మొత్తం ఓట్లు 65.. చెల్లనివి 63
ABN , Publish Date - Nov 08 , 2026 | 05:15 AM
ఏలూరు జిల్లా కైకలూరు మండలంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పెద్దఎత్తున మురిగిపోవడం చర్చనీయాంశంగా మారింది. మండలంలో 65 పోస్టల్ బ్యాలెట్లకుగాను 63 ఓట్లు చెల్లుబాటు కాలేదు.
కైకలూరు మండలంలో మురిగిపోయిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
కైకలూరు, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా కైకలూరు మండలంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పెద్దఎత్తున మురిగిపోవడం చర్చనీయాంశంగా మారింది. మండలంలో 65 పోస్టల్ బ్యాలెట్లకుగాను 63 ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ముందుగానే పోస్టల్ బ్యాలెట్‌పై శిక్షణ ఇస్తారు. పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు 5 కవర్లు ఇస్తారు. వీటిలో నాలుగు చిన్నవి, ఒకటి పెద్దది ఉంటుంది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు వేసిన ఓట్లు, ఫారం-13బీ, 13సీ, 13డీ చిన్న కవర్లలో పెట్టి సీలు వేయాలి. గెజిటెడ్ అధికారి సంతకంతో ఉన్న డిక్లరేషన్ ఫామ్‌ను, ఆ చిన్న కవర్లను పెద్ద కవర్‌లో పెట్టి సీల్ చేయాలి. పోస్టల్ బ్యాలెట్లు లెక్కించేటపుడు మొదట డిక్లరేషన్ ఫామ్ కనిపించాలి. లేదంటే వాటిని చెల్లని ఓట్లుగా పరిగణిస్తారు. కైకలూరు మండలంలోని 63 మంది ఉద్యోగులు డిక్లరేషన్ ఫామ్‌ను ఓట్లతో పాటు చిన్న కవర్‌లోనే పెట్టి సీల్ చేశారు. దీంతో పెద్దకవర్ సీల్ తెరిచిన వెంటనే డిక్లరేషన్ ఫామ్ కనిపించకపోవడంతో నిబంధనల ప్రకారం వాటిని చెల్లని ఓట్లుగా పరిగణించారు. కేవలం ఇద్దరు ఉద్యోగులు మాత్రమే నిబంధనలు పాటించడంతో ఆ రెండు ఓట్లే చెల్లుబాటు అయ్యాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..