Khammam: నా చావుకు డ్యాన్స్ మాస్టర్ అభినే కారణం..
ABN , Publish Date - Mar 02 , 2025 | 04:00 AM
‘నా చావుకు కారణం అభి (డ్యాన్స్ మాస్టర్).. ఐదేళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇంకో అమ్మాయిని తీసుకువచ్చి ఆమెనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు.
సెల్ఫీ వీడియో వాట్సాప్ స్టేట్‌సలో పెట్టి మహిళ ఆత్మహత్య..
ఖమ్మం రూరల్, మార్చి 1 (ఆంద్రజ్యోతి): ‘నా చావుకు కారణం అభి (డ్యాన్స్ మాస్టర్).. ఐదేళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇంకో అమ్మాయిని తీసుకువచ్చి ఆమెనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అందుకే ఉరేసుకుని చనిపోతున్నాను’ అని ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసుకొని వాట్సా్‌పలో స్టేటస్ పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లా రూరల్ మండలం పొన్నెకల్లులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖమ్మంలోని బ్యాంకు కాలనీకి చెందిన మంగళగిరి శ్రీనివా్‌సరావు కుమార్తె శ్రీకల్యాణి కావ్య (32) ఖమ్మంలోని ఓ హోటల్‌లో ఉద్యోగం చేస్తోంది. అయితే స్థానికంగా ఉంటూ హైదరాబాద్‌లో ఓ టీవీ చానల్ డ్యాన్స్ షోలో డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసే అభిలా్‌షతో ఐదేళ్ల క్రితం ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మారింది.
అయితే కొన్ని నెలలుగా అభిలాష్ శ్రీకల్యాణిని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం ఆమెకు ఫోన్ చేసిన అభిలాష్.. తన అమ్మమ్మ ఊరైన పొన్నెకల్లు రావాలని పిలిచాడు. దాంతో ఆమె అక్కడికెళ్లగా వారి మధ్య పెళ్లి ప్రస్తావన రావడంతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే అభిలాష్ తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, తన చావుకు అభినే కారణమని శ్రీకల్యాణి సెల్ఫీ వీడియో తీసుకొని ఆ ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. వెంటనే అభి కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి శ్రీకల్యాణిని ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కల్యాణి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ రాజు వెల్లడించారు. అయితే అభిలాష్ ఇద్దరు అమ్మాయిలతో ప్రేమాయణం సాగించడమే శ్రీకల్యాణి ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.