Share News

Chegunta: మామ మరణ వార్త విని కోడలి మృతి

ABN , Publish Date - Mar 09 , 2025 | 03:39 AM

సిద్దిపేట జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేటకు చెందిన ఆరేళ్ల పోశయ్య(65)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు భార్య సుమలత.. కుటుంబ కలహాల నేపథ్యంలో వారం క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.

Chegunta: మామ మరణ వార్త విని కోడలి మృతి

  • వారం క్రితం ఆత్మహత్యకు యత్నించిన కోడలు

  • ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం

  • తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన మామ

  • ఒకే రోజున గంటల వ్యవధిలో ఇద్దరి మృతి

చేగుంట, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ ఇంటి కోడలు ఆత్మహత్యకు చేసిన ప్రయత్నం ఆ కుటుంబానికి ఊహించని విషాదాన్ని మిగిల్చింది. ఆత్మహత్యకు యత్నించిన కోడలిని ఆస్పత్రికి తరలిస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రి పాలైన ఆమె మామ(భర్త తండ్రి) శనివారం మరణించగా.. ఈ విషయం తెలుసుకున్న ఆ కోడలు కూడా కాసేపటికే చనిపోయింది. సిద్దిపేట జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేటకు చెందిన ఆరేళ్ల పోశయ్య(65)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు భార్య సుమలత.. కుటుంబ కలహాల నేపథ్యంలో వారం క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.


కుటుంబ సభ్యులు ఆమెను గజ్వేల్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌ రోడ్డు ప్రమాదానికి గురైంది. అంబులెన్స్‌లో ఉన్న పోశయ్య తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయన కూడా ఆస్పత్రి పాలయ్యారు. ఆరోగ్యం కుదటపడటంతో సుమలత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవ్వగా.. పోశయ్య శనివారం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న సుమలత వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఆమెను వెంటనే తుప్రాన్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆమెను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా సుమలత మార్గమధ్యలోనే ప్రాణం విడిచింది.

Updated Date - Mar 09 , 2025 | 03:39 AM