Year Ender 2025: ఈ ఏడాది దేశ రాజకీయాల్లో చోటుచేసుకున్న కీలక పరిణామాలు ఇవే..
ABN , Publish Date - Dec 24 , 2025 | 04:47 PM
ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దేశ రాజకీయాల్లో ఆసక్తికరమైన సంఘటనలు చాలా జరిగాయి. పొత్తులు, ఎన్నికలు, పార్లమెంటరీ డిబేట్లు, పాలసీ విధానాలు పాలిటిక్స్‌ను రోలర్ కోస్టర్ రైడ్‌లోకి తీసుకెళ్లాయి.
ప్రపంచ రాజకీయాలు ఒక ఎత్తయితే.. భారత దేశ రాజకీయాలు మరో ఎత్తు. దేశ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరమూ చెప్పలేము. ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దేశ రాజకీయాల్లో ఆసక్తికరమైన సంఘటనలు చాలా జరిగాయి. పొత్తులు, ఎన్నికలు, పార్లమెంటరీ డిబేట్లు, పాలసీ విధానాలు పాలిటిక్స్‌ను రోలర్ కోస్టర్ రైడ్‌లోకి తీసుకెళ్లాయి. 2025లో దేశ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన సంఘటనలు ఏం జరిగాయో ఓ లుక్కేద్దాం.
ఢిల్లీ ఎన్నికలు.. బీజేపీ ఘనం విజయం
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత భారతీయ జనతా పార్టీ మళ్లీ దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. బీజేపీ విజయం ఢిల్లీ రాజకీయాలనే పూర్తిగా మార్చేసింది. మొత్తానికి దేశ రాజధానిలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీకి సీఎంగా ఓ మహిళను నియమించటం బీజేపీకి ప్లస్ అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వివాదాల ‘సార్’
ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) తీసుకొచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సార్) వివాదాలకు దారి తీసింది. ప్రతి పక్ష పార్టీలు నిరసనలకు దిగాయి. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సార్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో కూడా సార్ ప్రధాన చర్చనీయాంశంగా మారిపోయింది.
కీలక బిల్లుల ఆమోదం
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో ‘వీబీ జీ రామ్ జీ’ పేరుతో తీసుకువచ్చిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుతో పాటు అణు ఇంధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానించేందుకు ఉద్దేశించిన శాంతి బిల్లు, బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 100 శాతానికి పెంచే బీమా సవరణ బిల్లు (సబ్ కా బీమా సబ్ కా రక్ష)ను, మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(రెండవ సవరణ)బిల్లు 2025లకు లోక్ సభ ఆమోదం తెలిపింది.
బిహార్ ఎన్నికలు
బిహార్ రాజకీయాలకు దేశ రాజకీయాల్లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. 2025 నవంబర్ నెలలో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఎన్డీఏ కూటమి, మహాగఠ్‌బంధన్‌ల మధ్య పోరు భీకరంగా సాగింది. అయినా కూడా వార్ వన్ సైడ్ అయింది. ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించింది. బిహార్ శాసనసభలో 243 స్థానాలు ఉండగా.. మెజారిటీకి 122 సీట్లు అవసరం. 243 స్థానాలకు గానూ ఎన్‌డీఏ కూటమి 202 సీట్లు గెలిచింది. తేజస్వి సారథ్యంలోని మహాగఠ్‌బంధన్ కేవలం 35 సీట్లకే పరిమితం అయింది.
థాక్రే సోదరుల అపూర్వ కలయిక..
థాక్రే సోదరులు రాజ్ థాక్రే, ఉద్ధవ్ థాక్రేలు 20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కనిపించారు. తమ గొడవల్ని పక్కన పెట్టి కలిసిపోయారు. ఈ అపూర్వ కలయికకు గత జులై నెలలో జరిగిన ‘మెగా విక్టరీ’ ర్యాలీ వేదికైంది. ఇద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. మూడు భాషల విధానం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివ సేన (యూబీటీ), మహారాష్ట్ర నవ్ నిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్)లు కలిసి ‘మెగా విక్టరీ’ ర్యాలీ నిర్వహించాయి. ఈ విజయోత్సవ ర్యాలీలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో థాక్రే సోదరులు పాల్గొన్నారు.
ఓట్ చోరీ ఆరోపణలు
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ‘ఓట్ చోరీ’ ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టింది. ప్రచారంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఓటర్ల పేర్లను నకిలీ లాగిన్‌ల సాయంతో తొలగించారని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ 'ఓట్ల దొంగలను' రక్షిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని పేర్లను డిలీట్ చేశారని అన్నారు. మహిళలు, దళితులు, ఆదివాసీల ఓట్లను దొంగిలించారని చెప్పారు.
ఆపరేషన్ సిందూర్‌పై మోదీ ప్రసంగాలు
ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ లోయలో ముగ్గురు ఉగ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు. 26 మంది అమాయక పర్యాటకుల్ని కాల్చి చంపేశారు. ఉగ్రవాదులకు, వారిని సపోర్టు చేస్తున్న పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత వైమానిక దళం మే 7వ తేదీన పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. 100 మంది దాకా ఉగ్రవాదులు చనిపోయారు. ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్, లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగపూరిత ప్రసంగాలు చేశారు.
ఇవి కూడా చదవండి
రూ.12,015 కోట్లతో ఢిల్లీ మెట్రో విస్తరణ.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
నష్టాలతో ముగిసిన సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..