అమరావతి ఓఆర్‌ఆర్‌కు టెండర్లు!
ABN , Publish Date - Nov 19 , 2026 | 05:15 AM
రాజధాని అమరావతికి మణిహారమైన ఔటర్ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్) నిర్మాణానికి రంగం సిద్ధమైంది. దీనికోసం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) తాజాగా...
195.13 కి.మీ. మేర ఆరులేన్ల ఔటర్ రింగ్ రోడ్డు
నిర్మాణ వ్యయం రూ.15,116.45 కోట్లుగా అంచనా
రెండు ప్యాకేజీలుగా నిర్మాణం చేపట్టాలని నిర్ణయం
తొలి ప్యాకేజీ 87.63, రెండో ప్యాకేజీ 107.50 కి.మీ.లు
జనవరి 15 వరకూ టెండర్లు.. 18న బిడ్లు ఖరారు
గుంటూరు(రాజధాని), నవంబరు 18(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి మణిహారమైన ఔటర్ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్) నిర్మాణానికి రంగం సిద్ధమైంది. దీనికోసం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) తాజాగా మరోమారు టెండర్లను ఆహ్వానించింది. గతంలో నాలుగు ప్యాకేజీలుగా ఓఆర్‌ఆర్‌ను నిర్మించాలని భావించిన ఎన్‌హెచ్‌ఏఐ తాజాగా దాన్ని రెండు ప్యాకేజీలకు కుదించింది. పబ్లిక్ ప్రైవేట్ అప్రైజల్ కమిటీ(పీపీఏసీ) సూచనల మేరకు ప్యాకేజీల్లో మార్పులు జరిగాయి. దీనికి పీపీఏసీ ఆమోదం తెలపడంతో ఓఆర్‌ఆర్ టెండర్ల ప్రక్రియ తిరిగి మొదలైంది.
గతంలో ఆహ్వానించిన టెండర్ల ప్రక్రియ ఈ నెల 18తో ముగియడంతో, తిరిగి టెండర్లను ఆహ్వానించింది. కాంట్రాక్టర్లు బిడ్లు సమర్పించేందుకు జనవరి 15 వరకూ గడువు ప్రకటించింది. అదే నెల 18న బిడ్లను తెరచి టెండర్లను ఖరారు చేయనున్నారు. ఓఆర్‌ఆర్ పొడవు మొత్తం 195.13 కిలోమీటర్లు. ఇందులో ప్రధానమైన ఔటర్ రింగురోడ్డు 189.93 కి.మీ.లు కాగా, గుంటూరును ఓఆర్‌ఆర్‌తో కలిపేందుకు నారాకోడూరు నుంచి గుంటూరు శివారులో ఉన్న బుడంపాడు వరకూ 5.2కి.మీ. మేర నాలుగు వరసల్లో నిర్మించే కనెక్ట్ రోడ్డు(సర్ప్)తో కలిపి మొత్తం 195.13 కి.మీ.లుగా భావిస్తున్నారు.
తొలుత పిలిచిన టెండర్లలో దీనిని 27.93 కి.మీ., 56కి.మీ., 55.7కి.మీ., 55.5కి.మీ. చొప్పున నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. దీనిని ఇప్పుడు రెండు ప్యాకేజీలుగా మార్చారు. తొలి ప్యాకేజీ పొడవు 87.63 కి.మీ. అది ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల సమీపం నుంచి ఆగిరిపల్లి, ఉయ్యూరు మీదుగా కృష్ణాజిల్లా కంకిపాడు మండలం చలివేంద్రపాలెం వరకూ ఉంటుంది. రెండో ప్యాకేజీ 107.50 కి.మీ. అది ఉయ్యూరు, గుంటూరు మీదుగా కంచికచర్ల వరకూ ఉంటుంది. కృష్ణా నదిపై నిర్మించే రెండు కీలకమైన వంతెనలు ఈ ప్యాకేజీ పరిధిలోకే వస్తాయి.
20 ఏళ్లు టోల్ వసూల్!
సర్ప్ రోడ్డుతో కలిపి ఓఆర్‌ఆర్ నిర్మాణానికి మొత్తం రూ.15,116.45 కోట్లు ఖర్చవుతుందని ఎన్‌హెచ్‌ఏఐ అంచనా వేసింది. ఈ రోడ్డును హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(హెచ్‌ఏఎం) పద్ధతిలో నిర్మించాలని భావించిన ఎన్‌హెచ్‌ఏఐ, తాజాగా దాన్ని బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్(బీఓటీ) పద్ధతిలో నిర్మించేందుకు సిద్ధమైంది. సొంత నిధులతో రోడ్డు నిర్మించి 15 నుంచి 20 ఏళ్ల పాటు టోల్ వసూలు చేసుకునే పద్ధతిలో రోడ్డు నిర్మాణం జరగనుంది.
గతేడాది నవంబరులోనే భూసేకరణ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ, పీపీఏసీ అభ్యంతరాలు, కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అభ్యంతరాల నేపథ్యంలో నిర్మాణ ప్రక్రియ ఒకింత వెనకబడింది. తాజాగా రూపొందించిన నిర్మాణ ప్యాకేజీలకు పీపీఏసీ అనుమతి కూడా లభించడంతో ఓఆర్‌ఆర్ నిర్మాణానికి విఘ్ఞాలు తొలగినట్టు భావిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్
పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్