Share News

ఇక క్వాంటం శకం

ABN , Publish Date - Nov 26 , 2026 | 03:27 AM

రాజధాని అమరావతిలో క్వాంటం శకానికి నాంది పలికే దిశగా చకచకా అడుగులు పడుతున్నాయి. సాంకేతిక రంగంలో అమరావతిని అగ్రగామిగా నిలబెట్టడమే కాకుండా..

ఇక క్వాంటం శకం

  • ముమ్మరంగా క్వాంటం కంప్యూటర్‌ ఇన్‌స్టలేషన్‌ పనులు

  • ఫిబ్రవరి 3న ప్రారంభించేందుకు వీలుగా చకచకా ఏర్పాట్లు

  • అమెరికా నుంచి వచ్చిన 120 క్యూబిట్‌ క్వాంటం కంప్యూటర్‌

  • ఇప్పటికే సిద్ధమైన క్వాంటం కంప్యూటింగ్‌ చాంబర్‌

  • ఫస్ట్‌ ఫ్లోర్‌లో మరో మూడు 10 క్యూబిట్‌ కంప్యూటర్లు

  • ఎస్‌ఆర్‌ఎం, మేధా టవర్స్‌ నుంచి తరలించాలని సీఎం ఆదేశం

  • అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ఇంజనీరింగ్‌ సిబ్బంది

గుంటూరు (రాజధాని), నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో క్వాంటం శకానికి నాంది పలికే దిశగా చకచకా అడుగులు పడుతున్నాయి. సాంకేతిక రంగంలో అమరావతిని అగ్రగామిగా నిలబెట్టడమే కాకుండా.. క్వాంటం కంప్యూటింగ్‌ రంగంలో దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసేలా క్వాంటం వ్యాలీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించడంతో తదనుగుణంగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

రెండు ఎకరాల్లో.. రెండు అంతస్తుల్లో నిర్మిస్తున్న క్వాంటం కంప్యూటింగ్‌ సెంటర్‌ పనులు ఇప్పటికే ఒక కొలిక్కి రాగా... అందులో క్వాంటం కంప్యూటర్‌ను ఇన్‌స్టాల్‌ చేసే పనులు ప్రారంభమయ్యాయి. ఈ సెంటర్లో 150 క్యూబిట్స్‌ కంప్యూటర్‌ను ఇన్‌స్టాల్‌ చేయనున్నారు.

అందుకోసం అమెరికా నుంచి 120 క్యూబిట్స్‌ క్వాంటం కంప్యూటర్‌ను అమరావతికి తీసుకొచ్చారు. మనిషి పసిగట్టే కంపనంలో వెయ్యో వంతు కంపనానికి కూడా ప్రభావితమయ్యే అత్యంత సున్నితమైన ఈ యంత్రాన్ని ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చామని అధికారులు చెబుతున్నారు.

అత్యంత కష్టమైన ఈ టాస్క్‌ అనంతరం ఇన్‌స్టలేషన్‌ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 120 క్యూబిట్స్‌ క్వాంటం కంప్యూటర్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తున్నప్పటికీ, భవిష్యత్తులో దీని సామర్థ్యాన్ని 1000 క్యూబిట్స్‌కు పెంచుకునేలా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతో సున్నితమైన వాతావరణంలో నడిచే క్వాంటం కంప్యూటర్‌ కోసం అధికారులు ఇప్పటికే ప్రత్యేక చాంబర్‌ను సిద్ధం చేశారు.


ప్రత్యేక చాంబర్‌ ఇలా..

క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేయడానికి ఈ సెంటర్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ప్రత్యేక చాంబర్‌ను నిర్మించారు. ఫైర్‌ ప్రూఫ్‌, బ్రేక్‌ ప్రూఫ్‌గా ఉండే పటిష్ఠమైన అద్దాలతో ఏర్పాటుచేసిన ఈ చాంబర్‌లో, ఆ అద్దాల్లోనే కర్టెన్లు కూడా ఉండేలా చర్యలు తీసుకున్నారు. చాంబర్‌లోపల నిరంతరాయంగా మైనస్‌ 270 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా ప్రత్యేక అమరిక చేస్తున్నారు. ఈ పనులను ఐబీఎం సంస్థ చూసుకుంటోంది. చాంబర్‌ను చల్లగా ఉంచేందుకు అవసరమైన నైట్రోజన్‌, హీలియం సిలిండర్లను తెప్పించారు.

