ఊరు సమస్యపై పండగ రోజు గ్రామస్తుల వినూత్న నిరసన..

ABN, Publish Date - Jan 16 , 2025 | 01:23 PM

పండగంటే ఊరంతా సందడి వాతావరణం. పండుగ శుభాకాంక్షల ఫ్లెక్సీలతో గ్రామమంతా నిండిపోతుంది. కానీ అక్కడి గ్రామ ప్రజలు మాత్రం ఈ పండుగకు ఊరి సమస్యను అందరికీ తెలిసేలా ఫ్లెక్సీ ఏర్పాటుచేసి.. తమ సమస్యకు పరిష్కారం కావాలంటూ గళమెత్తారు.

పండగంటే ఊరంతా సందడి వాతావరణం. పండుగ శుభాకాంక్షల ఫ్లెక్సీలతో గ్రామమంతా నిండిపోతుంది. కానీ అక్కడి గ్రామ ప్రజలు మాత్రం ఈ పండుగకు ఊరి సమస్యను అందరికీ తెలిసేలా ఫ్లెక్సీ ఏర్పాటుచేసి.. తమ సమస్యకు పరిష్కారం కావాలంటూ గళమెత్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామస్తులు వినూత్నంగా ఆలోచించారు. గ్రామానికి సంబంధించిన డంపింగ్ యార్డ్ సమస్యను ప్రతి ఒక్కరికీ తెలిసేలా గాంధీ బొమ్మ సెంటర్‌లో ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. మండలంలోనే అతిపెద్ద గ్రామమైన అంగరలో డంపింగ్ యార్డు లేకపోవడంతో అక్కడి ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారో తెలియజేస్తూ ఈ ప్లెక్సీ కట్టారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ అందరిదృష్టిని ఆకర్షిస్తోంది.


అంగర, పడమర కండ్రిక గ్రామాలు రెండు మేజర్ పంచాయతీలు. ఈ రెండు వేర్వేరు పంచాయతీలైనా కలిసే ఉంటాయి. గ్రామంలో డంపింగ్‌ యార్డు లేకపోవడంతో ఈ రెండు పంచాయతీల పరిధిలో రోజువారి సేకరించిన చెత్తను హైస్కూల్ పక్కనే వేసి, నిప్పంటిస్తున్నారు. దీంతో చెత్తను అంటించడం ద్వారా వచ్చే పొగతో విద్యార్థులు, రైతులు ఎంతో ఇబ్బందిపడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


చెత్తను వేసి నిప్పంటించే స్థలానికి సమీపంలోనే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డంపింగ్ యార్డు లేకపోవడంతో ప్రజలు పడే బాధలు అందరికీ తెలిసేలా ఈ ఫ్లెక్సీ ఏర్పాటుచేశామని గ్రామ అభివృద్ధిని ఆకాంక్షించేవారు తెలిపారు. ఇలా చేయడం ద్వారా గ్రామంలో ఓ చర్చ జరుగుతుందని, తద్వారా గ్రామ ప్రజలే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనకు వచ్చి అభివృద్ధిపథంలో నడిపించుకుంటారనే ఆకాంక్షతోనే వినూత్న నిరసన చేపట్టినట్లు గ్రామస్తులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated at - Jan 16 , 2025 | 02:14 PM