Share News

‘సాక్షి’కి వందేళ్ల రైతు లీగల్‌ నోటీసు

ABN , Publish Date - Nov 15 , 2026 | 04:13 AM

తమ కుటుంబ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించారంటూ వెలగపూడికి చెందిన రైతు కంచర్ల సాంబశివరావు ‘సాక్షి’ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. త్వరలో వందేళ్లు పూర్తిచేసుకోనున్న ఈ రైతు ఆ పత్రికకు రూ.పది కోట్లకు పరువు నష్టం దావా నోటీసు పంపారు.

‘సాక్షి’కి వందేళ్ల రైతు లీగల్‌ నోటీసు

  • రూ.10 కోట్లకు పరువునష్టం దావాకు హెచ్చరిక

  • అమరావతి భూములపై అసత్య కథనాలను ఖండించిన కంచర్ల సాంబశివరావు కుటుంబం

అమరావతి/తుళ్లూరు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): అమరావతి భూముల వ్యవహారంలో అసత్యాలతో కూడిన కథనాలు ప్రచురించి.. తమ కుటుంబ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించారంటూ వెలగపూడికి చెందిన రైతు కంచర్ల సాంబశివరావు ‘సాక్షి’ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. త్వరలో వందేళ్లు పూర్తిచేసుకోనున్న ఈ రైతు ఆ పత్రికకు రూ.పది కోట్లకు పరువు నష్టం దావా నోటీసు పంపారు. ‘గ్రామ కంఠం ముసుగులో భూ మాయాజాలం-రాజధాని భూసేకరణలో రూ.12 వేల కోట్ల కుంభకోణం’, ‘బాబు ప్యాలెస్‌కు భూమినిచ్చినందుకు నజరానా’ అంటూ తమ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేశారని సాంబశివరావు ఆక్షేపించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి భూమి విక్రయించినందుకు ప్రతిఫలంగా తన కుటుంబానికి చెందిన 1.76 ఎకరాల భూమిని గ్రామకంఠం పేరుతో భూసమీకరణ నుంచి మినహాయించారన్న ఆరోపణను తప్పుబట్టారు. వెలగపూడిలోని సదరు సర్వే నంబర్‌ 91/1ఎఫ్‌లో తమ కుటుంబ సభ్యుల పేర్లతో భూమే లేదని స్పష్టంచేశారు. గ్రామంలో కంచర్ల సాంబశివరావు కుటుంబానికి సుదీర్ఘ చరిత్ర ఉందని ఈ నెల 11న పంపిన నోటీసులో న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు పేర్కొన్నారు. ఆయన తండ్రి అంజయ్య స్వాతంత్ర సమరయోధుడని.. తల్లి శాంతికుమారి వెలగపూడి పంచాయతీ అధ్యక్షురాలిగా సేవలందించారని.. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆయన కుటుంబం భూ సమీకరణ పథకంలో భూములిచ్చిందని వివరించారు.


జీవితమంతా వ్యవసాయానికి, సమాజ సేవకు అంకితమైన సాంబశిరావుపై అవినీతి ఆరోపణలు చేయడంతో ఆయనతో పాటు కుటుంబ సభ్యులందరూ మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. నోటీసులు అందుకున్న 15 రోజుల్లోగా తప్పుడు ఆరోపణలను ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కంచర్ల కుటుంబం డిమాండ్‌ చేసింది. లేదంటే బీఎన్‌ఎస్‌ఎస్‌ 356 సెక్షన్‌ ప్రకారం క్రిమినల్‌ ఫిర్యాదు చేయడంతో పాటు రూ.10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ సివిల్‌ దావా వేస్తామని హెచ్చరించింది. లీగల్‌ నోటీసులను.. జగతి పబ్లికేషన్స్‌, ఆ సంస్థ చైర్‌పర్సన్‌ వైఎస్‌ భారతీరెడ్డి, మేనేజింగ్‌ డైరెక్టర్‌, డైరెక్టర్లు, ఎడిటర్‌, ప్రింటర్‌-పబ్లిషర్‌, రెసిడెంట్‌ ఎడిటర్‌, సంబంధిత కథనాల రిపోర్టరుకు పంపారు.

ఈ వార్తలనూ చదవండి:

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం

Updated Date - Nov 15 , 2026 | 04:13 AM