05:25 AM