Hyderabad: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:54 AM
వివాహేతర సంబంధాల వ్యవహారం మరో ప్రాణం తీసింది. ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను గొంతు నులిమి, డంబెల్‌తో తలపై బాది హత్య చేసింది.
కుమారుడిని గణేశ్ మండపంలో నిద్రపొమ్మని చెప్పి ప్రియుడిని పిలిచి ఘాతుకం
గొంతు నులిమి, డంబెల్‌తో మోది హత్య
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఘటన
హైదరాబాద్ సిటీ/దిల్‌సుఖ్‌నగర్/ఊర్కొండ, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధాల వ్యవహారం మరో ప్రాణం తీసింది. ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను గొంతు నులిమి, డంబెల్‌తో తలపై బాది హత్య చేసింది. ఎవరితోనో గొడవపడి వచ్చి పడుకున్నాడని.. నిద్రలోనే చనిపోయాడని నాటకం ఆడింది. కానీ పోలీసుల విచారణలో దొరికిపోయింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో గురువారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం మాదారం గ్రామానికి చెందిన జల్లెల శేఖర్ (40)కు రంగారెడ్డి జిల్లా వెల్దండ మండలం కుప్పగుండ్లకు చెందిన చిట్టి (33)తో 2009లో వివాహం జరిగింది. వారికి కూతురు(14), కుమారుడు(12) ఉన్నారు. బతుకుదెరువు కోసం వారు సరూర్‌నగర్‌లోని కోదండరామ్‌నగర్‌కు వలసవచ్చారు. శేఖర్ కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. చిట్టి వస్త్రాల దుకాణంలో పనిచేస్తోంది. వారి కుమార్తె ప్రభుత్వ హాస్టల్‌లో ఉండగా, కుమారుడు తల్లిదండ్రుల ఉంటూ స్థానిక పాఠశాలలో చదువుతున్నాడు.
వివాహేతర సంబంధం, గొడవలతో..
చిట్టికి స్థానికంగా ఉండే హరీశ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే భార్య ప్రవర్తనలో మార్పురావడం, నగలు, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తుండటంతో శేఖర్‌కు అనుమానం వచ్చి నిలదీశాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య గొడవలు జరగుతున్నాయి. ఈ క్రమంలో భర్త అడ్డుతొలగించుకోవాలని చిట్టి ప్రణాళిక వేసింది. గురువారం రాత్రి కుమారుడిని గణేశ్ మండపం వద్ద స్నేహితులతో కలసి నిద్రపొమ్మని పంపింది. అర్ధరాత్రి తర్వాత ప్రియుడు హరీశ్‌ను ఇంటికి పిలిచింది. ఇద్దరూ కలసి నిద్రపోతున్న శేఖర్‌ను గొంతు నులిమి చంపారు. చనిపోయాడో లేదోనన్న అనుమానంతో ఇంట్లో ఉన్న డంబెల్‌తో అతడి తలపై మోదారు. తర్వాత హరీశ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఉదయమే చిట్టి డయల్ 100కు ఫోన్ చేసింది. తన భర్త రాత్రి ఎవరితోనో గొడవపడి వచ్చి నిద్రపోయాడని, ఉదయం చూస్తే చనిపోయి ఉన్నాడని చెప్పింది. పోలీసులు ఘటనా స్థలంలో పరిస్థితిని పరిశీలించి, చిట్టి తీరుపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్టు ఆమె బయటపెట్టడంతో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
మామను హతమార్చిన కోడలికి జీవితఖైదు
సహకరించిన ప్రియుడికీ అదే శిక్ష .. నల్లగొండ మహిళా కోర్టు తీర్పు
నల్లగొండ క్రైం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): మామను హతమార్చిన కేసులో కోడలితో పాటు ఆమె ప్రియుడికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ నల్లగొండ నాలుగో అదనపు జిల్లా-సెషన్స్ కోర్టు, మహిళా కోర్టు జడ్జి కవిత శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ కేసు వివరాలను ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మీడియాకు వివరించారు. నకిరేకల్ మండలంలోని పాలెం గ్రామానికి చెందిన బొబ్బిలి పద్మకు అదే గ్రామానికి చెందిన ఆవుల వేణుతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. 2017 ఆగస్టు 3న పొలానికి వెళ్లిన మామ భిక్షమయ్య భోజనం చేసేందుకు ఇంటికి వచ్చాడు. అదే సమయంలో ఇంట్లో ఉన్న కోడలు పద్మ, ఆమె ప్రియుడు వేణును చూసి తన కుమారుడు లింగయ్యకు చెబుతానని హెచ్చరించాడు. దీంతో తమ విషయం బయటపడుతుందని భయపడి ఇద్దరూ కలిసి భిక్షమయ్యను హత్య చేశారు. మద్యం మత్తులో కిందపడి బలమైన గాయమవడంతో చనిపోయాడని భర్తకు తెలిపింది. అయితే కొట్టి, హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదిక రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో హత్యచేసినట్లు నిందితులు కూడా అంగీకరించారు. ముద్దాయిలకు జీవితఖైదుతోపాటు, రూ.4వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..