ప్రేమోన్మాది వెంకటేష్‌పై కాల్పులు.. కారణం ఏంటో చెప్పిన ఎస్పీ
ABN , Publish Date - Apr 11 , 2026 | 01:38 PM
ఖాజీపేట విద్యార్థిని రామకీర్తనను చంపిన ప్రేమోన్మాది వెంకటేష్‌పై పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల ఘటనపై కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ స్పందించారు.
కడప, ఏప్రిల్ 11: ఖాజీపేట విద్యార్థిని రామకీర్తనను చంపిన ప్రేమోన్మాది వెంకటేష్‌పై పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. నిందితుడిని మైదుకూరు నుంచి తీసుకెళుతుండగా.. బాసాపురం చెక్‌పోస్ట్ దగ్గర పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడిని అడ్డుకోవటంతో వారిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే సీఐ వంశీధర్ నిందితుడిపై కాల్పులు జరిపారు. కాల్పుల ఘటనపై కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ స్పందించారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రామకీర్తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో వెంకటేష్ ఆమె గొంతు కోసి హత్య చేశాడు. నిందితుడిని మైదుకూరు నుంచి తీసుకెళుతుండగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంకటేష్ పారిపోయే క్రమంలో పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. లొంగిపొమ్మని వార్నింగ్ ఇచ్చి.. సీఐ గాల్లోకి కాల్పులు జరిపినా అతడు వినలేదు. దీంతో నిందితుడి మోకాళ్ల కింద కాల్పులు జరిపారు’ అని అన్నారు.
ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్..
ఖాజీపేట విద్యార్థిని రామకీర్తన హత్య ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు. మహిళలు, బాలికలపై దాడులకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించరాదని తేల్చి చెప్పారు. ఖాజీపేట ఘటన నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
నారీ శక్తి వందనం బిల్లుతో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు: డీకే అరుణ
రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి