Share News

Reservoir Water Levels: రిజర్వాయర్లు కళకళ.. చెరువులు వెలవెల!

ABN , Publish Date - Jul 19 , 2025 | 05:31 AM

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లలో ప్రస్తుతం 592టీఎంసీలకు పైగా నీళ్లున్నాయి. గతేడాది ఈ సమయానికి అన్ని జలాశయాల్లో కలిపి ఉన్న నీళ్లు 229 టీఎంసీలు మాత్రమే.

Reservoir Water Levels: రిజర్వాయర్లు కళకళ.. చెరువులు వెలవెల!

  • ఎగువన వర్షాలతో రాష్ట్రంలోని రిజర్వాయర్లలోకి భారీగా వరద

  • కానీ, రాష్ట్రంలో వానల్లేక నిండని చెరువులు

  • పుంజుకోని వానాకాలం పంటల సాగు

  • ఇప్పటివరకు 24ు లోటు వర్షపాతం

హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లలో ప్రస్తుతం 592టీఎంసీలకు పైగా నీళ్లున్నాయి. గతేడాది ఈ సమయానికి అన్ని జలాశయాల్లో కలిపి ఉన్న నీళ్లు 229 టీఎంసీలు మాత్రమే. అయితే, నిరుడు ఈ సమయానికి చెరువులన్నీ నీళ్లతో కళకళలాడాయి. ఈసారి ఎగువ నుంచి వచ్చే వరదతో రిజర్వాయర్లు నిండినప్పటికీ, రాష్ట్రంలో సరైన వర్షాలు లేక చెరువులు నిండలేదు. వర్షాల్లేక, చెరువుల్లో నీళ్లు లేక భూగర్భ జలాలు తగ్గి ఈ వర్షాకాలం పంటల సాగు ఇంకా పుంజుకోలేదు. నిర్ణీత సమయాని కంటే ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించి మురిపించిన నైరుతి రుతుపవనాలు తర్వాత పత్తా లేకుండా పోయాయి. వానాకాలం ప్రారంభమై నెలన్నర గడిచినా రెండు రోజుల కిందటి వరకు ఎండాకాలం లాంటి వాతావరణం నెలకొంది. సాధారణంతో పోలిస్తే ఈ వర్షకాలంలో ఇప్పటివరకు రాష్ట్రంలో 24% లోటు వర్షపాతం నమోదైంది. అయితే, గురు శుక్రవారాల్లో వర్షాలు పడినప్పటికీ అవి హైదరాబాద్‌కే పరిమితమయ్యాయి. జిల్లాల్లో చిరుజల్లులు మినహా పెద్దగా వర్షపాతం నమోదు కాలేదు.


7.79లక్షల ఎకరాల్లోనే వరినాట్లు

మే చివరి వారంలోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించటంతో రైతులు మురిసి పోయారు. చాలా ప్రాంతాల్లో తొలకరి వర్షాలకే పత్తి విత్తనాలు వేశారు. వరి నారు పోశారు. అయితే, తర్వాత వర్షాలు మొహం చాటేయడంతో రైతులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో సాధారణంగా వరి సాగు విస్తీర్ణం 62 లక్షల నుంచి 65 లక్షల ఎకరాల కాగా, ఇప్పటివరకు కేవలం 7.79లక్షల ఎకరాల్లోనే వరినాట్లు వేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పత్తి సాగు సాధారణ విస్తీర్ణం 50 లక్షల ఎకరాలు కాగా.. 38.57 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటారు.


కృష్ణాకు పెరుగుతున్న వరద

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద పెరుగుతోంది. శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్టుకు 1.18 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, జూరాలకు లక్ష క్యూసెక్కుల వరద వచ్చిచేరింది. శ్రీశైలంలో రెండు వైపులా జలవిద్యుత్‌ ఉత్పాదన చేస్తూ 69 వేల క్యూసెక్కులను సాగర్‌కు వదులుతుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ నుంచి 30 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద పంపింగ్‌ చేస్తూ నీటిని తరలిస్తున్నారు. శ్రీశైలం నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 193 టీఎంసీల నిల్వ ఉంది. ఇక నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు 67 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 1800 క్యూసెక్కులను దిగువకు వ దులుతున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 238.24 టీఎంసీల నిల్వ ఉంది.


ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 05:31 AM