Year Ender 2025: గులాబీ బాస్‌కు 'గండాల' ఏడాది.. కారుకు అన్నీ ప్రమాదాలే!
ABN , Publish Date - Dec 31 , 2025 | 05:48 PM
గులాబీ బాస్‌కు ఈ ఏడాది ఏమాత్రం కలిసిరాలేదనేది రాజకీయ విశ్లేషకుల మాట. పార్టీలో అంతర్గత కలహాలు, ఇటు కుటుంబంలో వ్యతిరేక స్వరాలు వినిపించాయి. దీంతో ఏడాది కేసీఆర్‌కు గండాల ఏడాదిగా గడిచిందని చెప్పొచ్చు.
తెలంగాణలో రాజకీయ రారాజుగా దశాబ్ద కాలం పాటు ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు 2025 సంవత్సరం మాత్రం కష్టకాలం అనే చెప్పుకోవాలి. అటు పార్టీలో అంతర్గత కలహాలు, ఇటు కుటుంబంలో వ్యతిరేకతలు, మరోవైపు ఎన్నికల పరాజయాలు.. మొత్తానికి ఇవన్నీ కేసీఆర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయిందనేది ఏడాదిగా విశ్లేషకులు చెబుతున్న మాట.
ఫామ్ హౌస్ నుంచి నందినగర్ వరకు..
ఈ ఏడాది పొడవునా కేసీఆర్ ఎక్కువగా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. పార్టీ పగ్గాలు కేటీఆర్, హరీష్ రావు చేతుల్లో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కేసీఆర్ చరిష్మా అవసరమని కార్యకర్తలు కోరుకున్నారు. చివరికి డిసెంబర్ నెలలో నందినగర్ నివాసానికి చేరుకున్న ఆయన, మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారన్న సంకేతాలిచ్చారు. కానీ, అప్పటికే జరగాల్సిన, ఊహించని రీతిలో నష్టం జరిగిపోయింది. మాగంటి గోపీనాథ్ మృతితో వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్‌ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే, ఈ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ దూరంగా ఉండటం పెద్ద ఎత్తునే చర్చనీయాంశమైంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ప్రచారం చేయగా, కేసీఆర్ రాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గిపోయింది. ఫలితంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేతిలో 24,658 ఓట్ల భారీ మెజారిటీతో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓడిపోయారు. కేసీఆర్ ప్రచారానికి రాకపోవడమే ఈ ఘోర ఓటమికి, హ్యాట్రిక్ స్థానాన్ని చేజేతులారా పోగొట్టుకోవడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.
కవిత రూపంలో ఊహించని షాక్..
ఈ ఏడాది కేసీఆర్‌కు తగిలిన అతిపెద్ద దెబ్బ సొంత కుమార్తె కవిత రూపంలోనే వచ్చింది. బీఆర్‌ఎస్‌కు కవిత రెబల్‌గా మారడం చర్చనీయాంశంగా మారింది. చివరకు పార్టీలో అంతర్గత వ్యవహారాలపై బహిర్గతంగానే అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆమె పార్టీ నుంచి సస్పెండ్ అవ్వక తప్పలేదు. అయితే కవిత మాత్రం తెలంగాణ జాగృతిని యాక్టివ్ చేయడం.. జనం బాట అంటూ జిల్లాల బాట పట్టడం గులాబీ నేతలకు మింగుపడని విషయం. ఎక్కడికి వెళ్లినా స్థానిక ఎమ్మెల్యే లేదా మాజీ ఎమ్మెల్యే అవినీతి చరిత్రను బయటికి తీస్తూ ఆ పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు కవిత. కవిత టార్గెట్ ఎవరైనా, ఆ దెబ్బ మాత్రం కేసీఆర్ పరువు ప్రతిష్టపైనే పడిందని చెప్పుకోవచ్చు.
ఫిరాయింపుల నుంచి మూడు నిమిషాల ముచ్చట వరకూ!
బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు వరుసగా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసి కాంగ్రెస్ గూటికి చేరడం కూడా బీఆర్‌ఎస్‌కు పెద్ద షాక్. 10 మంది ఎమ్మెల్యేలలో ఈ ఏడాదే నలుగురు పార్టీ మారారు. వీరిపై అనర్హత వేటు వేయాలని కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక డిసెంబర్ చివరిలో నీటి వాటాలపై నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కేసీఆర్ తన హవా చూపించారు. ‘నీళ్లు- నిధులు- నియామకాలు’ నినాదంతో రెండో పోరాటం చేస్తామని ప్రకటించడం ద్వారా కేసీఆర్ తన రాజకీయ మనుగడ కోసం సిద్ధమవుతున్నట్లు కనిపించింది. ఇక డిసెంబర్ 29న ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యారు. కానీ కేవలం మూడంటే మూడు నిమిషాలు మాత్రమే ఉండి, అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేసి అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు కేసీఆర్.
మొత్తానికి చూస్తే.. 2025 సంవత్సరం కేసీఆర్‌కు కుటుంబం, పార్టీ పరంగా ఒక పీడకలగా మిగిలిపోయింది. కానీ 2026లో ఆయన ఏ విధంగా, ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతారో చూడాలి.