ఆ రెండింటినీ వినియోగించి ఉష్టోగ్రతను మైనస్‌ 270 డిగ్రీలకు తగ్గించేందుకు అవసరమైన పనులు ప్రారంభించారు. ఆ చల్లదనం బయటకు పోకుండా ప్రత్యేకమైన పఫ్‌ పెయింటింగ్‌ షీట్లను అమరుస్తారు. కాంటం కంప్యూటర్‌కు నిరంతర విద్యుత్‌ సదుపాయం అవసరం. దీనికోసం 4 ప్రత్యేక లైన్ల ద్వారా విద్యుత్‌ను అందజేస్తున్నారు. దీనికోసం 630 కేవీ విద్యుత్‌ లైన్లు రెండు, 250 కేవీ విద్యుత్‌ లైన్లు రెండు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం ఏర్పాటుచేసే క్వాంటం కంప్యూటర్‌ కోసం 630 కేవీ, 250 కేవీ లైన్‌ను వినియోగిస్తున్నారు. మిగిలినవి భవిష్యత్తు అవసరాలకు వాడుకుంటారు. నూరు శాతం విద్యుత్‌ సరఫరా చేస్తూ, మరో నూరు శాతం స్టాండ్‌బై ఉండేలా చూస్తున్నారు.


ప్రత్యేక ఐసోలేటర్‌పై కంప్యూటర్‌..

క్వాంటం కంప్యూటర్‌కు ఏ చిన్న వైబ్రేషన్‌ (కంపనం) వచ్చినా మాల్‌ ఫంక్షన్‌ జరుగుతుంది. 12 మైక్రోమీటర్స్‌ పర్‌ సెకన్‌ స్థాయిలో.. అంటే మనం పసిగట్టగలిగే వైబ్రేషన్‌ (కంపనం)లో 1000వ వంతు కంపనాన్ని కూడా క్వాంటం కంప్యూటర్‌ తట్టుకోలేదు. పక్క నుంచి బస్సు వెళ్లినా, ఏదైనా కదిలాడినా దాని ప్రభావం కంప్యూటర్‌పై పడుతుంది. దాన్ని నివారించడం కోసం ప్రత్యేక ఐసోలేటర్‌ పరికరంపై క్వాంటం కంప్యూటర్‌ను ఉంచాలి.

ఈ ఐసోలేటర్‌ను ఐఐటీ మద్రాస్‌ డిజైన్‌ చేసింది. ఈ డిజైన్‌కు అనుగుణంగా ‘గెర్బ్‌’ సంస్థ నుంచి ఐసోలేటర్‌ను తీసుకున్నారు. ఇప్పటికే అమర్చిన ఐసోలేటర్‌పై క్వాంటం కంప్యూటర్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తున్నారు. ఈ ఇన్‌స్టలేషన్‌ ప్రక్రియ 3 నెలల వరకూ పట్టొచ్చని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మేధా టవర్స్‌, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీల్లో ఏర్పాటుచేసిన మూడు 10 క్యూబిట్స్‌ కంప్యూటర్లను క్వాంటం వ్యాలీకి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

వీటిని ఫస్ట్‌ ఫ్లోర్లో ఇన్‌స్టాల్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మొత్తం కలిపితే 150 క్యూబిట్స్‌ కంప్యూటర్‌ సిద్ధమవుతుంది. కాగా... ఇప్పటికే క్వాంటం వ్యాలీ టవర్‌ 1, టవర్‌ 2 నిర్మాణానికి రూ.769 కోట్ల అంచనాతో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుండగా.. టవర్‌3, టవర్‌ 4కు రూ.708 కోట్లు కేటాయిస్తూ క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. క్వాంటం వ్యాలీకి అనుబంధంగా పల్నాడు జిల్లా అమరావతి మండలంలో క్వాంటం హార్డ్‌వేర్‌ తయారీ పార్కును ఏర్పాటు చేయనుంది.

ఈ వార్తలనూ చదవండి:

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Updated Date - Nov 26 , 2026 | 03:36 AM