కొలువుదీరిన మండలాధీశులు!
ABN , Publish Date - Nov 20 , 2026 | 02:51 AM
రాష్ట్రంలో మొత్తం 659 మండల ప్రజా పరిషత్‌లకు గాను 626 అధ్యక్ష స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి
584 మంది ఎంపీపీలు కూటమి నేతలే
వైసీపీ 38 స్థానాలకే పరిమితం
నాలుగు మండలాల్లో ఇతరులు, సీపీఎం గెలుపు
33 మండలాధ్యక్షుల ఎన్నిక నేటికి వాయిదా
56 మండలాల్లో ఉపాధ్యక్ష స్థానాలకు కూడా..
అల్లూరి తప్ప ఎక్కడా కానరాని వైసీపీ ప్రభావం
శ్రీకాకుళం, విశాఖ, కాకినాడ, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, మార్కాపురం,
కడపలో కూటమి క్లీన్‌స్వీప్
అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మొత్తం 659 మండల ప్రజా పరిషత్‌లకు గాను 626 అధ్యక్ష స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. 602 ఉపాధ్యక్ష స్థానాలకూ ఎన్నికలు పూర్తయ్యాయి. మిగతా 33 అధ్యక్ష, 56 ఉపాధ్యక్ష స్థానాలకు వివిధ కారణాలతో ఎన్నికలు వాయిదాపడ్డాయి.
వీటికి శుక్రవారం ఎన్నికలు జరుపుతామని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) వెల్లడించింది. 626 ఎంపీపీలకు గాను కూటమి ఏకంగా 584 స్థానాలను కైవసం చేసుకుంది. వైసీపీ 38 ఎంపీపీలకే పరిమితమైంది. సీపీఎం సహా ఇతరులు నాలుగు చోట్ల విజయం సాధించారు. ఉత్తరాంధ్రలో అల్లూరి సీతారామరాజు జిల్లా తప్ప మరెక్కడా వైసీపీ ప్రభావం చూపలేకపోయింది.
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి సున్నా..
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక ఎంపీపీ స్థానం కూడా దక్కలేదు. ఇక్కడ 30 ఎంపీపీలకు గాను.. టీడీపీ 27, బీజేపీ ఒకటి గెలుచుకున్నాయి. లావేరు ఎంపీపీగా బీజేపీకి చెందిన శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. శ్రీకాకుళం, గార ఎంపీపీలు, వైస్ ఎంపీపీల ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రాబల్యం ఉన్న విజయనగరం జిల్లాలో వైసీపీ ఒక్క మండలాధ్యక్ష పదవిని మాత్రమే దక్కించుకుంది.
27 ఎంపీపీలకు గాను 25 టీడీపీ ఖాతాలో పడ్డాయి. వివిధ కారణాలతో భోగాపురం ఎంపీపీ ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది. భోగాపురం, చీపురుపల్లి, పూసపాటిరేగ మండలాల ఉపాధ్యక్ష ఎన్నికలు శుక్రవారం జరుగనున్నాయి. పార్వతీపురం మన్యంజిల్లాలో 15 ఎంపీపీ స్థానాలకు గాను టీడీపీ 12, జనసేన 1 కైవసం చేసుకున్నాయి.
మక్కువ, సీతంపేట ఎంపీపీలుగా వైసీపీకి చెందిన మావుడి రామలక్ష్మి, ఇమరిక ఆదిలక్ష్మి ఎన్నికయ్యారు. అల్లూరి జిల్లాలో మొత్తం 11 ఎంపీపీలకు గాను వైసీపీ 6, కూటమి 3 దక్కించుకోగా.. గూడెంకొత్తవీధిలో స్వతంత్ర అభ్యర్థి ఎన్నికయ్యారు. కోరం లేక డుంబ్రిగుడ మండలం ఎన్నిక వాయిదా పడింది.
