అత్యాధునిక హంగులతో శాశ్వత అసెంబ్లీ
ABN , Publish Date - Aug 27 , 2026 | 06:18 AM
రాజధాని అమరావతిలో నిర్మించనున్న శాశ్వత అసెంబ్లీ భవనాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక మౌలిక వసతులతో తీర్చిదిద్దుతున్నట్లు అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ ప్రతినిధులు తెలిపారు.
నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో స్పీకర్, మంత్రుల భేటీ
అమరావతి వైభవానికి ప్రతీకగా అసెంబ్లీ: అయ్యన్న
పెరిగే స్థానాలకు అనుగుణంగా నిర్మాణం: నాదెండ్ల
అమరావతి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో నిర్మించనున్న శాశ్వత అసెంబ్లీ భవనాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక మౌలిక వసతులతో తీర్చిదిద్దుతున్నట్లు అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులతో శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు పి. నారాయణ, నాదెండ్ల మనోహర్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో నిర్మించనున్న అసెంబ్లీ భవన అంతర్గత డిజైన్లు సహా భవనంపై నిర్మించే ఎత్తైన టవర్‌పైనా చర్చించారు. సభా మందిరం, కమిటీ హాళ్లు, ప్రజాప్రతినిధుల కార్యాలయాలు, మీడియా సౌకర్యాలపై స్పీకర్, మంత్రులకు నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు వివరించారు. శాసనసభ భవనంలో భద్రత, సాంకేతిక వ్యవస్థలు, పార్కింగ్, రాకపోకల సౌకర్యాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. అమరావతిలో నూతన అసెంబ్లీ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు. అసెంబ్లీ భవన అంతర్గత ఆకృతులు(ఇంటీరియర్ డిజైన్స్), శాసనసభ్యుల సీటింగ్ ఏర్పాట్లు, సరికొత్త డిజిటల్ సాంకేతిక వసతుల రూపకల్పనపై దృష్టి సారించాలని సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ భవన నిర్మాణాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు.
ప్రపంచస్థాయి రాజధానిగా..: నాదెండ్ల
ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా అమరావతిని నిర్మించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా రాజధానిలో శాసనసభ భవనాన్ని అత్యున్నత ప్రమాణాలతో, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించేలా చర్చించినట్లు చెప్పారు. శాసనసభ భవనంపైన ప్రత్యేక టవర్‌ను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి అమరావతి రాజధాని మొత్తాన్ని వీక్షించేలా నిర్మాణ రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజనతో చోటు చేసుకునే మార్పులను దృష్టిలో ఉంచుకుని, దీర్ఘకాలిక అవసరాలకు అనుగుణంగా భవన డిజైన్లను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 265 ఎమ్మెల్యే స్థానాలు, 110 ఎమ్మెల్సీ స్థానాలకు అనుగుణంగా అసెంబ్లీ భవనాన్ని డిజైన్ చేస్తున్నట్లు మంత్రి వివరించారు.