పూడికతీతకు అనుమతినివ్వండి
ABN , Publish Date - Feb 07 , 2025 | 03:46 AM
కడెం నారాయణ రెడ్డి, లోయర్ మానేరు, మిడ్ మానేరు రిజర్వాయర్లలో పూడికతీత పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడానికి అనుమతి ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని నీటిపారుదల శాఖ కోరింది.

ఎన్నికల సంఘానికి నీటిపారుదల శాఖ లేఖ
హైదరాబాద్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): కడెం నారాయణ రెడ్డి, లోయర్ మానేరు, మిడ్ మానేరు రిజర్వాయర్లలో పూడికతీత పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడానికి అనుమతి ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని నీటిపారుదల శాఖ కోరింది. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో అధికారులు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
పూడికతీత పనులు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం లేనందున పూడికతీత పనులకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా మూడు రిజర్వాయర్లలో పూడికతీతను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రెండు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. శుక్రవారం టెండర్లను తెరవనున్నారు. ఆ తర్వాత వర్క్ ఆర్డర్ ఇచ్చే అవకాశాలున్నాయి.