Share News

ఇంధన విస్ఫోటం!

ABN , Publish Date - Oct 25 , 2026 | 04:45 AM

ఒక వాహనం పైనున్న డ్రమ్ము నుంచి వేరొక వాహనంలోకి డీజిల్‌ నింపుతుండగా అనూహ్యంగా భారీ విస్ఫోటం జరిగి ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఇందులో ఒకరు ప్రభుత్వ ఉపాధ్యాయిని కాగా, మిగిలినవారు రోడ్డు పనులు చేపడుతున్న కాంట్రాక్టు సంస్థ సిబ్బంది.

ఇంధన విస్ఫోటం!

  • ఉపాధ్యాయిని సహా ఏడుగురు దుర్మరణం

  • డ్రమ్ము నుంచి టిప్పర్‌లోకి డీజిల్‌ నింపుతుండగా పేలుడు

  • స్పార్క్‌తో మంటలు చెలరేగినట్లు అనుమానాలు

  • బొలేరోలో ఉన్న పెట్రోలు, జిలెటిన్‌ స్టిక్స్‌తో ప్రమాద తీవ్రత

  • తునాతునకలైన బొలేరో, కాలి బూడిదైన టిప్పర్‌

  • మృతులో ముగ్గురు సజీవ దహనం.. ఒకరికి గాయాలు

  • వంద మీటర్ల వరకు ఎగిరిపడ్డ శరీర భాగాలు

  • అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో ఘోరం

అనంతగిరి/దేవరాపల్లి అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఒక వాహనం పైనున్న డ్రమ్ము నుంచి వేరొక వాహనంలోకి డీజిల్‌ నింపుతుండగా అనూహ్యంగా భారీ విస్ఫోటం జరిగి ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఇందులో ఒకరు ప్రభుత్వ ఉపాధ్యాయిని కాగా, మిగిలినవారు రోడ్డు పనులు చేపడుతున్న కాంట్రాక్టు సంస్థ సిబ్బంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పీచుమామిడి గ్రామ సమీపాన శనివారం ఉదయం ఈ ఘోరం జరిగింది. వివరాలివీ.. పినకోట పంచాయతీ పరిధిలోని బల్లగరువు నుంచి తునిసీబు వరకూ సుమారు 12 కిలోమీటర్ల రహదారి పనులు రూ.11.63 కోట్లతో ఎనిమిది నెలల క్రితం చేపట్టారు. ఏకేవీఆర్‌ ఇన్‌ఫ్రా కంపెనీ ఈ పనులు చేస్తోంది. అక్కడ పనిచేసే వాహనాల కోసం రోజూ దేవరాపల్లి నుంచి డ్రమ్ముల్లో డీజిల్‌, పెట్రోల్‌ తీసుకువెళతారు. శనివారం కూడా బొలేరో వాహనం డ్రమ్ముల్లో డీజిల్‌ తీసుకుని బయలుదేరింది.

బల్లగరువు దాటిన తరువాత పీచుమామిడి వద్ద బొలేరోను ఆపారు. అక్కడ బొలేరోలోని ఒక డ్రమ్ము నుంచి టిప్పర్‌లోకి డీజిల్‌ నింపుతుండగా (పంపింగ్‌?) చేస్తుండగా.. కాంట్రాక్టు సంస్థకు చెందిన టిప్పర్‌ డ్రైవర్‌, జేసీబీ డ్రైవర్‌, సూపర్‌వైజర్‌ తదితర సిబ్బంది చుట్టూ చేరారు. డీజీల్‌ నింపుతుండగా చిన్న స్పార్క్‌లా నిప్పురవ్వలు రాలిపడి ఇంధనం అంటుకుని భారీ విస్ఫోటం జరిగింది. బొలేరోలో డీజిల్‌, పెట్రోల్‌తో కూడిన డ్రమ్ములు, గ్యాస్‌ సిలిండర్‌, టిప్పర్‌లో రాయి పేల్చేందుకు ఉపయోగించే జిలెటెన్‌ స్టిక్స్‌ ఉన్నాయని, అగ్ని ప్రమాదంతో అవి పేలాయని సమాచారం. దీంతో బొలేరో తునాతునకలైపోగా టిప్పర్‌ పూర్తిగా కాలి బూడిదైంది. ఘటనలో మొత్తం ఏడుగురు మృతిచెందారు. ముగ్గురు సజీవ దహనం కాగా, వేర్వేరు ప్రదేశాల్లో ఇద్దరి మాంసపు ముద్దలు, వంద మీటర్ల దూరంలో ఉపాధ్యాయురాలి మృతదేహం లభ్యమయ్యాయి. మరొకరి మృతదేహం పూర్తిగా గుర్తు పట్టలేని రీతిలో ఖండఖండాలుగా మాంసపు ముద్దలు ఎగిరిపడింది.


