Share News

వాన నీటిని ఒడిసిపట్టి!

ABN , Publish Date - Nov 07 , 2026 | 04:10 AM

ఇటీవల రాష్ట్రంపై రెండు భారీ తుఫానులు విరుచుకుపడ్డాయి. మరీ ముఖ్యంగా మురసు తుఫాన్‌ గుంటూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. కొండవీటి వాగు ఉప్పొంగింది.

వాన నీటిని ఒడిసిపట్టి!

  • అమరావతిలో సమర్థ వరద నిర్వహణ

  • కొండవీటివాగు వరద నీరుకొండ, కృష్ణాయపాలెం రిజర్వాయర్లకు మళ్లింపు

(గుంటూరు రాజధాని - ఆంధ్రజ్యోతి): ఇటీవల రాష్ట్రంపై రెండు భారీ తుఫానులు విరుచుకుపడ్డాయి. మరీ ముఖ్యంగా మురసు తుఫాన్‌ గుంటూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. కొండవీటి వాగు ఉప్పొంగింది. అయినా సరే... రాజధాని ప్రాంతంలో ఎక్కడా వరద ముంపు కనిపించలేదు. దీనికి కారణం... వరద నీటిని ఒడిసి పట్టి రాజధానిలో నిర్మించిన రిజర్వాయర్లలోకి మళ్లించడమే. రాజధాని నగరాన్ని వరద నియంత్రణ నగరంగా నిర్మించడంలో భాగంగా పటిష్ఠమైన ప్రణాళికతో వరదనీటి నెట్‌వర్క్‌ను అమరావతి అభివృద్ధి కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏడీసీఎల్‌) అభివృద్ధి చేస్తోంది.

రాజధాని పరిధిలోని గ్రామాల్లో ప్రవహించే పాలవాగు, కొండవీటి వాగులను వివిధ దశల్లో అనుసంధానం చేస్తూ ఈ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తోంది. పాలవాగు, కొండవీటివాగు, గ్రావిటీ కెనాల్‌తో కలిసి మొత్తం 48.3 కిలోమీటర్ల స్ట్రామ్‌ వాటర్‌ నెట్‌వర్క్‌ ఉంటుంది. ప్రస్తుతం ఈ పనులు 60 శాతం మాత్రమే పూర్తయ్యాయి. అయినా, ఈ నెట్‌వర్క్‌ రాజధాని ప్రజలకు మంచి ఫలితాలను ఇచ్చింది. పాలవాగు నుంచి వచ్చే నీటిని నిల్వ చేసేందుకు శాఖమూరులోని సెంట్రల్‌ పార్కులో 44 ఎకరాల్లో 0.03 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించారు.


కొండవీటివాగుపై నీరుకొండ వద్ద 0.40 టీఎంసీల సామర్థ్యంతో మరో రిజర్వాయర్‌ను నిర్మించారు. కొండవీటివాగు ద్వారా భారీగా వరదనీరు వస్తుందని గమనించిన ఏడీసీఎల్‌ అధికారులు సత్వర చర్యలు చేపట్టారు. నీరుకొండ రిజర్వాయర్‌ వద్ద నిర్మించిన తాత్కాలిక బండ్లను తొలగించారు. వచ్చిన వరదలో 0.40 టీఎంసీల నీటిని రిజర్వాయర్లో నింపారు. అదనపు నీటిని కిందికి తరలించారు. కృష్ణాయపాలెం రిజర్వాయర్లో మరో 0.10 టీఎంసీల నీటిని నింపారు. ఇలా రిజర్వాయర్లు నింపగా మిగిలిన 180 క్యూసెక్కులను ఉండవల్లిలోని పంపింగ్‌ స్టేషన్‌ ద్వారా కృష్ణానదిలోకి ఎత్తిపోశారు. ఇలా ముందస్తు చర్యలతో వరద ముప్పు నుంచి బయటపడడమే కాకుండా, ఆ నీటిని భవిష్యత్‌ అవసరాల కోసం భద్రపరచడం గమనార్హం.

ఈ వార్తలనూ చదవండి:

కౌంటింగ్‌కు వేళాయె...

సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 07 , 2026 | 04:13 AM