Share News

Regional Ring Road: 2-3 నెలల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ పనులు

ABN , Publish Date - Aug 08 , 2025 | 04:28 AM

రీజినల్‌ రింగ్‌ రోడ్డు తెలంగాణకు మణిహారమని.. రెండు మూడు నెలల్లో పనులు ప్రారంభించాలనే చిత్తశుద్థితో ఉన్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Regional Ring Road: 2-3 నెలల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ పనులు

  • ఆరు లేన్లుగా అప్‌గ్రేడ్‌ చేయడం వల్లే ఆలస్యం

  • నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకే టాస్క్‌ఫోర్స్‌ కమిటీ

  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

  • కలెక్టర్లు, ఎస్పీలను కూడా కేటీఆర్‌ తిడుతున్నారు

  • మేం డైరీ రాస్తే పదేళ్లలో ఎన్నో పేర్లు రాయాల్సి ఉండేది

  • వచ్చే వారం హ్యామ్‌రోడ్ల టెండర్లు

  • మీడియాతో ఇష్టాగోష్ఠిలో వెల్లడి

హైదరాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగ్‌ రోడ్డు తెలంగాణకు మణిహారమని.. రెండు మూడు నెలల్లో పనులు ప్రారంభించాలనే చిత్తశుద్థితో ఉన్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం భూసేకరణ దాదాపు పూర్తి అయిందని, 6 లేన్లుగా అప్‌గ్రేడ్‌ చేయటంతోనే పనులు ఆలస్యం అయ్యాయని ఆయన వివరించారు. సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా ఉన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. భూ పరిహారం చెల్లింపు ప్రక్రియ వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు ఎన్‌హెచ్‌ఏఐ, ఎంవోఆర్‌టీహెచ్‌ ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేసేందుకు టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేసుకున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సరైన ప్రణాళికలతో వెళ్లేందుకు.. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు.. ఈ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చైర్మన్‌గా, స్పెషల్‌ సీఎస్‌, సీసీఎల్‌ఏ కమిషనర్‌, విద్యుత్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, నీటిపారుదల, పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ, మైనింగ్‌, పీసీసీఎఫ్‌, ఎన్‌హెచ్‌ఏఐ, ఎంవోఆర్‌టీహెచ్‌, ఆర్‌ అండ్‌ బీ ఎన్‌హెచ్‌ చీఫ్‌ ఇంజినీరు సభ్యులుగా ఏర్పాటైన ఈ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ గురువారం సెక్రటేరియట్‌లో సమావేశమై పలు అంశాలపై చర్చించింది.


నీటిపారుదలశాఖకు సంబంధించి.. వరంగల్‌-ఖమ్మం సెక్షన్‌లో ఎన్‌హెచ్‌-153జీ పరిధిలోని ప్యాకేజీ 2లో చెరువుల అంశాన్ని ఎన్‌హెచ్‌ అధికారులు మంత్రికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపంలో వివరించారు. మహబూబాబాద్‌, నెల్లికుదురు ప్రాంతంలో చెరువుల సమస్యలు, దాంతో పాటు హై లెవల్‌ బ్రిడ్జి ప్రతిపాదనల గురించి వివరించారు. ఎన్‌హెచ్‌-30 సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు రోడ్డుతో పాటు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే రోడ్డుకు సంబంధించి పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనికి ఆయన.. ఇరిగేషన్‌ శాఖ నుంచి ఇబ్బందులేవైనా ఉంటే సంబంధిత మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

  • 12 ఎన్‌హెచ్‌ ప్రాజెక్టులకుగాను.. 6 ప్రాజెక్టులు అటవీ శాఖ అనుమతులులేక పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు మంత్రికి తెలపగా.. ఆ అనుమతుల కోసం అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. కల్వకుర్తి-శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌కు కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా ఉన్నారని, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేస్తే గొప్ప ప్రాజెక్టు పూర్తి చేసిన వారమవుతామన్నారు.

