ఇదేం ‘న్యాయం’ జగన్!?
ABN , Publish Date - Jun 04 , 2026 | 04:51 AM
వాళ్లెవరూ రాజధానికి తమ భూములు ఇవ్వలేదు! తమ భూములు తాము సాగు చేసుకుంటున్నారు! కొందరు... ప్రైవేటు వ్యక్తులకు ఎకరా రూ.8 కోట్లకు కూడా విక్రయించుకున్నారు. అమరావతి నిర్మాణానికి వీళ్లవల్ల అడ్డంకులు ఏర్పడ్డాయి తప్ప...
రాజధానికి భూములివ్వని వారికి అండ!
భూములిచ్చిన వేలాది మందిపై అక్కసు
2014 నుంచి వారు అమరావతికి వ్యతిరేకమే
రాజకీయం, పెత్తనం కోసమే ఆ వైఖరి
నాడు ఆళ్లతో కలిసి హైకోర్టులో కేసులు
ఆ భూములివ్వకపోవడంతో ఆగిన అనేక పనులు
27 మందిలో 21మందిది జగన్ సామాజిక వర్గమే
వైసీపీ తీరుపై మండిపడుతున్న రాజధాని రైతులు
(గుంటూరు రాజధాని - ఆంధ్రజ్యోతి)
వాళ్లెవరూ రాజధానికి తమ భూములు ఇవ్వలేదు! తమ భూములు తాము సాగు చేసుకుంటున్నారు! కొందరు... ప్రైవేటు వ్యక్తులకు ఎకరా రూ.8 కోట్లకు కూడా విక్రయించుకున్నారు. అమరావతి నిర్మాణానికి వీళ్లవల్ల అడ్డంకులు ఏర్పడ్డాయి తప్ప... వీళ్లకు జరిగిన అన్యాయం ఏమిటో ఎవరికీ తెలియదు. ఇలాంటి వారికి ‘న్యాయం’ చేస్తామంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ హామీ ఇవ్వడంపై రాజధాని ప్రాంత రైతుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. మంగళవారం ‘రాజధాని రైతుల’ పేరుతో తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్‌ను కలిసిన వారంతా పెత్తందారులే అని స్థానికులు చెబుతున్నారు. కేవలం తమ గ్రామాలపై పెత్తనం పోతుందనే ఉద్దేశంతో కొందరు, రాజకీయ కారణాలతో మరికొందరు భూసమీకరణలో అమరావతికి భూములు ఇవ్వలేదని చెబుతున్నారు. జగన్‌ను కలిసిన 27 మంది రైతుల్లో 21 మంది ఆయన సామాజిక వర్గానికి చెందినవారే. స్థానికంగా చిన్న, సన్నకారు రైతులు, కూలీలపై పట్టు కోల్పోవడం ఇష్టంలేకే తమ భూములను ఇవ్వలేదనే ఆరోపణలున్నాయి. జగన్ ఇలా గుప్పెడుమందికి అండగా నిలబడి... అమరావతికి భూములిచ్చిన వేలాదిమంది రైతులకు వ్యతిరేకంగా నిలవడంపై రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2014 నుంచీ వ్యతిరేకమే...
జగన్ కలిసిన వారంతా ఉండవల్లి, పెనుమాకకు చెందిన వారని స్థానికులు చెబుతున్నారు. వీరు 2014 నుంచి అమరావతికి వ్యతిరేకంగానే ఉన్నారని... తమ భూములు ఇవ్వకపోగా అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో హైకోర్టులో వరసపెట్టి కేసులు వేశారని గుర్తు చేస్తున్నారు. వీరు తమ భూములు ఇవ్వకపోవడంతో ఉండవల్లి, పెనుమాక ప్రాంతంలో రాజధానికి సంబంధించిన అనేక పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అతి కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు 2019కి ముందే చాలావరకూ పూర్తయింది. కానీ... వీరు భూములివ్వకపోవడంతో వెంకటపాలెం వరకు వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు ఫేజ్-2, 3 పనులకూ అడ్డంకులు ఏర్పడ్డాయి. కొండవీటివాగు విస్తరణ పనులు కూడా పలు చోట్ల ఆగిపోయాయి. ఎన్11 రోడ్డు పనులూ ఆగిపోయాయి. దీంతో ప్రభుత్వం భూసేకరణకు సిద్ధమైంది. ఇలాంటి వారినే జగన్ పిలిపించుకుని కొత్త నాటకం మొదలుపెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అమరావతిని దెబ్బతీయాలనే!
అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దానిని చెడగొట్టాలనే ఉద్దేశంతో జగన్ ఇలా భూ ములివ్వని వారితో సమావేశం అయ్యారు. భూములివ్వకుండా చేసి అమరావతిని ఆపాలని చూస్తున్నారు.
- కోటా పవన్ కుమార్, ఉండవల్లి

2014 నుంచి వారి వైఖరి ఇదే!
జగన్‌ను కలిసిన వారు 2014 నుంచీ అమరావతిని వ్యతిరేకిస్తున్నారు. అమరావతి రాకుండా ఉండడానికి ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలిసి హైకోర్టులో కేసులు వేశారు. ఇప్పుడు జగన్‌తో కలిసి అమరావతిని అడ్డుకోవాలని చూస్తున్నారు.
- పోలిశెట్టి శేషగిరిరావు, ఉండవల్లి

వాళ్లంతా పెత్తందారులే!
జగన్‌ను కలిసినవారంతా స్థానిక పెత్తందారులే. వాళ్లు ఇప్పటి వరకూ ఈ గ్రామంలోని సామాన్య, పేద రైతులపై పెత్తనం చలాయిస్తూ వచ్చారు. రాజధాని వస్తే వారి పెత్తనం సాగదని జగన్‌తో కలిసి కుట్రలు పన్నుతున్నారు. వాళ్లు భూములు ఇవ్వని కారణంగా ఎన్నో పనులు ఆగిపోయాయి.
- బసివిరెడ్డి, ఉండవల్లి