విశాఖలో 4 ఎంపీపీలూ కూటమి కైవసం
జిల్లాలోని నాలుగు మండలాలనూ కూటమి (టీడీపీ 3, జనసేన 1) కైవసం చేసుకుంది. ఆనందపురంలో తాట్రాడు అప్పారావు (టీడీపీ), భీమిలిలో ఎరబాల కృష్ణవేణి (టీడీపీ), పద్మనాభంలో కుచ్చర్లకోట అరుణకుమారి (టీడీపీ), పెందుర్తిలో మడక సంతోషికుమారి (జనసేన) మండలాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
ఉపాధ్యక్ష పదవులు కూడా కూటమికే దక్కాయి. జిల్లాలో 24 ఎంపీపీ స్థానాలకు గాను 23 కూటమి (టీడీపీ 21, జనసేన 2) పరమయ్యాయి. ఒకచోట వైసీపీ అభ్యర్థి ఎన్నికయ్యారు. చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల్లో ఉపాధ్యక్షుల ఎన్నిక శుక్రవారానికి వాయిదాపడింది.మునగపాక మండలంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కూటమి పొత్తులో భాగంగా ఈ ఎంపీపీ స్థానాన్ని జనసేనకు కేటాయించారు.
మండలంలోని 16 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి, వైసీపీ చెరో 8 స్థానాలు గెలుచుకున్నాయి. ఇక్కడ లాటరీలో వైసీపీకి చెందిన మొల్లేటి శంకర్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా జనసేనకు చెందిన దొడ్డి భారతి లాటరీలోనే ఎంపికయ్యారు.
కాకినాడలో పదవులన్నీ కూటమి కైవసం..
జిల్లాలో ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవులన్నిటినీ కూటమే గెలుచుకుంది. మొత్తం 20కి గాను 19 మండలాలకు ఎన్నికలు జరుగగా.. టీడీపీ 14, జనసేన 5 ఎంపీపీ కుర్చీలు కైవసం చేసుకున్నాయి. ఉపాధ్యక్ష స్థానాల్లో టీడీపీకి 13, జనసేన 5, బీజేపీకి 1 దక్కాయి. వైసీపీకి ఒక్క పదవి కూడా దక్కలేదు.
యు.కొత్తపల్లి ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నిక వాయిదా పడింది. జనసేన ఎంపీపీ అభ్యర్థి ఘంటా విజయకుమార్ ఇండిపెండెంట్ ఎంపీటీసీ ఉమామహేశ్వరరావును చెంపపై కొట్టారు. ఫలితంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. గొడవ చల్లారకపోవడంతో ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు.
పిఠాపురం ఎంపీపీ ఎన్నికలో బీఫారం ఇచ్చిన అధికారిక అభ్యర్థిని కాదని మరో అభ్యర్థిని జనసేన నేతలు ప్రకటించారు. దీంతో అధికారిక అభ్యర్థి విరవాడ-1 ఎంపీటీసీ రామిశెట్టి గంగాపార్వతికి ఓటమి తప్పలేదు. ఎంపీపీగా ఎంపీటీసీ వీరంరెడ్డి అమరేశ్వరరావు ఎన్నికయ్యారు.
కోనసీమ క్లీన్‌స్వీప్..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మొత్తం 19 ఎంపీపీ స్థానాలూ కూటమి కైవసమయ్యాయి. వీటిలో 12 టీడీపీ, జనసేన 7 గెలుచుకున్నాయి. ఉపాధ్యక్ష స్థానాల్లో 13 టీడీపీకి, ఐదు జనసేనకు, ఒకటి స్వతంత్రులకు దక్కాయి.
తూర్పున 19 కూటమికే..