ఉపాధ్యాయిని విషాదాంతం!

విశాఖపట్నంలోని విశాలాక్షి నగర్‌ ప్రాంతానికి చెందిన జాగరపు సునీత (44) అనంతగిరి మండలం మడ్రేబు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె దేవరాపల్లి నుంచి పీచుమామిడి వరకు ఇంధనం తీసుకొచ్చిన బొలేరోలోనే ప్రయాణించారు. అక్కడ వాహనం దిగి తాను పనిచేసే పాఠశాలకు వెళ్లడానికి దిచక్రవాహనం ఎక్కాల్సి ఉండగా.. పది మీటర్లు ముందుకువెళ్లారు. ఈలోగా డీజిల్‌ నిపుతున్న బొలేరోలో పేలుడు సంభవించడంతో ఆమె వంద మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. ఆమె శరీరం పూర్తిగా దెబ్బతిని అక్కడికక్కడే మృతి చెందారు. మాన్యాల మణికంఠ, మండల నారాయణరావు, పవన్‌కుమార్‌, చంద్రవంశీసింగ్‌, అజిత్‌ నజీర్‌లు రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ వద్ద పనిచేసే వర్కర్లుగా గుర్తించారు.

గ్రామమంతా మాంసపు ముద్దలే..

పేలుడు సంభవించిన పీచుమామిడి గ్రామంలో ఒకచోట చేయి.. మరోచోట కాలు, తుప్పల్లో మొండెం.. ఇలా ఎక్కడ చూసినా శరీర భాగాలు మాంసపు ముద్దలుగా కనిపించాయి. ఎం.ఇస్లాం అనే వ్యక్తికి గాయాలు కాగా పినకోట ఆస్పత్రికి తరలించారు. చింతపల్లి ఏఎస్పీ అధికారి జూదవ్‌రావు నిరంజన్‌, సీఐ కోటేశ్వరరావు, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాల గుర్తింపు, తరలింపు చేపట్టారు.

మృతులు వీరే..

మృతుల్లో అనంతగిరి మండలం మడ్రేబు గ్రామ ఉపాధ్యాయిని జాగరపు సునీత (44) సహా, బిహార్‌ రాష్ట్రం ఔరంగాబాద్‌కు చెందిన బొలేరో డ్రైవర్‌ టింకూ చంద్రవంశీసింగ్‌ (35), అనకాపల్లి జిల్లా దేవరాపల్లికి చెందిన మాన్యాల మణికంఠ (23), కడప జిల్లా మల్లేపల్లికి చెందిన ఆదిబోయిన గురుపవన్‌ (27), అల్లూరి జిల్లా పెదబయలుకు చెందిన పాంగి చిరంజీవి (30), అసోంకు చెందిన నజీర్‌ (25), చీడికాడ మండలం సూర్యనారాయణపురానికి చెందిన సైట్‌ సూపర్‌వైజర్‌ మండల నారాయణరావు (40)ఉన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

కానరాని ఎన్నికల సందడి

భీతావహం

Updated Date - Oct 25 , 2026 | 04:45 AM