సిరులు కురిపిస్తున్న ఎర్రచందనం
ABN , Publish Date - Nov 18 , 2026 | 01:58 AM
ఎర్ర చందనం.. మన దేశంలోనే అత్యంత అరుదైన వృక్ష సంపద. ఈ కలపకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది.
అమ్మకానికి సిద్ధంగా 5359 టన్నులు
చైనా, జపాన్ దేశాల్లో మంచి ఆదరణ
ఇతర దేశాల్లోనూ మన ఎర్రచందనానికి డిమాండ్
తిరుపతి(టీటీడీ), నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ఎర్ర చందనం.. మన దేశంలోనే అత్యంత అరుదైన వృక్ష సంపద. ఈ కలపకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అరుదుగా లభించే.. అధిక ధరకు అమ్ముడయ్యే ఎర్రచందనం చెట్ల సంరక్షణకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు చర్యలు చేపట్టింది. వైసీపీ హయాంలో ఎర్రచందనం చెట్లను అడ్డగోలుగా నేలమట్టం చేసి నిబంధనలు అతిక్రమించి అక్రమ మార్గంలో విదేశాలకు తరలించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అక్రమ రవాణాకు కళ్లెం వేసింది. మరోవైపు గత కొన్నేళ్లుగా అక్రమార్కుల నుంచి పట్టుకున్న ఎర్రచందనం లాగ్స్ 5359.433 టన్నులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. దీని అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరనుంది.
విదేశాల్లో భారీ డిమాండ్
మన ఎర్రచందనం దుంగలకు ప్రపంచం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎర్ర చందనాన్ని అధికంగా ఇష్టపడి, దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. అక్కడ విలాసవంతమైన ఫర్నీచర్, హోదాకు చిహ్నంగా నిలిచే కళాఖండాలను తయారు చేసేందుకు వీటిని వినియోగిస్తారు. జపాన్‌లోనూ ఎర్రచందనానికి మార్కెట్ ఉంది. ఇక్కడ సంప్రదాయ సంగీత వాయిద్యమైన షామిసెస్, ప్రత్యేక కళాఖండాల తయారీకి ఉపయోగిస్తారు.
అమెరికా, యూరప్ దేశాల్లో ఔషధాలు, కాస్మెటిక్స్, సుగంధ ద్రవ్యాలు, సంగీత వాయిద్యాల తయారీలో ఎర్రచందనం వినియోగిస్తున్నారు. యూఏఈలో ఫెర్‌ఫ్యూమ్స్, అగరబత్తీల తయారీలో ఉపయోగిస్తుంటారు. మయన్మార్, దక్షిణ కొరియాల్లోనూ దీనికి మంచి డిమాండ్ ఉంది. గ్రేడింగ్ ఆధారంగా దుంగలను కొనుగోలు చేస్తుంటారు. సంగీత వాయిద్యాలు, విలాసవంతమైన కళాఖండాలకు ‘ఎ’ గ్రేడ్ దుంగలను ఉపయోగిస్తారు. చెక్క బొమ్మలు, పూజా సామాగ్రి, సాధారణ ఫర్నీచర్‌కు ‘బి’ గ్రేడ్, అగరబత్తీలు, ఔషధాలకు ‘సి’ గ్రేడ్ వాడుతుంటారు.
విక్రయానికి సిద్ధంగా దుంగలు
ప్రస్తుతం అటవీ శాఖ అధికారుల వద్ద 5359.433 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలు గోడౌన్లలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ‘ఎ’, ‘బి’, ‘సి’ గ్రేడ్‌లకు చెందిన దుంగలు సుమారు 4816.11 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. రానున్న రోజుల్లో వీటిని అంతర్జాతీయ స్థాయిలో టెండర్ల ద్వారా విక్రయించనున్నారు.
వీటి ద్వారా ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం లభించే ఆస్కారం ఉంది. మంచి గ్రేడ్ ఉన్న దుంగ టన్ను రూ.1 కోటి వరకు పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు దీనికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గోడౌన్లలో ఉన్న దుంగలకు మంచి ధర వచ్చే ఆస్కారం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు