పేదలకు పట్టాభిషేకం
ABN , Publish Date - Oct 05 , 2026 | 03:24 AM
రాష్ట్రంలో పేదలందరికీ సొంత ఇంటి కలను 2029 నాటికి సాకారం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇది ఎన్నికలకు ముందు ఎన్‌డీఏ కూటమి పేదలకు ఇచ్చిన హామీ అని, దానిని తప్పక నిలబెట్టుకొంటామని చెప్పారు.
2029 నాటికి 9 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం
రాష్ట్రంలో సొంతిల్లు లేని పేద కుటుంబం ఉండదు
అత్యాధునిక త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ వినియోగం
పైలట్ ప్రాజెక్టులో 5 వేల ఇళ్ల నిర్మాణం.. దేశానికి దిక్సూచి
గొడ్డలి పార్టీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణం భ్రష్టు
ఇళ్ల స్థలాల పేరుతో అంతులేని అవినీతి: చంద్రబాబు
బుర్రిపాలెంలో పీఎంఏవై-గ్రామీణ్ 2.0 ప్రారంభోత్సవం
శివరాజ్‌తో కలసి పైలట్ ప్రాజెక్టు ఇళ్లకు శంకుస్థాపన
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొనేందుకు కూటమిలోని ప్రతి ఒక్కరూ అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రతి కుటుంబానికి భరోసా. ప్రతి వర్గానికి అండ. ప్రతి ప్రాంతానికి అవకాశం. ఇదే కూటమి సిద్ధాంతం.
- ముఖ్యమంత్రి చంద్రబాబు
గుంటూరు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పేదలందరికీ సొంత ఇంటి కలను 2029 నాటికి సాకారం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇది ఎన్నికలకు ముందు ఎన్‌డీఏ కూటమి పేదలకు ఇచ్చిన హామీ అని, దానిని తప్పక నిలబెట్టుకొంటామని చెప్పారు. ఆదివారం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెం గ్రామం నుంచి పీఎంఏవై-జీ 2.0 కార్యక్రమానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలసి సీఎం శ్రీకారం చుట్టారు. ఈ పైలట్ ప్రాజెక్టుకు సంబంధించి సీఎ్‌సఐఆర్(కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్)-సీబీఆర్‌ఐ(సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) రూర్‌కీతో ఒప్పందం చేసుకొని పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం ప్రథమ లబ్ధిదారు తుపాకుల లక్ష్మీదుర్గకు ఇంటి మంజూరు పత్రం అందజేశారు. ఆమె కుటుంబానికి నూతన వస్త్రాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ 2.0 కింద కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రాష్ట్రానికి 75 వేల ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. అవి ఏమాత్రం సరిపోవు. తొలి విడతగా 3 లక్షల ఇళ్లు కావాలని అడగగానే కేంద్ర ప్రభుత్వం వెంటనే మం జూరు చేసింది.
మరో 6లక్షల ఇళ్లు కావాలని కోరాం. అందుకు కూడా సమ్మతించింది. దాంతో రెండు, మూడు విడతల్లో 3 లక్షల చొప్పున ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పేదలందరికీ ఇస్తాం. దేశంలోనే మొదటిసారి త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో తక్కువ వ్యవధిలోనే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నాం.
పైలట్ ప్రాజెక్టుగా బుర్రిపాలెం, ఓబులునాయుడుపాలెంలో 177 ఇళ్ల నిర్మాణం చేస్తాం. ఆ తర్వాత రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో మరో ఐదు వేల ఇళ్లను 3డీసీపీ టెక్నాలజీతో పూర్తి చేస్తాం. దాంతో ఇదొక జాతీయ విధానంగా మారుతుంది. ఇది పేద కుటుంబాల సొంత ఇంటి కల సాకారానికి వేస్తున్న కీలక అడుగు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు విధ్వంసకరమైన రాష్ట్రాన్ని బా గు చేస్తామని చెప్పి ఓటేయాలని కోరాం. ప్రజలు 57 శాతం మంది ఓట్లు వేసి 94 శాతం సీట్లు గెలిపించారు. ప్రజలందరికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన చేస్తున్నాం’ అని సీఎం చెప్పారు. 3 డీసీపీ టెక్నాలజీ ఇళ్లల్లో హాయిగా..
‘3డీసీపీ టెక్నాలజీతో నిర్మించే ఇళ్లల్లో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. బయటికి, లోపలికి మధ్యన 8 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. లోపలికి వేడి, తేమ రాదు. బయట జోరున వర్షం కురుస్తున్నా లోపలికి నీటి బొట్టు కూడా ప్రవేశించలేదు. 3 నెలల్లోనే వీటి నిర్మాణాలు పూర్తి అవుతాయి. భవన నిర్మాణ కూలీలతో అంతగా పని కూడా ఉండదు. 60 వేల కుటుంబాలకు రూ.కోటి విలువ చేసే ఇంటి జాగాలు ఇచ్చాం. విశాఖపట్టణం, విజయవాడ, మంగళగిరిలో ఏళ్ల తరబడి ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలను అందజేశాం. వాటి విలువ రూ.52 వేల కోట్లు. ఒక్కో కుటుంబానికి దాదాపు రూ.కోటి విలువ చేసే ఇంటి పట్టాను నయా పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం’ అని అన్నారు.
మార్చి నాటికి భూవివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ
‘వందల ఏళ్ల నాటి భూసమస్యలకు పరిష్కారం తీసుకొస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం ప్రతీ గ్రామం, ఇంట్లో భూవివాదాలను సృష్టించింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్టును తీసుకొచ్చింది. ఇళ్ల పట్టాలపై గొడ్డలిపార్టీ నాయకుడు తన ఫొటోను ముద్రించుకొన్నాడు. వాటన్నింటిని రద్దు చేశాం. రాజ ముద్రతో ఇళ్ల పట్టాలు, పట్టాదారు పాసుపుస్తకాలను సులభతరంగా పొందేలా చేస్తున్నాం. వచ్చే మార్చి నాటికి భూవివాదాలు లేని రాష్ట్రంగా చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాం’అని సీఎం అన్నారు.
2019-24లో అన్నింటా విధ్వంసమే
‘2014-19 మధ్య కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన ఇళ్లల్లో 6 లక్షల పక్కా ఇళ్లను వైసీపీ ప్రభుత్వంలో రద్దు చేయించారు. ఇళ్ల పట్టాల పేరుతో పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారు. వాళ్లు ఇచ్చిన పట్టాలు ఇళ్లు నిర్మించుకోలేని ప్రాంతాల్లో ఉన్నాయి. వారిలో 4 లక్షల మంది పేదలు తమకు వద్దని తిరిగి ఇచ్చేస్తున్నారు. రద్దు చేయించిన 6 లక్షల ఇళ్లను మళ్లీ మంజూరు చేయించి పూర్తి చేసేందుకు అడుగులు వేస్తున్నాం’ అని చెప్పారు. ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశాం. పింఛన్ల ద్వారా ఇప్పటికే రూ.76 వేల కోట్లు ఖర్చు చేశాం. దీపం పథకం ద్వారా ఏటా 3 గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవతో రైతులకు రూ.20 వేల ఆర్థికసాయం, స్త్రీశక్తితో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, తల్లికి వందనం పథకం ద్వారా ప్రతీ విద్యార్థికి రూ.15 వేల నగదును ఏటా అందిస్తున్నాం. ఇది మా నిబద్ధతకు నిదర్శనం. రాయలసీమలో రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నాం. రిలయన్స్ వంటి సంస్థ వచ్చి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌ను ఏర్పాటు చేయబోతున్నది. పట్టిసీమను ప్రారంభించి కృష్ణా డెల్టాను కాపాడాం.
ఈ ఏడాది ఎల్‌నినో పరిస్థితుల్లోనూ 60 టీఎంసీల గోదావరి జలాలను ఇక్కడికి తరలించాం. వచ్చే మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తాం. ఈ ప్రాంతానికి పుష్కలంగా నీరు అందుతుంది. భవిష్యత్తులో నీటి సమస్యే రాదు’ అని అన్నారు
అమరావతితో మెగా సిటీ
‘అమరావతిని ఒక మెగా సిటీగా అభివృద్ధి చేస్తున్నాం. అమరావతిలో విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి కలిసి ఒక మెగా సిటీగా ఉంటాయి. ఇది దేవతల, ప్రజా రాజధాని. ప్రపంచం మెచ్చుకునే స్థాయిలో అభివృద్ధి చేస్తాం. ఫిబ్రవరి 3వ తేదీన క్వాంటం వ్యాలీ చలామణిలోకి వస్తుంది’ అని అన్నారు.
శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీకీ మామ
‘మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను అక్కడ అంతా మామ అని ముద్దుగా పిలుచుకొంటారు. ఆయన ఎంపీకే కాదు ఏపీకి కూడా మామనే. ఎంపీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచే నేత చౌహాన్. తన హయాం లో నర్మద, షిప్రా, పార్వతి వంటి అనేక నదులను అనుసంధానం చేసి 16లక్షల ఎకరాలకు సాగునీరందించారు. ప్రజా సమస్యలపై పోరాడి వాటిని పరిష్కరించారు. అందుకే ఆయన్ను ప్రజలు గెలిపిస్తున్నారు. 1.30 లక్షల కోట్లు ఖర్చు చేసి ప్రతి గ్రామాన్నీ ఆదర్శ ప్రాయంగా చేశారు’ అని చంద్రబాబు ప్రశంసించారు.
బుర్రిపాలెం పొలిటికల్ హీరో పెమ్మసాని
‘బుర్రిపాలెం అనగానే మనందరికి గుర్తుకొచ్చేది దివంగత సినీ హీరో సూపర్‌స్టార్ కృష్ణ. తేనెమనసులు సినిమాతో వచ్చి తిరుగులేని హీరోగా ఎదిగారు. ఇప్పు డు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పొలిటికల్ హీరోగా ఎదుగుతున్నారు. ఎన్నికలకు ముం దు అమెరికా నుంచి వచ్చారు. ప్రజలతో అల్లుకుపోగలరా అన్న అనుమానం ఉండేది. ఈ రోజున అందరితో మమేకమై దూసుకెళుతున్నారు’ అని ప్రశంసించారు.
లక్షలాది పేదలకు జగన్ అన్యాయం
పెమ్మసాని చంద్రశేఖర్
‘2014కి ముందు సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి 17 లక్షల ఇళ్లను మంజూరు చేయించారు. వాటికి రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల వాటాలను జోడించి టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వాటి వల్ల సీఎం చంద్రబాబుకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న దురాలోచనతో ఆ తర్వాతి ముఖ్యమంత్రి జగన్ వారికి తీరని అన్యాయం చేశారు. అర్బన్‌లో ఉండే ప్రజలను తీసుకెళ్లి 15 కిలోమీటర్ల దూరంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అవి నివాసానికి ఏమాత్రం యోగ్యం కానివి. టిడ్కోలో ఏవైతే పెండింగ్‌లో ఉన్నాయో అవన్నీ పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తాం. చంద్రబాబు, శివరాజ్ సింగ్ చౌహాన్‌ల ఇద్దరి భావసారూప్యం ఒక్కటే. ఇద్దరిలో ప్రవహించేది ప్రజాసేవే. అందుకే నాలుగు సార్లు సీఎంలుగా ప్రజలు వారిని ఎన్నుకొన్నారు’ అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
ఏ టెక్నాలజీ అయినా ఏపీ నుంచే
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
‘దేశంలో ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా అందుకు ఏపీ చిరునామాగా ఉంటోంది. గతంలో షియర్‌వాల్ టెక్నాలజీతో, ఇప్పుడు త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్‌తో ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. దేశంలో అందరికీ అవసరమైన కూడు, గూడు, వస్త్రం, వైద్యం, విద్య వంటివన్ని అందే వ్యవస్థను ప్రధానమంత్రి మోదీ తీసుకొచ్చారు. ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మద్దతు పలకాలి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కోరారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథి, రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ,ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్,ఎమ్మెల్యేలు రామాంజనేయులు, శ్రావణ్‌కుమార్, నసీర్ అహ్మద్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్యబాబు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రకృతి సాగులో ఏపీ నంబర్ వన్.. సీఎం చంద్రబాబుకు శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రశంసలు
ఫిబ్రవరి 3న అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు