Share News

ఇదీ జగ‘నిజం’!

ABN , Publish Date - Apr 10 , 2026 | 04:13 AM

వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణంలో ఏకైక లబ్ధిదారుడు ఆయన కుమారుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వైఎస్‌ మరణం వెనుక జగన్‌ హస్తం ఉందని వాళ్ల పార్టీలో ముఖ్యనేత బొత్స.....

ఇదీ జగ‘నిజం’!

  • 2009లో వైఎస్‌ వెళ్తున్న హెలికాప్టర్‌ అదృశ్యమైనప్పుడు జగన్‌ చేసింది ఏంటి? వైఎస్‌ తప్పిపోయారో? చనిపోయారో? తెలియక అందరూ ఆందోళన చెందుతుంటే.. వైఎస్‌ ఆచూకీ దొరకక ముందే జగన్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సంతకాలు పెట్టించిన విషయం నిజం కాదా? మీ బాబాయ్‌ ఎలా చనిపోయాడు? బాబాయ్‌పై గొడ్డలి వేటు వేసి, చంద్రబాబే చంపేశారని నీ పత్రికలో ‘నారాసుర రక్తచరిత్ర’ అని రాయించావ్‌. వైఎస్‌, వివేకానందరెడ్డి చావులతో నువ్వు తప్ప ఇంకెవరైనా లాభం పొందారా? ఈ రెండు చావులలో నువ్వే లబ్ధిదారు.

- మంత్రి అచ్చెన్నాయుడు

  • ఆయన గురించి జనమంతా తెలుసుకోవాలి

  • నాన్న, చిన్నాన్న మరణాల ‘తొలి లబ్ధిదారు’

  • వైఎస్‌ ఆచూకీ తెలియకముందే పదవికోసం సంతకాలు

  • రిలయన్స్‌పై ఆరోపణలు చేసి.. ఆనక వారికే రాజ్యసభ సీటు

  • వైఎస్‌ మరణం వెనుక జగన్‌ హస్తం ఉందని నాడు బొత్స అనుమానాలు

  • ఆస్తి ఇవ్వకుండా చెల్లినీ, అడిగినందుకు తల్లినీ గెంటేశారు

  • పార్లమెంటులో చట్టం చేశాకా.. ‘మావిగన్‌’ మాయలా?

  • జిల్లాల మధ్య తగవులకు కుట్ర.. పదవీ కాంక్షతో అకృత్యాలు

  • ప్రజలపైనా, రాష్ట్రంపైనా జగన్‌కు ఎందుకింత కక్ష?

  • నిలకడలేని నాయకుడు.. జోకర్‌లా తీరు

  • వైఎస్‌ జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి అచ్చెన్న

అమరావతి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణంలో ఏకైక లబ్ధిదారుడు ఆయన కుమారుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వైఎస్‌ మరణం వెనుక జగన్‌ హస్తం ఉందని వాళ్ల పార్టీలో ముఖ్యనేత బొత్స సత్యనారాయణ అప్పట్లో అనుమానాలు వ్యక్తం చేశారని గుర్తుచేశారు. ‘ఒక సైకోకు పదవీ వ్యామోహం వస్తే ఏదైనా చేస్తాడు. పదవి కోసం తండ్రినైనా, బాబాయ్‌నైనా, తల్లినైనా, చెల్లినైనా, చివరికి పార్టీ వాళ్లనైనా ఏదైనా చేయడానికి వెనుకాడడు. అలాంటి వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి’ అని ధ్వజమెత్తారు. ఒక వ్యక్తి ప్రవర్తన వల్ల కుటుంబాలు ఏ విధంగా చెడిపోతాయో.. సమాజం ఏ విధంగా విధ్వంసానికి గురవుతుందో.. ప్రాంతాలు, కులాల మధ్య ఎలాంటి విభేదాలు వస్తాయో.. వీటన్నింటికీ మించి పదవీ కాంక్షతో ఎన్ని అకృత్యాలకు పాల్పడతారో చెప్పేందుకు ఉత్తమ ఉదాహరణ జగనే అని అన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో అచ్చెన్న మీడియాతో మాట్లాడారు.


‘‘నా మాటలు అందరూ వినాలి. జగన్‌ మీడియా కూడా లైవ్‌ ఇవ్వాలి. వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఓ మంత్రిగా కన్నా.. ఈ రాష్ట్రంలో పుట్టిన ఒక పౌరుడిగా నాపై ఉంది. 2019 ఎన్నికల్లో ఒక్క చాన్స్‌ అని జగన్‌ అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసానికి గురి చేశాడో.. వ్యవస్థలన్నింటినీ ఏ విధంగా భ్రష్టు పట్టించాడో.. 2024 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నిదర్శనం. 2024లో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలో ఎన్డీయేపై విశ్వాసంతో ప్రజలు కూటమికి అధికారాన్ని ఇచ్చారు. గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని దృష్టిలో ఉంచుకుని.. కేంద్ర ప్రభుత్వ సహాయ, సహకారాలతో సీఎం చంద్రబాబు వ్యవస్థలన్నీ గాడిన పెట్టి, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం మీద, తెలుగు ప్రజల మీద జగన్‌కు ఎందుకింత కక్షో సమాధానం చెప్పాలి. అమరావతే శాశ్వత రాజధాని అని చట్టం వచ్చాక కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు’’ అని అన్నారు.

