Share News

అమరావతి.. అత్యంత సురక్షితం!

ABN , Publish Date - Oct 30 , 2026 | 04:32 AM

రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం రాజధాని అమరావతిపై ఏమాత్రం కనిపించలేదు. దీంతో నవ్యాంధ్ర కలల రాజధాని అత్యంత సురక్షితమైన నగరమని మరోసారి రుజువైంది. తుఫాన్‌ కారణంగా గుంటూరు జిల్లాలో భారీ వర్షం కురిసినప్పటికీ అమరావతిలో చుక్కనీరు నిలవలేదు.

అమరావతి.. అత్యంత సురక్షితం!

  • అర్నబ్‌ తుఫాన్‌కు చెక్కుచెదరని రాజధాని

  • కోర్‌ క్యాపిటల్‌లో రోడ్లపై చుక్క నీరు నిలవలేదు

  • యథాతథంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులు

  • వరద నివారణలో కీలకంగా కొండవీటి వాగు, పాలవాగు

గుంటూరు(రాజధాని), అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం రాజధాని అమరావతిపై ఏమాత్రం కనిపించలేదు. దీంతో నవ్యాంధ్ర కలల రాజధాని అత్యంత సురక్షితమైన నగరమని మరోసారి రుజువైంది. తుఫాన్‌ కారణంగా గుంటూరు జిల్లాలో భారీ వర్షం కురిసినప్పటికీ అమరావతిలో చుక్కనీరు నిలవలేదు.

రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెం, మందడం, నేలపాడు, లింగాయపాలెం, వెలగపూడి, రాయపూడి, దొండపాడు, ఉద్దండరాయునిపాలెం సహా అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలకు సాధారణంగా వచ్చే నీటి మడుగులు, బురద తప్ప మరింకేమీ కనిపించలేదు. గురువారం వాతావరణం తెరిపివ్వడంతో నిర్మాణ పనులు యథాతథంగా కొనసాగుతున్నాయి.

సురక్షితంగా ప్రభుత్వ కార్యాలయాలు

అమరావతికి గుండెకాయ అయిన కోర్‌ క్యాపిటల్‌ సైతం ఎంతో సురక్షితంగా ఉంది. రాజధానిలో నిర్మించే ట్రంకు రోడ్లన్నీ గురువారం ఉదయానికల్లా యథాస్థితికి వచ్చేశాయి. రాయపూడిలో నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ వద్ద చుక్కనీరు కనిపించలేదు. మంత్రుల భవనాలు, న్యాయమూర్తుల గృహ సముదాయం వద్ద కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. రోడ్డు పక్కన బురద మినహా అక్కడ కూడా నీటి ఛాయలు కనిపించలేదు. అమరావతిని వరద ప్రూఫ్‌గా నిర్మించడంలో భాగంగా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్‌ను అభివృద్ధి చేశారు.

ప్రతి రోడ్డుకు ఇరువైపులా 380 కి.మీ. మేర వరద నీటి రవాణా పైపులైన్లు నిర్మిస్తున్నారు. దీంతో నీరంతా కొండవీటివాగు, పాలవాగుల్లోకి, వాటిపై నిర్మించే రిజర్వాయర్లలోకి వెళ్లిపోతోంది. అక్కడా నీరు అధికమైతే ఉండవల్లిలోని పంపింగ్‌ హౌస్‌ ద్వారా కృష్ణానదిలోకి తరలిస్తున్నారు. దీంతో వరద భయం లేని సురక్షిత నగరంగా అమరావతి నిలిచింది.

ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 04:32 AM