తూర్పుగోదావరి జిల్లాలో 21 ఎంపీపీ స్థానాలకు గాను కూటమి 19 గెలుచుకుంది. వైసీపీకి రెండు దక్కాయి. ఉపాధ్యక్ష స్థానాల్లో టీడీపీ, జనసేన చెరో 9, బీజేపీ ఒకటి, వైసీపీ రెండు గెలుచుకున్నాయి. పోలవరం జిల్లాలో 12 ఎంపీపీలకు గాను వైసీపీ మూడింటిని దక్కించుకుంది. టీడీపీ 6, జనసేన, సీపీఎం చెరొకటి గెలుచుకున్నాయి. ఒకచోట వాయిదాపడింది. ఉపాధ్యక్ష స్థానాల్లో వైసీపీకి నాలుగు, సీపీఎంకు రెండు దక్కాయి. టీడీపీ 2, జనసేన, బీజేపీలకు చెరొకటి మాత్రమే వచ్చాయి.
పశ్చిమలో అన్నీ కూటమికే..
పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 20 ఎంపీపీలనూ కూటమి చేజిక్కించుకుంది. వీటిలో 14 టీడీపీ, 6 జనసేన గెలుచుకున్నాయి. ఉపాధ్యక్ష స్థానాల్లో 12 టీడీపీ, 7 జనసేన, 1 బీజేపీ ఖాతాలో పడ్డాయి. ఏలూరు జిల్లాలో రెండు చోట్ల మినహా 27 మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. టీడీపీ 19, జనసేన 3, బీజేపీ 2 (మొత్తం 24) గెలుచుకున్నాయి. వైసీపీ మూడు మండలాధ్యక్ష పీఠాలను దక్కించుకుంది.
కృష్ణాలో 23 కూటమికే..
కృష్ణా జిల్లాలో 26 ఎంపీపీలకు గాను మూడు చోట్ల ఎన్నికలు వాయిదాపడ్డాయి. మిగతా 23లో టీడీపీకి 16, జనసేనకు 6, బీజేపీకి ఒకటి దక్కాయి. 3 మండలాలు మచిలీపట్నం నార్త్, సౌత్, నాగాయలంకల్లో ఎన్నిక జరుగలేదు. ఎన్టీఆర్ జిల్లాలోని మొత్తం 16 ఎంపీపీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది.
గుంటూరు, పల్నాడును ఊడ్చేసిన కూటమి
పల్నాడు జిల్లాలోని మొత్తం 28 ఎంపీపీలకు గాను 26 టీడీపీ ఖాతాలో పడ్డాయి. వినుకొండ, రొంపిచర్ల మండలాధ్యక్షులకు, అచ్చంపేట ఉపాధ్యక్ష స్థానానికి ఎన్నికలు వాయిదా పడ్డాయి. గుంటూరు జిల్లాలో ఎన్నికలు జరిగిన మొత్తం 13 ఎంపీపీలనూ కూటమి గెలుచుకుంది. వీటిలో 12 టీడీపీ వశమయ్యాయి. తెనాలి మండలాధ్యక్ష పదవి జనసేనకు దక్కింది. బాపట్ల జిల్లాలో 20 ఎంపీపీలకు గాను 19 కూటమిపరమయ్యాయి. వీటిలో 18 టీడీపీ, ఒకటి జపసేన దక్కించుకున్నాయి.
జిల్లా కేంద్రమైన బాపట్ల ఎంపీపీ ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది. ఇక్కడ మొత్తం 15 ఎంపీటీసీలు ఉండగా టీడీపీ 7, వైసీపీ 8 దక్కించుకున్నాయి. క్యాంపు నుంచి వైసీపీ ఎంపీటీసీలు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కార్యాలయం బయట వైసీపీ నేతలు, శ్రేణులతో పాటు టీడీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలతో పాటు బాహాబాహీకి దిగడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పి చెదరగొట్టారు. నిరసనల నేపథ్యంలో ఎన్నికను వాయిదా వేశారు.