జగన్‌కు నిలకడ ఉందా?

‘‘నీకు(జగన్‌) అసలు నిలకడ ఉందా? సీఎం పదవి ఇవ్వలేదని కాంగ్రెస్‌ మీద పోరాటం చేశావ్‌. లక్ష కోట్లు దోచుకున్నావని కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసు పెట్టి జైల్లో పెడితే.. జైలు నుంచి బయటకు రావటానికి సోనియాగాంధీ కాళ్లపై పడి, బెయిల్‌ తెచ్చుకున్నావ్‌ కదా? 2014లో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధానిపై అసెంబ్లీలో చర్చ జరిగితే.. గుంటూరు-విజయవాడ మధ్య అమరావతికి అంగీకారం చెప్పావు. 2019 ఎన్నికల్లో కూడా ఇదే చెప్పావు. అధికారంలోకి వచ్చాక అమరావతిని పక్కనపెట్టి, మూడు రాజధానులని మాటమార్చావు. రోజుకో మాట మాట్లాడే సైకో మాటకు విలువ లేదని మూడు ప్రాంతాల్లో కర్రు కాల్చి వాతపెట్టారు. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని మేం మాటిచ్చాం. అమరావతి శాశ్వతంగా రాష్ట్రానికి రాజధానిగా ఉండాలని చట్టబద్ధత కల్పించాం’’ అని చెప్పారు. ‘‘పార్లమెంట్‌లో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అన్ని పార్టీలు అమరావతికి మద్దతు పలికాయి. కానీ ఏకైక సైకో పార్టీ వైసీపీ వ్యతిరేకించింది. ఎన్డీయేకు, చంద్రబాబుకు మంచి పేరు రాకుండా, ప్రజల ఆలోచనను మార్చాలని జగన్‌ మావిగన్‌ను తెరపైకి తెచ్చారు. రాజధాని పేరిట అప్పుడు ప్రాంతాల మధ్య తగువులు పెట్టారు.


ఇప్పుడు మూడు జిల్లాల మధ్య తగువులు పెడుతున్నారు. సైకో కాకపోతే ఏంటి ఈ పనులు? మావిగన్‌ అంటే.. ప్రతి ఒక్కరూ జగన్‌ను జోకర్‌లా చూస్తున్నారు. వేరే రాజకీయ పార్టీ కాదు.. అతని పార్టీ వాళ్లు, అతని చుట్టూ తిరిగిన వాళ్లు కూడా ఏంటీ పిచ్చెక్కిందా? అని అనుకుంటున్నారు. 151 సీట్ల నుంచి 11కి దించినా ఏ మార్పూ రాలేదు. వైసీపీలో పెద్దలు, పీసీసీ అధ్యక్షులుగా చేసిన వాళ్లు, పెద్దపెద్ద మంత్రి పదవులు చేసిన వాళ్లు.. మళ్లీ అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని మార్చేస్తాం అంటున్నారు. నిమిషానికో మాట.. గంటకో మాట.. అధికారం కోసం ఏదైనా మాట్లాడతారా? రాజధానికి రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతుందన్న జగన్‌కు తెలియకపోతే.. పాఠాలు చెప్తాం. అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్ట్‌. ఉత్తరాంధ్ర రాజధాని అని అన్నారు.. ఏం చేశారు? ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్తిబాబుకు మాట్లాడటానికి సిగ్గుండాలి. జగన్‌ మాటలు మార్చినట్టు.. మీరూ మాటలు మారుస్తారా? ఉత్తరాంధ్రలో 22 నెలల్లో ఏం చేశామో కాలికి గజ్జ కట్టుకుని తిరిగి చెబుతాం. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం వల్లే 2019లో పార్టీ ఓడిపోయింది. 2029లో ఆ చాన్స్‌ ఇవ్వబోం. జగన్‌ అధికారంలోకి రావడం కల్ల’’ అని అచ్చెన్నాయుడు అన్నారు.

