క్వాంటమ్ వ్యాలీకి కొత్తకళ!
ABN , Publish Date - Nov 22 , 2026 | 07:30 AM
రాజధాని అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు లక్ష్య సాధనలో కీలక ముందడుగు పడింది.
అమరావతిలో ‘నీలిట్ డీమ్డ్ టుబీ’ వర్సిటీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తొలి క్వాంటమ్, ఏఐ వర్సిటీ ప్రత్యేక క్యాంపస్
నాగార్జున వర్సిటీలో తాత్కాలిక తరగతులు
త్వరలో 730 కోట్లతో శాశ్వత క్యాంపస్ నిర్మాణం
ఏఎన్‌యూలో క్వాంటమ్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎన్‌ఐఈఎల్‌ఐటీ సలహాదారు ప్రతిభ
గుంటూరు(రాజధాని), నవంబరు 21(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు లక్ష్య సాధనలో కీలక ముందడుగు పడింది. కేంద్ర ఎలక్ర్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ(ఎంఈఐటీవై) ఆధ్వర్యంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎన్‌ఐఈఎల్‌ఐటీ-నీలిట్) ‘డీమ్డ్ టుబీ యూనివర్సిటీ-అమరావతి’.. తాత్కాలిక క్యాంప్‌సను ఏర్పాటు చేసింది. గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ భవనంలో ఈ క్యాంప్‌సకు శ్రీకారం చుట్టారు. ఎంఈఐటీవై సలహాదారు డాక్టర్ ఎ. ప్రతిభ దీనిని ప్రారంభించారు. ఇది ప్రపంచంలో క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తొలి క్యాంప్‌సగా నిలిచింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో నైపుణ్యాభివృద్థికి ఈ వర్సిటీ కేంద్రంగా నిలవనుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో అమరావతి క్యాంప స్ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్’ సమ్మిట్ సందర్భంగా సీఎం చంద్రబాబు సమక్షంలో ఏపీ ప్రభుత్వం, నీలిట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తొలిదశలో తాత్కాలిక క్యాంపస్‌లో రూ.47 కోట్ల వ్యయంతో 4 అత్యాధునిక ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తారు.
క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్, క్వాంటమ్ కమ్యూనికేషన్ ల్యాబ్, చిప్ డిజైన్, వీఎల్‌ఎస్ఐ ల్యాబ్, ఏఐ, కంప్యూటింగ్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటి ద్వారా ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ సంస్థలు ఉపయోగిస్తున్న అత్యాధునిక పరికరాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర విద్యార్థులు వినియోగించుకునే అవకాశం లభిస్తుంది. క్వాంటమ్, ఏఐ, అనుబంధ సాంకేతిక రంగాల్లో నైపుణ్యం ఉన్న మానవ వనరులను తయారు చేయడమే లక్ష్యంగా వివిధ కోర్సులను జనవరి నుంచి ప్రారంభిస్తున్నారు. క్యాంప్‌సతో పాటు ఆన్‌లైన్‌లోనూ శిక్షణ అందిస్తారు.
నీలిట్‌లో 2 నుంచి 3 నెలల వ్యవధిఉన్న 10 అడ్వాన్స్‌డ్ సర్టిఫికెట్ కోర్సులను అందించనున్నారు. వీటిలో క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, సైన్స్, ఇంజనీరింగ్‌లో ఏఐ వినియో గం, చిప్ డిజైన్, వీఎల్‌ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐవోటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉన్నాయి. కాగా, దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా అమరావతిలో నీలిట్ శాశ్వత క్యాంప్‌సను నిర్మించనున్నారు. దీనికిగాను రూ.730.70 కోట్లను వెచ్చించనున్నారు. ఈ క్యాంపస్ నిర్మాణానికి ఈ ఏడాది ఆగస్టులో సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. అమరావతిలోని నిడమర్రు వద్ద 8.5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.
ఈ వార్తలనూ చదవండి:
బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?
కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి