Water Logged In MGBS: మూసీ ఉగ్రరూపం.. నీట మునిగిన ఎంజీబీఎస్..
ABN , Publish Date - Sep 27 , 2025 | 07:20 AM
మూసీ ఉధృతికి నది ఒడ్డున ఉన్న ఎంజీబీఎస్ బస్టాండ్‌లోకి వరద నీరు పోటెత్తింది. బస్టాండ్‌లో ఎక్కడికక్కడ నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాదర్‌ఘాట్ సమీపంలోని మూసానగర్‌లో 200 ఇళ్లు వరదలో మునిగిపోయాయి.
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం అస్తవ్యస్తం అయింది. జంట జలాశయాల గేట్లు ఎత్తి భారీగా వరద నీటిని దిగువకు వదలటంతో నగరం మధ్యలో మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత మూసీ ఉగ్రరూపం దాల్చింది. గండిపేట నుంచి మొదలు నాగోలు దాకా ప్రమాదకర రీతిలో నది ప్రవహిస్తుండటంతో సమీపంలోని ఇళ్లు మునిగాయి. మూసీ ఉధృతికి నది ఒడ్డున ఉన్న ఎంజీబీఎస్ బస్టాండ్‌లోకి వరద నీరు పోటెత్తింది. బస్టాండ్‌లో ఎక్కడికక్కడ నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వందల మంది ప్రయాణికులు బస్టాండ్‌లోనే చిక్కుకుపోయారు. గంటల పాటు భయం గుప్పిట్లో అల్లాడిపోయారు. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే ప్రయాణికులను బయటకు తీసుకురావాలని పోలీసు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. అంతేకాదు.. ఎంజీబీఎస్ పరిస్థితులను అర్థరాత్రి కూడా సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ముఖ్యమంత్రి అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇక, చాదర్‌ఘాట్ సమీపంలోని మూసానగర్‌లో 200 ఇళ్లు వరదలో మునిగిపోయాయి. చేతికందిన వస్తువులను పట్టుకుని కట్టుబట్టలతో జనం ఇళ్లలోంచి రోడ్డుమీదికొచ్చారు. ఈసీ, మూసీ వాగుల కారణంగా ఇరు వైపులా ఉన్న పంట పొలాలు నీట మునిగిపోయాయి.
ఇవి కూడా చదవండి
వెలిగొండ ఫీడర్ కాలువ లైనింగ్‌కు రూ.456 కోట్లు