ఇదీ జగన్‌ నైజం

‘‘వైఎస్‌ మృతి వెనుక జగన్‌ హస్తం ఉందని ఆనాడు బొత్స సత్యనారాయణ మాట్లాడారు. కానీ అప్పుడు మేం ఆ విషయాన్ని సీరియ్‌సగా తీసుకోలేదు. కానీ తర్వాత పరిణామాలన్నీ చూస్తే అర్థమౌతోంది. తండ్రి మరణాన్ని సానుభూతిగా మలుచుకుని ఏ విధంగా ప్రవర్తించాడో చూశాం. తండ్రి మరణం నిర్ధారణ కాకముందే సంతకాలు సేకరించి సీఎం పదవి కోసం ఏ విధంగా ప్రయత్నం చేశాడో తెలిసిందే. తర్వాత 2014లో జగన్‌ రాష్ట్రమంతా తిరిగి తండ్రి మరణాన్ని సానుభూతిగా మలుచుకుని, ఒక్క అవకాశం ఇవ్వాలని కోరినా ప్రజలు నమ్మలేదు. 2019లో బాబాయ్‌ వైఎస్‌ వివేకాని గొడ్డలితో నరికిన విషయం చిన్న పిల్లవాడిని అడిగినా చెప్పే పరిస్థితి వచ్చింది. జగన్‌ జైలులో ఉన్నప్పుడు అతడి కోసం, పార్టీ కోసం ఏ విధంగా కష్టపడిందో ఆయన చెల్లెలు చెబుతుంది. ‘మీ చెల్లికి సమాన వాటా ఇవ్వాలని మీ నాన్న రాసిపెట్టారు’ అని తల్లి అడిగితే.. చివరికి తల్లిని కూడా బయటకు పంపిన వ్యక్తి జగన్‌రెడ్డి. జగన్‌ కుతంత్రాలన్నీ చూస్తే.. ఆయనకు కావాల్సింది పద వే. రాష్ట్రం ఏమైనా, ప్రజలు ఎలాగున్నా, కుటుంబం విడిపోయినా పర్వాలేదు. ఆత్మీయులు దూరమైనా సరే ఆయనకు కావాల్సింది పదవే. ఏ నిమిషానికి ఎలా ఉంటాడో? ఏం మాట్లాడతాడో? ఏ విధంగా ప్రవర్తిస్తాడో? ఎవరికీ తెలీదు. అందుకే సైకో అంటారు’’ అని విమర్శించారు.


పత్రికపై దాడులను ప్రోత్సహిస్తారా

‘‘మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడుం ది? ఓ పత్రిక గురించి మాట్లాడుతున్నావ్‌. నీ భార్య కూడా ఓ పత్రిక నడుపుతోంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి సొమ్ముతో పేపరు పెట్టారు. కానీ రాధాకృష్ణ జర్నలిజంలో పుట్టారు. పాత్రికేయుడిగా పని చేశారు. అంచెలంచెలుగా ఎదిగి ఓ పత్రిక, చానల్‌ పెట్టుకున్నారు. ఆయన ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తే నీకు నచ్చలేదు. ప్రెస్‌మీట్‌ పెట్టి కౌంటర్‌ ఇవ్వు. సమాధానం రాకపోతే న్యాయస్థానానికి వెళ్లాలి. అంతేకానీ దాడులకు ప్రోత్సహిస్తారా? నీ టీవీలో అమరావతి మహిళల్ని వ్యభిచారులతో పోల్చలేదా? నారా భువనేశ్వరిని శాసనసభలో అవమానిస్తే.. కనీసం ఖండించావా? రాజశేఖరరెడ్డికి నీ చెల్లి పుట్టలేదని ట్రోల్‌ చేస్తే కనీస చర్య లేదు. నువ్వా.. మహిళల గురించి మాట్లాడేది. ఇలాంటి వ్యక్తులు సమాజానికి చీడపురుగులు. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో గ్రహించాలి. జగన్‌ లాంటి వ్యక్తులు రాజకీయాలకు అవసరమా అని ఆలోచించాలి’’ అని అచ్చెన్న ప్రజలను కోరారు.

నాడు రోశయ్య ఏం చెప్పారంటే..

‘‘గతంలో జగన్‌ వ్యవహార శైలి ఏంటంటే.. తండ్రిని మానసిక క్షోభకు గురి చేశాడు. నిరంతరం ఇంట్లో గొడవ పడ్డారు. జగన్‌ రాష్ట్రంలో ఉంటే తనకు మానసిక క్షోభతో పాటు రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే అప్పట్లో జగన్‌రెడ్డిని వైఎస్‌ బెంగళూరు పంపిన విషయం తెలిసిందే. ఇది ఆ రోజు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రోశయ్య పాత్రికేయులతో అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. అటువంటి వ్యక్తి(జగన్‌) ఈ రాష్ట్రానికి సీఎం కావాలంటే.. వైఎస్‌ బతికి ఉంటే జరిగే పని కాదు. వైఎస్‌ చనిపోయినప్పుడు జగన్‌ ఎక్కడున్నారో చెప్పాల్సిన బాధ్యత అతనిపై ఉంది. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది. వైఎస్‌ చనిపోయిన రోజు వందల కోట్ల విలువైన పోలవరం టెండర్లను ఆన్‌లైన్‌లో ఎలా దాఖలు చేశారో సమాధానమివ్వాలి. ఆ రోజు హెలికాప్టర్‌ అదృశ్యం వెనుక రిలయన్స్‌ వాళ్లు ఉన్నారని జగన్‌ ఆరోపించారు. తర్వాత అదే రిలయన్స్‌తో రాజీ చేసుకుని, ఆ సంస్థకు చెందిన వారికి రాజ్యసభ స్థానాలిచ్చారు’’ అని అన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 05:29 AM