  • విద్యుత్‌శాఖకు సంబంధించి 220కేవీ, 400కేవీ లైన్‌ సమస్యలతోపాటు, 33కేవీ, 11కేవీ లైన్‌ షిఫ్టింగ్‌ సమస్యలున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. దీనికి ఆయన.. ఏయే ప్రాంతాల్లో ఏ సమస్య ఉందో వివరాలు ఇవ్వాలని అడిగారు. సమస్యలను పరిష్కరించే బాఽధ్యతను విద్యుత్‌ శాఖ అధికారి ముషారఫ్‌ ఆలీకి అప్పగించారు.

  • గనులశాఖ నుండి కొన్ని అనుమతులు రావాల్సి ఉందని అధికారులు తెలపగా.. ఆ పనులు వెంటనే పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని సంబంధిత అధికారి శ్రీధర్‌కు మంత్రి సూచించారు. ప్రధానంగా భూసేకరణలో రెవెన్యూశాఖకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా ఉన్నాయని.. వాటిని వెంటనే పరిష్కరించేందుకు సీసీఎల్‌ఏ కమిషనర్‌ లోకే్‌షకుమార్‌ కృషి చేయాలన్నారు. కొన్నిచోట్ల సున్నిత అంశాలు ఉంటాయని వాటి పట్ల మానవతా దృక్పథంతో మెలగాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన మంత్రి.. ఇక నుండి తరచుగా సమావేశాలు నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామన్నారు. 18న మరోమారు భేటీ అవుదామని, ఆ సమావేశానికి జిల్లా కలెక్టర్లు హాజరు అయ్యేలా చూడాలని సూచించారు. అన్నిశాఖల అధికారులూ సమన్వయంతో పనిచేస్తేనే టాస్క్‌ఫోర్స్‌ బాగా పనిచేసినట్టు అవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. తమకు రాజకీయాల కంటే రాష్ట్రాభివృద్దే ముఖ్యమన్న ఆయన.. రాష్ట్ర ప్రాజెక్టుల క్లియరెన్స్‌ కోసం త్వరలో ప్రధాని మోడీని కలుస్తామని వెల్లడించారు.


కలెక్టర్లు, ఎస్పీలనూ కేటీఆర్‌ తిడుతున్నారు

  • మేం డైరీ రాయాలంటే గత పదేళ్లలో ఎన్నో పేర్లు రాసుకోవాల్సి ఉండేది: కోమటిరెడ్డి

‘‘కలెక్టర్లను, ఎస్పీలను సైతం కేటీఆర్‌ తిడుతున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 20 నెలలకే.. ‘డైరీలో రాసుకుంటున్నాం’ అంటున్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో మా కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడ్డారు. మేము డైరీలు రాయాలంటే ఎన్నో పేర్లు రాసుకోవాల్సి ఉండేది’’ అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. కానీ, తామెప్పుడూ అలా చేయలేదన్నారు. టాస్క్‌ఫోర్స్‌ కమిటీ భేటీ అనంతరం సచివాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. గత పాలనలో పదేళ్ల పాటు జరిగిన అవినీతిపై కమిషన్ల ద్వారా విచారణ చేయిస్తున్నామని.. హ్యామ్‌ రోడ్ల పనులకు సంబంధించి 12న కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహిస్తున్నామని, వచ్చే వారం హ్యామ్‌రోడ్లకు టెండర్లు పిలుస్తున్నామని తెలిపారు. తొలిదశలో రూ.6వేల కోట్లతో మూడేళ్లలో మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధిపై కేంద్ర మంత్రి గడ్కరితో సమావేశం జరిగిందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి ఈ నెలలో క్యాబినెట్‌లో ఆమోదం లభిస్తుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు. విజయవాడకు ఫ్యూచర్‌ సిటీ నుంచి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే మంజూరు చేస్తారన్నారు. అలాగే.. బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో చేసిన ధర్నా విజయవంతమైందన్నారు. రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలపై విలేకరులు ప్రశ్నించినప్పుడు ఆయన మౌనం వహించారు. బీఆర్‌ఎస్‌ నేత జగదీష్‌ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి తనది కాదన్న కోమటిరెడ్డి.. ఉమ్మడి నల్గొండజిల్లా అభివృద్ధే తన లక్ష్యమన్నారు. సినీ కార్మికుల వేతనాలు, ఇతర సమస్యలపై శుక్రవారం చర్చిస్తామన్నారు.

Updated Date - Aug 08 , 2025 | 04:28 AM