ప్రకాశంలో 25 ఎంపీపీలు టీడీపీకే
జిల్లాలో 27 ఎంపీపీలకు 26కి ఎన్నికలు జరిగాయి. ఇవన్నీ కూటమికే దక్కాయి. టీడీపీకి చెందిన 25 మంది నేతలు మండలాధ్యక్షులయ్యారు. నాగులుప్పలపాడు మండలాధ్యక్ష పదవి జనసేనకు దక్కింది. కొత్తపట్నం ఎంపీపీ అభ్యర్థి విషయంలో కూటమిలో ఏకాభిప్రాయం లేకపోవడంతో కోరం లేక ఎన్నికను శుక్రవారానికి వాయిదావేశారు. మార్కాపునం జిల్లాలో మొత్తం 21 ఎంపీపీలకు గాను 17 చోట్ల ఎన్నికలు జరిగాయి. అన్నీ టీడీపీకే దక్కాయి. కనిగిరి, హనుమంతునిపాడు, పీసీపల్లి, వెలిగండ్ల మండలాల్లో ఎన్నిక శుక్రవారానికి వాయిదాపడింది.
నెల్లూరులో కూటమి ప్రభంజనం..
జిల్లాలో మొత్తం 35 ఎంపీపీలకు గాను 34 కూటమికే దక్కాయి. వీటిలో 32 టీడీపీకి, జనసేన, బీజేపీలకు చెరొకటి లభించాయి. వింజమూరు వైసీపీ ఖాతాలో పడింది. సైదాపురం మండలాధ్యక్ష పదవికి లాటరీ తీయగా.. ఎంపీపీ పీఠం కూటమినే వరించింది.
కర్నూలులో 24 ఎంపీపీలు టీడీపీ కైవసం
జిల్లాలో 26 ఎంపీపీలకు గాను 25 కూటమికే దక్కాయి. వీటిలో 24 మండలాల్లో టీడీపీ అభ్యర్థులే గెలిచారు. కోడుమూరు మండలాధ్యక్ష పదవిని సీపీఎం సాయంతో వైసీపీ కైవసం చేసుకుంది. మంత్రాలయం ఎంపీపీ పీఠంపై టీడీపీ, జనసేన మధ్య ఉత్కంఠ నెలకొంది. 18 ఎంపీటీసీ స్థానాలున్న ఈ మండలంలో టీడీపీ 7, జనసేన 1, వైసీపీ 7 స్థానాలు దక్కించుకున్నాయి.
కూటమి ఎంపీపీ అభ్యర్థిగా టీడీపీ నియోజకవర్గం ఇన్చార్జి రాఘవేంద్రరెడ్డి భార్య యశోదమ్మ పేరును ఎన్నికలకు ముందే ప్రకటించారు. ఆమె మాధవరం-1 ఎంపీటీసీగా గెలిచారు. గురువారం ప్రమాణస్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లూ చేశారు. అయితే మంత్రాలయం ఎంపీపీ పీఠాన్ని జనసేనకు కేటాయించినట్లు టీడీపీ అధిష్ఠానం నుంచి సమాచారం అందింది. దీంతో యశోదమ్మకు టీడీపీ బీ-ఫారం ఇవ్వలేదు.
దరిమిలా టీడీపీ ఎంపీటీసీలెవరూ మండల పరిషత్ ప్రత్యేక సమావేశానికి హాజరు కాలేదు. జనసేన సమన్వయకర్తల్లో ఒకరైన లక్ష్మన్న కోడలు సులోచన మంత్రాలయం-3 ఎంపీటీసీగా గెలిచారు. ఆమెకు ఎంపీపీ పీఠం ఇవ్వడంపై టీడీపీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయి. ఇక్కడ శుక్రవారం ఎన్నిక జరగాల్సి ఉంది.
తిరుపతిలో 5 ఎంపీపీల ఎన్నిక వాయిదా
తిరుపతి జిల్లాలో 35 ఎంపీపీలకు గాను 30కి ఎన్నిక జరిగింది. టీడీపీకి 27, జనసేనకు 1, వైసీపీకి 2 చొప్పున దక్కాయి. వివిధ కారణాలతో తొట్టంబేడు, నాగలాపురం, వెంకటగిరి, ఓజిలి, వాకాడు ఎంపీపీల ఎన్నిక శుక్రవారానికి వాయిదాపడింది.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్డీఎంఏ