రాజధాని పనులు పరుగులు!
ABN , Publish Date - Nov 17 , 2026 | 05:28 AM
రాజధాని అమరావతిలో ఐకానిక్ సెక్రటేరియట్లు, అఖిల భారత సర్వీసు అధికారులు, గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల భవన సముదాయాల పనులు శరవేగంగా సాగుతున్నాయి.
శరవేగంగా జరుగుతున్న నిర్మాణ పనులు
2028 అక్టోబరు నాటికి తొలిదశ నిర్మాణం పూర్తి
నిర్మాణ సంస్థలకు లక్ష్యం నిర్దేశించిన సీఎం చంద్రబాబు
(గుంటూరు(రాజధాని)-ఆంధ్రజ్యోతి)
రాజధాని అమరావతిలో ఐకానిక్ సెక్రటేరియట్లు, అఖిల భారత సర్వీసు అధికారులు, గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల భవన సముదాయాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే ఈ వేగం సరిపోదని భావించిన సీఎం చంద్రబాబు ఇటీవల నిర్మాణ సంస్థలకు టార్గెట్లు విధించారు. యుద్ధపాత్రిపదికన రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అమరావతిలో ఇప్పటికే పలు నిర్మాణాలు పూర్తయ్యాయి. రాజధాని నిర్మాణంలో అత్యంత కీలకమైన ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ఏడాది క్రితమే అందుబాటులోకి వచ్చింది. ఆ తరువాత ప్రజాప్రతినిధుల కోసం 288 ఫ్లాట్లతో 6 అపార్ట్‌మెంట్లు సిద్ధమయ్యాయి. 144 మంది ఆలిండియా సర్వీసెస్ ఉద్యోగుల నివాసాల నిమిత్తం చేపట్టిన ఏఐఎస్ భవన సముదాయం తుది మెరుగులు అద్దుకుంటోంది. ఇక హైకోర్టు న్యాయమూర్తుల కోసం 36 భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా లాంఛనంగా పూర్తయింది. మంత్రుల కోసం నిర్మిస్తున్న 35 భవనాలు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్, ప్లంబింగ్, గార్డెనింగ్ సహా 80శాతం పనులు పూర్తయ్యాయి. వీటిని ఈ ఏడాది డిసెంబరు నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక 1,968 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న 21 టవర్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. గెజిటెడ్ టైప్-1 అధికారుల కోసం 384 యూనిట్లతో నిర్మిస్తున్న 4 టవర్లు, టైప్-2 అధికారుల కోసం 336 యూనిట్లతో నిర్మించే 4 టవర్లు, గ్రూప్-డీ ఉద్యోగుల కోసం 720 యూనిట్లతో నిర్మిస్తున్న 6 టవర్ల నిర్మాణం కూడా వేగంగా సాగుతోంది. వీటిలో ఒకటి రెండు భవనాలు మినహా మిగిలినవన్నీ డిసెంబరు చివరి నాటికి అందుబాటులోకి వస్తాయని, మిగిలినవి ఫిబ్రవరి నాటికి పూర్తవుతాయని చెబుతున్నారు. పూర్తయిన భవనాలను ఈ నెల 11 నుంచే ఆయా శాఖలకు దశల వారీగా అందజేస్తామని పురపాలక శాఖ చెబుతోంది.
ఐకానిక్ నిర్మాణాల్లో అనూహ్య వేగం
అమరావతికి తలమానికం కాబోతున్న ఐకానిక్ సెక్రటేరియట్ భవన సముదాయ నిర్మాణం అత్యంత వేగంగా సాగుతోంది. జీఏడీ టవర్ నిర్మాణంలో తొలి డయాగ్రిడ్ డైమండ్ నిర్మాణం పూర్తవగా, రెండో డైమండ్ పనులు చాలావరకు పూర్తయ్యాయి. టవర్-1, టవర్-3లో కోర్ వాల్‌ను దాదాపు 76మీ., టవర్-4, టవర్-2లలో 72 మీ. వరకూ నిర్మించారు. శాశ్వత హైకోర్టుకు ఫౌండేషన్ పూర్తవగా, భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఐకానిక్ అసెంబ్లీ ఫౌండేషన్ పనులు కూడా వేగం పుంజుకున్నాయి.
చకచకా రహదారుల నిర్మాణం
అమరావతిలో 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్-2 నిర్మాణం పూర్తవడంతో ఫేజ్-3 పనులు మొదలుపెట్టారు. ఎన్9, సీడ్ యాక్సిస్ రోడ్లకు ఇరువైపులా వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌ల నిర్మాణం జరుగుతోంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ పైప్‌లైన్ నెట్‌వర్క్, యుటిలిటీ నెట్‌వర్క్, విద్యుత్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తూ, వాటిపైన రోడ్లు నిర్మించాల్సి ఉంది. 2028 అక్టోబరు నాటికి తొలిదశ అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేరకు కాంట్రాక్టు సంస్థలకు టార్గెట్లు ఇచ్చి పనులు చేయిస్తోంది.
ఇవి కూడా చదవండి..
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
భారత్‌లో ఓ భిన్నమైన దృశ్యం కనిపించింది: ప్రిన్స్ విలియమ్